పురాణేతిహాసములు శ్రీమహాభారతము భీష్మపర్వము - తృతీయాశ్వాసము
భీష్ముని సప్తమ దివస యుద్ధక్రమము (సం. 6-77-11)
క. అన విని యూఱడి నిద్రా | జనితసుఖంబంది రేప జనపతి యనికిం
జనుటయు భీష్ముఁడు బల మె | ల్లను నెఱయఁగ దీర్చె మండలవ్యూహముగన్‌.
9
వ. అందు నడుమ నరనాథుం డొప్పియుండెఁ దమ్ములుఁ జేయంగలదొరలును సూరెల నిలిచి రంతం బాండవులును భండనంబునకు వెడలి రయ్యుధిష్ఠిరుండు మనమొనలం గనుంగొని వజ్రవ్యూహంబు గల్పింపుమని సేనాపతిం బనుప నతండును దత్ప్రకారంబున సైన్యంబు సన్నద్ధంబు సేసిన నది పరబలంబు మెచ్చక తఱిమి తూర్యధ్వను లెసఁగం దాఁకె, నప్పుడు ద్రోణుండు విరాటుని, ద్రౌణి శిఖండిని, దుర్యోధనుండు ధృష్టద్యుమ్నుని, మద్రపతి గవలను, విందానువిందులు యుధామన్యునిఁ బెక్కండ్రురాజులు బీభత్సుని మార్కొనిరి. భీమసేనుండు గృతవర్మను, సౌభద్రుండు చిత్రసేన దుశ్శాసన వికర్ణులను, ఘటోత్కచుండు భగదత్తుని, సాత్యకి యలంబుసుని, ధృష్టకేతుండు భూరిశ్రవసునిఁ, జేకితానుండు గృపాచార్యుని, ధర్మసూనుండు శ్రుతాయువును, బలువురు భూపతులు భీష్మునిం దలపడి రట్టియెడఁ గృష్ణునితో జిష్ణుం డిట్లనియె. 10
తే. ‘భీష్ముఁ డొడ్డన మేర్చిన బెడఁగు సాల | నొప్పెఁ, గౌరవయోధుల యుబ్బు మెఱసె
నృపు లనేకులు నా మీఁద నిగిడి రేను | జిక్కువఱిచెదఁ జూడుమీ యుక్కు మెఱసి.’
11
వ. అని పలికి గొనయంబు సారించి. 12
క. జననాథులపైఁ బె ల్లే | సిన వారలు నొక్కపెట్ట చెలఁగి ముకుందా
ర్జునులఁ బటుబాణవర్షం | బున ముంచిన నార్చె నీదుపుత్రబలంబుల్‌.
13
వ. అప్పు డింద్రనందనుండు గోపించి యైంద్రాస్త్రంబు ప్రయోగించిన. 14
మ. అది యా బాణములెల్ల మాన్చి నరనా | థాంగంబులన్‌ గీఱి యు
న్మదశుండాలహయాళిఁ గూల్చి రభసో | న్మాదక్రియన్‌ సంభ్రమ
ప్రద మై మందర మంబుధిం గలఁచు ద | ర్పం బొప్ప నొప్పించుడుం
దదనీకంబులు వాఱి భీష్మురథ మా | ధారంబుగా నిల్చినన్‌.
15
వ. త్రిగర్తపతి మొదలయిన యమ్మహీపతులుం దెరలి తమతమ సైన్యంబులు సన్న నెలవులకుం జని యొదుంగుటయు గాంగేయుండు గడంగుటయుం గని రాజులతో రారా జిట్లనియె. 16
క. ‘సేనాసమేతుఁడగు నరు | పై నొక్కఁడ భీష్ముఁ డడర బలువిడిమైఁ దో
డై నడవ వలదె? యింతటి | మానుసులకు నేను జూడ మరలం దగునే?’
17
వ. అనిన విని యా భూపాలనికరం బాలంబునకు నూలుకొని సురనదీసూను నిరుగెలంకులం గూడుకొనియె నప్పుడు. 18
సీ. గురుఁడు విరాటుని కోదండకేతుదం | డంబులఁ ద్రుంచె రెండంబకముల
నతఁడు వేఱొకవింట నాచార్యుమేనును | సూతుని మూఁడేసిసునిశితాస్త్ర
ముల నొంచి ఘోటకమ్ములనాలుగింట నో | నేసి చాపము సిడ మెడల రెంట
నేసిన నతఁడు ద న్నెనిమిదియమ్ముల | విరథుఁ జేసిన సుతునరద మెక్కి
 
తే. యతఁడు దానును గూడి వాలంపవెల్లి | ముంచుటయుఁ గుంభజుండు గోపించి దొడ్డ
నారసం బేయ నమ్మత్స్య నాథతనయు | నురము వడిఁ గాఁడి వీఁపున నుచ్చిపోయె.
19
వ. ఇట్లు క్రూరనారాచంబు బెట్టు దాఁకిన. 20
క. విల్లును నమ్ములు విడుచుచుఁ | ద్రెళ్లుటయును శంఖుఁజూచి ధృతిగలఁగి జనం
బెల్లను జూడ విరాటుఁడు | దల్లడమునఁ బాఱ విచ్చెఁ దత్సైన్యంబుల్‌.
21
వ. అట్టిసమయంబున శిఖండి గురుపుత్త్ర ఫాలంబునఁ బటునారాచత్రయంబు నాటించిన నతం డలిగి యొక్క పెట్ట పెక్కమ్ములఁ దురంగ సూతకేతు చాపంబుల నుగ్గుసేసినం బలకయు వాలునుం గొని నేల కుఱికి పాంచాలనందనుండు సాళువంబు చందంబునం గవిసి యశ్వత్థామ యేయు బాణంబులు గృపాణంబునఁ ద్రుంచుచుం గదిసిన నతండు కోపించి. 22
తే. పలక పఱియలుగాఁ జేసి యలుఁగుఁ దునిమి | యొడల వాలంపపొది నింప నొల్లఁబోక
ద్రుపదపుత్రుండు గరవాలు దునియ వైవ | నడుమఁ బొడి సేసె నాచార్యనందనుండు.
23
వ. శిఖండియు సాత్యకిరథం బెక్కెఁ దదవసరంబున ధృష్టద్యుమ్నుండు. 24
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )