పురాణేతిహాసములు శ్రీమహాభారతము భీష్మపర్వము - ప్రథమాశ్వాసము
శ్రీకృష్ణుఁ డర్జునునకుఁ దత్త్వజ్ఞానోపదేశంబు సేయుట (సం. 6-24-19)
ఆ. ఇట్టు లగుటఁ జేసి యెవ్వరి దెసకు శో | కంబుఁ బొందఁ గారణంబు లేదు;
జీవుఁ డెల్లభంగిఁ జెడియెడువాఁడు గాఁ | దలఁచితేని వగవవలదు మున్న.
197
క. పురుషుఁడు సెడు ననువాఁడును, | బురుషుఁడు సెఱుచు నని పలుకు పురుషుండును న
య్యిరువురు నవివేకుల; య | ప్పురుషుఁడు సెఱుపండు సెడఁడు భుజవీర్యనిధీ!
198
క. పురుషుఁ డన వే ఱొకండే | పురుషోత్తముఁ డైన యేన; పురుషోత్తమతా
స్ఫురణకుఁ బురుషత్వం బను | మెరమెర గల; దదియ కాదె మెయికొనుఁ గ్రియకున్‌.
199
వ. అని వెండియు వివిధవాక్యంబుల నాత్మునకు బాధ్యబాధకత్వంబులు లే కునికి వివరించి వివ్వచ్చునకుం గృపాశోకంబులకు మూలంబు లగు నహంకారంబులు వారించి, యతనికి రణోత్సాహంబునకుం గారణం బైన స్వకర్మావలంబనంబు వదలం దగమి దెలియుటకు వలయు వాక్యంబులు పెక్కు లుపన్యసించి. 200
క. సమరంబు రాజులకు ను | త్తమకర్మం బది; యపావృతస్వర్గ ద్వా
రము సుమ్ము; లెమ్ము! దగఁ గ | య్యము సేయుము; దీనికేల యనుమానింపన్‌?
201
క. ఫలముల యెడ బ్రహ్మార్పణ | కలనపరుం డగుచుఁ గార్యకర్మము నడపన్‌
వలయుం దత్త్వజ్ఞానము | తలకొనినం గర్మశమము దానై కలుగున్‌.
202
వ. అని మఱియు నీదృశంబు లగు వాక్యంబు లనేకంబు లనుగ్రహించుచు వివిధప్రకారంబుల వికల్పించి విజయుం డడిగిన వాని కెల్ల సదుత్తరంబు లిచ్చి సందేహంబు వాపుచు. 203
క. భారమున నులిచి త్రెంపక | కారాకులు డుల్లినట్లు కర్మము లెల్లం
దార పెడఁబాయ వలయుట | సారకృపం దెలియఁ జెప్పె శౌరి యతనికిన్‌.
204
వ. ఇవ్విధంబునం జెప్పిన విని కవ్వడి సముత్థితుం డై జగన్నాథున కిట్లనియె. 205
మ. ‘అతిగుహ్యం బిది; నీవు భూరికృప నీ యధ్యాత్మముం గానఁ జే
సితి; నా కిమ్మెయి విన్కిఁ గొంత భ్రమ వాసెన్‌; యోగిహృద్ధ్యేయ మై
యతులైశ్వర్యవిభూతి నొప్పు భవదీయం బైన రూపంబు సూ
చు తలం పెత్తెడుఁ; బోలునేని దయఁ జక్షుఃప్రీతిఁ గావింపవే.’
206
వ. అనిన విని యచ్యుతుం డతని కిట్లనియె. 207
క. ‘నానాస్ఫుట వర్ణంబులు | నానాభంగులును గలుగు నారూపములో
నానాశ్చర్యవిధంబులు | గానఁగ నగుఁ జూపెదం బ్రకాశస్ఫూర్తిన్‌.
208
క. విను మానుషచక్షుర్గతి | గనుఁగొన శక్యంబు గాదు గావున దానిం
గనుట కయి దివ్యచక్షు | ర్జననం బొనరింతు నీకు శత్రువిదారీ!’
209
వ. అని యతనికి దివ్యదృష్టి యొసంగి యోగీశ్వరేశ్వరుం డైన యాలక్ష్మీశ్వరుండు దనదివ్యరూపంబు సూపె; నా విశ్వరూపుని దివ్యతేజంబు సహస్రసూర్యప్రభానిభం బనుటయుం జాలకుండుం గావున వాక్రువ్వం గొలఁది గా; దట్టి మహామూర్తిఁ గనుంగొని ధనంజయుండు విస్మయరోమహర్షణప్రహర్షోత్కర్షంబులతో దండప్రణామంబులు సేసి నిలిచి కేలు మొగిడ్చి యి ట్లనియె. 210
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )