| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | భీష్మపర్వము - ప్రథమాశ్వాసము |
| వ. | అని సంజయుండు పలవించు పలుకులకుఁ జిత్తంబు జల్లని యొల్లంబోయి మూర్ఛిల్లి కొండొక సేపునకు శిశిర విధానంబుల సేద దేఱి ధృతరాష్ట్రుండు గన్నీరు దొరంగ గద్గదకంఠుండై. | 50 |
| క. |
‘దేవాసురవరు లొక్కటి | యై వచ్చినఁ జిక్కువఱుచు నాహవమున నా దేవవ్రతుఁడు శిఖండి శ | రావలి పాలయ్యె; నేమి యనఁగల దింకన్! |
51 |
| ఉ. |
అంచిత తాలకేతుకిరణాళి మెఱుంగులు గాఁగ, మౌర్వి మ్రో యించుట గర్జచందముగ నేచి విరోధిదవానలంబు మా యించు శితాస్త్రవర్షమున నిట్టిది భీష్మమహాభ్ర; మె ట్లడం గించెనొకో శిఖండి యను కృత్రిమ వాయువు దాఁకి దైవమా! |
52 |
| తే. |
పెరిఁగి పాండవాంబుధి వెల్లివిరిసినపుడు | నిలువ నిమ్మగు దీవిగా నిన్నుఁ దలఁచి యుండ నత్యంతతుచ్ఛ శిఖండి పల్వ | లాక్రమంబున మునిగితే యకట తండ్రి! |
53 |
| ఉ. |
వీరరసాంబుపూరమును విశ్రుతబాహు మహోగ్ర సత్త్వముం జారుగదాధ్వజాచలవిశాలము నంబకజాలవీచికా స్ఫారము నైన భీష్ముఁడను సాగరముం గడవంగ నీఁదఁగా నేరిమి యెట్లొకో కలుగ నేర్చె శిఖండికి? నేమి సేయుదున్! |
54 |
| తే. |
అంబకై పూని వచ్చి బలాధికుండు | జామదగ్న్యుండు సాధింపఁ జాలకున్న వాని భీష్ముఁ బాండవులకై పూని వచ్చి | కడిమి సాధించి తౌర! శిఖండి పోర. |
55 |
| క. |
ఆ శౌర్యం బా సత్త్వం | బా శీలం బా పరాక్రమాభీలత్వం బా శుద్ధవ్రత మెందు న | నాశము లని భీష్ముఁ బెద్ద నమ్మితిమి గదే. |
56 |
| వ. | అని బహుప్రకారంబులం బలవించి యా సూతనందను చేసేతం గీలించి. | 57 |
| సీ. |
‘అతఁడు నొచ్చిన తఱి నడ్డంబు సొచ్చెద | మని వచ్చువారు లేరైరె యచట? నడరి పోరాడక యన్ని యక్షౌహిణు | లొప్పరికించెనె యొకనిఁ గలన? నతని నోర్వఁగఁ జాలవని నిశ్చయించితి | మంతకు నోపెనే యరిబలములు? ద్రోణుండుఁ గృపుఁడును ద్రోణసుతుండును | శల్యుండుఁ గ్రేడించి చనిరె యపుడు? |
|
| తే. |
పాండుసుతులు శిఖండియుఁ జండశక్తి | మెఱయ నొక్కటఁ బైఁ బడ్డ వెఱచి తాత విడిచి నా పుత్రులందఱు విఱిగి యడవిఁ | గలిసిరొకొ? యాతనికిఁ బడవలసె నకట! |
58 |
| వ. | దేవవ్రతుండు దెగినయప్పుడ తక్కినయంతవట్టునుం దెగియనకాఁ దలంచెద’ నని మఱియు నిట్లనియె. | 59 |
| సీ. |
‘కులగురు వృద్ధు నిర్మలచిత్తు గాంగేయుఁ | జంపి రాజ్యము సేయ సమ్మతించి తొడరిన పాండుపుత్రులకును దైవంబుఁ | దోడయ్యె; ధర్మంబు గీడుపఱిచి పరఁగి యధర్మంబు పెరిఁగిన ట్లున్నది; | వార లాతనిఁ గూల్చి వసుధఁ గొనఁగ నిశ్చయించుట గడు నిష్ఠురత్వము; దాని | కంటెను బాపంబు గాదె మనకు |
|
| తే. |
సంగరంబున నాతండు సచ్చు టోర్చి | సంపదకుఁ గాఁ బెనంగిన చంద మరయఁ; గులములం దెల్ల నీ రాచకులము సాల | బెట్టిదం; బిక్కులంబునఁ బుట్ట నగునె?’ |
60 |
| వ. | అని పలుమాట లాడి వెండియు. | 61 |
| ఆ. |
మగఁడు లేని మగువ మాడ్కి గాకున్నె నా | సేన భీష్ము లేమిఁ జేసి నేఁడు; కురుకుమారు లెంత గుందిరో? యెవ్వరే | మైరొ? యింక నెట్టు లగుదు రొక్కొ! |
62 |
| క. |
రాజులు మంత్రులు ననియెడు | నా జూదరు లాత్మ నేమి యని తలఁచిరొ? యే యోజం బలికిరొకో! తమ | కాజికి నిట మీఁద నెవ్వ రాధారంబో?’ |
63 |
| వ. | అని పలికి సంజయుకరంబు విడిచి ‘కయ్యం బెయ్యెడం బొడిచిరి? పది దినంబులు నుభయబలంబుల వారును నెవ్విధంబున మోహరించి? రెవ్వ రెవ్వ రెప్పు డెప్పు డేమి సేసి? రిన్నాళ్ళు గాంగేయుఁ డెబ్భంగుల సంగరంబు సేసెఁ దుది నెత్తెఱంగునం దెగియె? నంతయు వివరించి పరిపాటిం దేటపడం జెప్పుము. | 64 |
| ఉ. |
నెట్టన యాపగాసుతుఁడు నేలకు వ్రాలె ననంగ విన్న నా కట్టిఁడి వీను లేమి వినుకాఱియ కోర్వవు? దుర్వినీతికిం బుట్టినయిల్లనై వినక పోవఁగ వచ్చునె? యింక నాకు నే దిట్టఁడ నైతి; నెల్లవియుఁ దెల్లముగా విననేర్తు సంజయా!’ |
65 |
| వ. | అనిన విని సంజయుం డతని కిట్లనియె | 66 |
| ఆ. |
అధిప! నీవు సెప్పినట్టిద; నీ యవి | నీతిఁ జేసి ధర్మనిరతు లైన పాండుసుతుల కన్ని పాటులు వాటిల్లె; | నింత దెచ్చికొంటి వంత సేసి. |
67 |
| క. |
కీ డొనరించినవారికిఁ | గీ డగు టరుదయ్య? మేలు గీ డేమియు నీ వాడక విను; ననుఁ గయ్యముఁ | జూడఁగఁ బుచ్చుట వినంగఁ జూచియ కాదే! |
68 |
| క. |
వేదవ్యాస మునీశ్వరు | పాదంబులు దలఁచి మ్రొక్కి భక్తిరసైకా స్వాదన సుకరానందో | త్పాదన దివ్యమతి నగుచుఁ దగ నెఱిఁగింతున్. |
69 |
| వ. | అనిన నాంబికేయుండు ‘నట్లకాక యెఱింగింపు’ మనుటయు సంజయుండు. | 70 |