| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | అశ్వమేధపర్వము - చతుర్థాశ్వాసము |
| వ. | ఇవ్విధంబున హింసారహితంబుగా మహిత యాగంబు సుప్రయోగంబు చేసి యగస్త్యుండు పరమ ప్రశస్తి నుజ్జ్వలుఁ డయి వెలింగెం; గావున ధర్మమార్గాగత ద్రవ్యకృతంబై తపోమయం బగు యజ్ఞంబు ప్రాజ్ఞజన మనోజ్ఞంబై వెలయు’ నని చెప్పిన విని జనమేజయుం డిట్లనియె. | 272 |
| తే. |
‘అనఘ! నకులరూపంబున నట్లు దోఁచి | బ్రాహ్మణులతోడ మానవ భాషణముల నెవ్వఁడేనియు నొక్క యహీన బోధ | ఘనుఁడు సల్లాప మొనరించె నని తలంచి. |
273 |
| తే. |
ఆతఁ డెవ్వఁడో? యని నిన్ను నడుగఁ జూచి | వెండియును బ్రస్తుతోక్తుల విందు మను మ నంబుతో నూరకుండితి; నాకు నతనిఁ | జెప్పఁ దగు నేని బోధనశీల! చెపుమ!’ |
274 |
| క. |
అనుటయు వైశంపాయనుఁ | ‘డనూన పుణ్య ప్రదీప్తుఁ డగు నీ కెందున్ వినఁ దగని యదియుఁ గలదే! వినిపించెద ముంగి విధము విను తెలియంగన్. |
275 |
| సీ. |
జమదగ్ని పితృకార్య సంకల్ప మత్యంత | నియతాత్ముఁడై చేసె; నిష్ఠ యొప్పఁ జారు నూతన కలశంబున హోమ ధే | నువుఁ దాన పిదికి గారవముతోడ నిమ్మైనయెడఁ బదిలమ్ముగా డించిన | నతని చిత్తము తెఱం గరయు బుద్ధి సాకారవృత్తిఁ గ్రోధాధిదైవము వచ్చి | ప్రామాదికం బను భంగి దోఁపఁ |
|
| ఆ. |
గుండతోడిపాలు గూల్చినఁ గినియక | యూరకుండె నా సముజ్జ్వలాత్ముఁ; డప్పు డాత్మ మెచ్చి యద్దైవ మతనికి | నిట్టు లనియెఁ గురుమహీశవర్య! |
276 |
| క. |
భృగువులు క్రోధను లనఁగా | జగతిఁ బరఁగు వాద; మది మృషాపరికలితం బగుట దెలిసె; నోడితి నీ; | కగణిత మగు నీ తపమున కలికెద ననఘా! |
277 |
| వ. | అని వెండియు. | 278 |
| క. |
‘నా దెసఁ బ్రసన్నుఁడవు గ; | మ్మాదరమునఁ జూడు; సైఁపు మపరాధము; వి ద్యాదయిత!’ యనిన నమ్ముని | యా దైవముఁ జూచి శాంతి యలవడ నెమ్మిన్. |
279 |
| వ. | నా యెడ నిప్పుడు. | 280 |
| క. |
నీ వేమి తప్పు సేసితి? | త్రోవుము శంకాభయంబు తొలఁగఁగ; సంక ల్పావిలతకు నలుగుట పితృ | దేవతలకుఁ గలుగుఁ; బొమ్ము దిగ్గన’ ననుడున్. |
281 |
| వ. | భీతి నా భూతం బంతర్ధానంబు చేసెం; దదనంతరంబ యాజమదగ్నిం బితృదేవతలు కోపించి పొడసూపి యతనితో ‘నీవు శ్రాద్ధంబునకు సంకల్పించి యుండి తద్వైకల్యంబు పుట్టిన నూరకుండి’ తని పలికి ‘ముంగి వయి పుట్టు’ మని శపించిన నతండు వారలకు దండప్రణామంబు చేసి ‘తపస్వికి నలుగం దగదని యపరాధంబు గనియునుం గ్రోధాధిదైవంబునకు నలుగనైతి. | 282 |
| ఆ. |
తప్పు సైఁచి నన్ను దయఁ జూచి శాపమో | క్షము ననుగ్రహింపుఁ డమితతేజు లార!’ యని వినీతిలంపటుం డగుచుఁ బ్రా | ర్థించుటయును వారు తెలివి నొంది. |
283 |
| వ. | ‘విదగ్ధ విప్రసమూహం బొడంబడునట్టి యుచిత వాక్యంబుల నీ వెన్నఁడేని మహాధర్మంబు కీడని యాడితి నాఁడు నీకు శాపమోక్షం బగు’ నని నిర్దేశించి; రన్నకులంబును సక్తుప్రస్థుని కతంబునం దగిన మాటల నా తెఱంగున సదస్యులతో ధర్మనందను నశ్వమేధంబు నధిక్షేపించి విగత శాపత్వానందంబు నొంది యంతర్హితంబయ్యె’ నని యిట్లు జనమేజయునకు వైశంపాయనుండు పాండవాగ్రజు నశ్వమేధంబు విధంబు విస్తార ప్రస్తవనీయంబుగా వివరించుటయు. | 284 |