పురాణేతిహాసములు శ్రీమహాభారతము భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము
భీష్ముని షష్ఠదివస యుద్ధక్రమము (సం. 6-71-1)
వ. ఏనవనాఁటి రాత్రి సనుటయుఁ దెలతెల వేగునప్పుడు ధనంజయుండు సేనాపతి రావించి మకరవ్యూహంబు సంఘటింపు మని నియమించిన నఖిలజనంబులకుఁ బ్రీతి నెక్కొన నతం డమ్మోహరంబు దీర్చునెడ దానికిఁ బార్థపాంచాలపతులు శిరంబును గవలు గన్నులును భీమసేనుండు దుండంబును సౌభద్రద్రౌపదేయఘటోత్కచులు గండస్థలంబులును సాత్యకిసహితుండై యుధిష్ఠిరుండు గంఠంబును ధృష్టద్యుమ్న పురస్సరంబుగా విరాటుండు వెన్నును గేకయులు వామపార్శ్వంబును ధృష్టకేతుండును గరూశపతియును దక్షిణపార్శ్వంబును గుంతిభోజశతానీకులు జఘనంబును శిఖండియు నిరావంతుండును బుచ్ఛంబును నై పన్నిరి; భీష్ముండు దానికిఁ బ్రతివ్యూహం బూహించి క్రౌంచవ్యూహం బమర్చి యందుఁ జంచువునం దాను గురు సహాయుం డైనిలిచి నేత్రంబులఁ గృపగురుపుత్త్రులును మస్తకంబునఁ గృతవర్మయుఁ గాంభోజ బాహ్లికులును గళంబున శూరసేనపరివృతుండై సుయోధనుండును నురంబున సౌవీర సమేతుండై భగదత్తుండును వీఁపున విందానువిందులును వామపక్షంబున సుశర్మయు దక్షిణపక్షంబున యవనపతియు నపరభాగంబున శ్రుతాయురుపేతుండై భూరిశ్రవసుండును నిలిచి రిట్లుభయసైన్యంబులు సన్నద్ధంబు లై నడచి శంఖభేరీ ప్రముఖ తూర్యనాదంబులు సెలంగం దలపడియె నట్టిసమయంబున. 344
క. తలకడచి నడచు ద్రోణుని | యలవుఁ బలంబును సహింప కనిలతనయుఁ డి
ట్టలమగు రోషంబునఁ ద | ద్బలముపయిం బఱపె రథముఁ బటువేగమునన్‌.
345
వ. ఇట్లు వఱపిన నతనికోల్తలకుం గాక. 346
క. తనముందటి యోధులు పిఱు | సనుటయుఁ గుంభజుఁడు గినిసి శరనవకము భీ
మునిమేన నాట నాతఁడు | సునిశితభల్లమున నతని సూతుం దునిమెన్‌.
347
క. వాహనముఁ దాన నడపుచు | సాహసికత్వమున గురుఁడు సమరక్రీడో
త్సాహము వదలక వైరి | వ్యూహము దలఁకంగ భుజసముద్ధతి గవిసెన్‌.
348
క. మీ తండ్రి ద్రోణునకుఁ దో | డై తఱిమినఁ గేకయులు భయాకులత మరు
ద్ధూతాంబుదగతిఁ దెరలఁగ | నాతత సృంజయబలంబు లఱిముఱి విరిగెన్‌.
349
ఆ. అధిప! భీమసేనుఁ డడరినఁ గౌరవ | సైన్య మతనిచేతఁ జాఁపకట్టు
వడియెనపుడు ధరణిపతు లిద్దఱును జేయి | వీచి తఱిమి రధిక విక్రమమున.
350
వ. ఇవ్విధంబున ధర్మనందన దుర్యోధను లగ్గలికం బురికొలుప మొగ్గరంబులు రెండును గండు మిగిలి తలపడియె’ ననిన విని ధృతరాష్ట్రుండు సంజయున కిట్లనియె. 351
ఆ. ‘మనబలంబునందు మంచి మగల్‌ సాల | గలిగి యా బలంబు గెలువలేమి
దైవకృతము గాదె! తలఁపఁ జోద్యము మున్న! యెఱుఁగఁ జెప్పె విదురుఁ డిట్టు లగుట.
352
క. అతఁ డెంత సాటి చెప్పిన | మతి హితముగఁ గొనఁడు కీడు మానఁడు కడు దు
ర్మతి యైన నా తనూజుఁడు | మతి కర్మము వెనుకఁ జనక మానునె? యెందున్‌.
353
వ. విధికృతం బెవ్వరికి నుడుప వచ్చు నెట్లు గా నున్నది యట్లయ్యెడుం గాక ’ యనిన సంజయుం డతని కి ట్లనియె. 354
ఆ. ‘నీ తనూభవుండు నెఱిగుఱి యెఱుఁగమి | యెఱిఁగియెఱిఁగి యతని నేలచెప్ప ?
మన యుపేక్షవలన విను నాఁటి జూదంబ | నేఁడు గయ్య మయ్యె నృపవరేణ్య!
355
వ. ఇంకఁ బశ్చాత్తాపం బుడిగి ధీరుండ వై సమర ప్రకారంబు విను మట్టియెడ భీమసేనుండు భవత్సేనాసాగరంబు పాయ వడం దఱిమి చొచ్చి దుశ్శాసనుండును దుర్విషహుండును దుర్మదుండును దుస్సహుండును జయుండును జయత్సేనుండును వికర్ణుండును జిత్రసేనుండును సుదర్శనుండును జారుచిత్రుండును సువర్ముండును దుష్కర్ణుండును నొక్కచో నున్నం గనుంగొని యక్కుమారులం దాఁకిన. 356
తే. వారలందఱు నొండొరుఁ బేరువేరఁ | బిలిచికొని వీఁడె సనుదెంచె భీముఁ డీతఁ
డొంటి యగపడ్డ చోటన యుక్కడంగఁ | బొదివి చంపుద మని యతిస్ఫురణ సేసి.
357
క. ఉగ్రగ్రహములు లయకా | లగ్రహపతిఁ బొదువు క్రియ నలఘువిక్రమగ
ర్వాగ్రహమున ముట్టిరి రిపు | నిగ్రహలంపటుని భీమునిం జటులగతిన్‌.
358
వ. ఇట్లు నీ కొడుకులు చతురంగబలంబుతోడం జుట్టుముట్టిన వృకోదరుండు సంతసంబునం బొదలి సారథిం గనుంగొని ‘నీ వీరథం బిచ్చట నిలిపికొని యుండు’ మని నియోగించి గద వుచ్చికొని ధరణికి లంఘించి. 359
చ. కవిసి యుగాంతదండధరుకైవడిఁ గోలుమసంగి కుంభముల్‌
పవులఁగఁ దుండముల్‌ దునియఁ బ్రక్కలు వ్రక్కలు గాఁగ దర్పముం
జవము బలంబు నొప్పఁగ గజంబుల వ్రేసిన నెత్తురొల్కఁగా
నవి వడె ధాతునిర్‌ఝ రమయాచలపంక్తులఁ బోలి మేదినిన్‌.
360
క. అరదంబులు పొడిపొడి యై | హరుల గములు నుగ్గునూచ మై మొత్తపుఁగా
ల్వురు సిదురుప లై పడ ని | ష్ఠురగతి విహరించె వాయుసూనుఁడు గదతోన్‌.
361
క. పెక్కండ్రతోడ నిమ్మెయి | నొక్కరుఁడ రథమ్ము డిగ్గి యురవడిఁ జని పే
రుక్కునఁ బోరుట సూడఁగ | నక్కజమై యుండెఁ గౌరవాన్వయముఖ్యా!
362
ఆ. భీమసేను నపుడు పెక్కుబలంబులు | పొదువు టెఱిఁగి ద్రుపదపుత్త్రకుండు
శస్త్రగురునితోడ సరభసవృత్తి మైఁ | బోరిపోరి యుడిగి బుద్ధి గలఁగఁ.
363
క. భూరిరయంబున నద్దెసఁ | దేరు వఱపఁ బనిచి యతని తేరిపయిం ద
త్సారథిన కాంచి శోకము | గూరన్‌ గద్గదిక నెలుఁగు గుత్తుకఁ దగులన్‌.
364
తే. ‘ఆర్తుఁ డై యవ్విశోకుని నడిగె భీముఁ | డెచట నున్నాఁడు? నాయొడ లెట్లు ప్రాణ
సహిత మై యుండు? నతఁడొకచందమైన | నేమిగతిఁ బోదు? నక్కట! యెఱుఁగఁ జెపుమ.’
365
వ. అనిన విశోకుండు ధృష్టద్యుమ్నున కి ట్లనియె. 366
చ. గొదగొని ధార్తరాష్ట్రు లతిఘోరవిధంబునఁ జుట్టుముట్టినన్‌
మదమునఁ దేరు డిగ్గి హరిణంబులపైఁ జను సింహమో యనన్‌
గదఁ గొని నన్ను నియ్యెడ నకంపితసుస్థితి నిల్వఁ బంచి బె
ట్టిదముగఁ జొచ్చె నాహవ పటిష్ఠుఁడు భీముఁడు వారి సైన్యమున్‌.
367
వ. అని యవ్వల నెఱింగించిన నతండు. 368
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )