పురాణేతిహాసములు శ్రీమహాభారతము భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము
ధర్మజుఁడు గోపాలదేవు పాలికిం జనుట (సం. 6-46-1)
వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె. 2
తే. అట్లు దనవారు మేలు చే యైన భంగి వినిన ధృతరాష్ట్రుఁ డా సూత తనయుతోడ
నెలమి నటమీఁది వృత్తాంత మెట్లు సెప్పు మనినఁ గురువంశవర్య యిట్లనియె నతఁడు.
3
వ. ఆ రాత్రి ధర్మతనయుండు విషణ్ణచిత్తుండై తమ్ములం దగువారలం గూర్చికొని గోపాలదేవుపాలికిం జని యతనితో నిట్లనియె. 4
చ. ‘ఎరగలి చిచ్చు గాఱడవి యెల్లను బెల్లుగ నొక్కపాయగా
దరికొని రూపడంచిన విధంబున నిక్కడిసేన యంతయుం
దరమిడి చంపె భీష్ము బలదర్ప మహోగ్రతఁ గంటె? నింక నే
బిరుదొకొ నీలమేఘ మనఁ బేర్చి యనిం దెగటార్చు నాతనిన్‌?
5
చ. అలవి యెఱుంగ నేరక మహాత్ముని లోకముతోడి పాటిగాఁ
దలఁచితి; బేలనైతి; శరతాడనపీడితు లైరి నీ మఱం
దులు; నమరాపగా తనయుతోడి రణంబునకున్‌ దిశాధినా
థులు నఱుమంగఁ జాల రని తోఁచుచునున్నది నా మనంబునన్‌.
6
చ. అతని జయించు నంచు మన మర్జును నెంతయు నమ్మి యుండఁగా
నితఁడును సంగరంబున నుపేక్షకుఁ డయ్యె; వృకోదరుం డొకం
డ తఱికిఁ జొచ్చి దోర్బలము డాఁపక పోరెడు; నేమి సేయు? నా
కితనిని నీతనిం దడవ నేటికిఁ? గయ్యపుజోలి మానెదన్‌?
7
క. నరపతుల నెల్ల భీష్మున | కెరగా నొప్పింపఁజాల; నే నడవులకున్‌
మరలం బోయెద; నచటం | దిరిగెదఁ; గూరాకు గోసి తినియెద ననఘా!
8
క. నీ మాట మెయిన చేయుదు | మే మెయ్యది యైన నెందు నెప్పుడు మాకున్‌
దామోదర! యశుభస్థితి | లేమి శుభము కలిమి నీదు లీలయ కాదే!
9
వ. చేయం గల పని యెయ్యది? పనుపు’ మనినం బద్మనాభుండు పాండవాగ్రజున కిట్లనియె. 10
ఉ. ‘నెవ్వగ యింత యేల? విను! నీ కెదు రెవ్వరు? నీదు తమ్ములం
దెవ్వరు సూచినన్‌ జగము లిన్నియు గెల్వఁ గలారు; లావునం
గ్రొవ్విన భీష్ము నోర్చు రణకోవిదుఁ డైన శిఖండి; యేను నీ
కొవ్వనివారి నెల్లఁ గ్రమయుక్తి లయం బొనరింతు నెమ్మెయిన్‌.
11
క. సత్య పరాక్రముఁ డగు నీ | సాత్యకి బాహాబలంబు సమరవిహారౌ
ద్ధత్యముఁ జూచెదు గాదే | యత్యాశ్చర్యంబు లితని యస్త్రవిధంబుల్‌.
12
శా. ఉద్యద్విక్రము లైన యీ ద్రుపద మత్స్యోర్వీపతుల్‌ నిన్ను సం
పద్యోగోజ్జ్వలుఁ జేయఁ బూని కడఁకం బ్రాణంబు లీనున్న ని
ట్లుద్యోగం బెడలంగ నేమిటికి? నీ కుర్వీశ! వే యేల? ధృ
ష్టద్యుమ్నుం డొకరుండ విద్విషదవష్టంభంబు మాన్పింపఁడే?’
13
వ. అనవుడు ధర్మతనయుండు ధృష్టద్యుమ్ను నాలోకించి. 14
ఉ. పాండవ సైన్య సంఘ పరిపాలన సేయు నితండ యంచుఁ గృ
ష్ణుం డభిషేక సంపదుపశోభితుఁ జేయఁగ, నాధిపత్య ము
ద్దండతఁ బూని తీ నృపులుఁ దమ్ములు నేనును జుట్టి రాఁ; జమూ
మండలి నూలుకొల్పికొని మార్తుర నోర్చినఁ గాక యొప్పునే!’
15
వ. అని యగ్గించినం బొంగి పృషతపౌత్త్రుండు గుంతీపుత్త్రున కిట్లనియె. 16
చ. ‘జగ మెఱుఁగంగ ద్రోణు ననిఁ జంపుటకై సృజియించె ధాత న;
న్మగఁటిమి గాఁగ దీనిఁ బలుమాఱు ననం బని లేదు; భీష్ముఁ డా
దిగఁ గురుసేనలోన గణుతింపఁగఁ బేర్చిన యోధకోటి నా
మొగమునఁ బడ్డ నె ట్లడరి ముట్టెదనో యటు సూచుచుండుమీ!’
17
తే. పృషతకులముఖ్యుఁ డిమ్మెయిఁ బేర్చి పలుకు | సంగరోత్సాహకరవాక్యభంగి కపుడు
పాండుసుతులును సకల భూపతులు సంత | సంబు నొందిరి, హరియుఁ బ్రియంబు నొందె.
18
వ. తదనంతరంబ యుధిష్ఠిరుండు ధృష్టద్యుమ్నున కిట్లనియె. 19
ఉ. ‘తొల్లి గురుండు దానవులతోడి రణంబున వజ్రపాణికిన్‌
దెల్లమి గాఁగఁ జెప్పె నది దీప్తతరం బగు నొడ్డనంబు శో
భిల్లుచు వైరి దృష్టులకు భీకరమై చనుఁ గ్రౌంచనామకం
బెల్లి ఘటింపు నీదు వెర వేర్పడ నమ్మొన యద్భుతంబుగన్‌.’
20
వ. అనిన విని యతండట్ల చేయువాఁడ నని పలికె నట్లు గలంక దేఱి కృష్ణు వీడ్కొని యెల్లవారల నిజనివాసం బులకుం బోవం బనిచి ధర్మతనయుం డభ్యంతరావాసంబున కరిగెఁ; బ్రభాతం బగుటయుఁ బాండవసైనికుల డెందంబులతోడన యరవిందంబులు వికాసంబు నొందెం ‘బదంపడి తదీయ ప్రతాపోదయసహవర్తి యగుచు మార్తాండోదయంబు వెలుంగుటయుం గాలోచిత కృత్యంబులు నిర్వర్తించి కౌంతేయాగ్రజుండు వెడలెఁ; గ్రౌంచవ్యూహంబు సంఘటించు నెడం జంచుత్వంబు భజించి ఫల్గునుండు గాండీవకపిధ్వజంబులు మెఱయం బొలిచి నిలిచెఁ; గుంతిభోజుండును శైబ్యుండును జక్షుస్థానంబులం దేజరిల్లిరి; ద్రుపదుండు శిఖకు నమరె; దశార్ణ శూరసేన కిరాత దేశాధీశులు కంఠాకారంబుఁ దాల్చిరి భీమసేనుండును ధృష్టద్యుమ్నుండును దక్షిణవామపక్షంబు లయిరి; సౌభద్ర సాత్యకి ద్రౌపదేయ పౌండ్ర చోళపాండ్యులు భీమసేను వలను నకుల సహదేవ హైడింబశంబర వత్సమహీపతులు ధృష్టద్యుమ్ను దిక్కునం బన్నిరి; కేకయ కాశిరాజులతోడం గూడి విరాటుండు జఘన భాగభంగికిం దగియుండె; హూణపతి ప్రముఖులు పరివేష్టింప వెన్నయి యుధిష్ఠిరుం డొప్పె; నివ్విధంబున మోహరించిన యప్పుడు . 21
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )