పురాణేతిహాసములు శ్రీమహాభారతము భీష్మపర్వము - తృతీయాశ్వాసము
అలంబుసునిచేత నిరావంతుఁడు మృతుం డగుట (సం. 6-86-48)
వ. అని యాతని వలను సూపినం గనుంగొని దైతేయనాథుండు. 100
ఆ. కడఁగి నడచి మాయ గావింప నయ్యిరా | వంతు నశ్వసేనయంతసేన
వుట్టి వారిమీఁదఁ బురికొని తలపడి | సమయఁ జేసె నదియు సమసె నధిప!
101
వ. అయ్యిరావంతుం డొక్కరుండును బొలివోని విక్రమంబున నలంబుసుని మార్కొని రయంబు మెఱయ మెఱుంగు మెఱసినట్లు గవిసి కరవాలంబున విల్లు దునిమిన దనుజుండు వినువీథి కెగసి మాయాశరంబుల నతని నొప్పించినం గోపించి గగనంబునకు లంఘించి. 102
క. ఘనఖడ్గంబున వానిం | దునుమ నలంబుసుఁడు దోడుతో నుజ్జ్వల యౌ
వనరూపము గ్రొత్తగఁ గై | కొని పెనఁగంబెనఁగఁ బార్థుకొడు కచలుం డై.
103
క. జననీవంశంబునఁగల | యనుపమమాయానుభావ మాత్మఁ దలఁచి శే
షునిచందంబగు రూపం | బునఁ బేర్చి యనేక నాగపుంజముతోడన్‌.
104
చ. అడరిన దానవుండు గరు డాకృతిఁ గైకొని మాయతోడ లోఁ
బడ భుజగంబులం బొదివి పట్టి రయంబున మ్రింగి యప్డు చే
డ్పడు నరుపట్టి కంఠముఁ గృ పాణమునం దెగవ్రేయ మేదినిం
బడి మొగ మొప్పెఁ బూర్ణశశి భాతి వికారము లేని చెన్నునన్‌.
105
వ. అంత వియత్తలం బుదాత్తమిహిరమండలమండితమధ్యం బయ్యె నని చెప్పిన విని ధృతరాష్ట్రుం డయ్యిరావంతుండు వడినం బాండవులును వారి యోధవీరులును జేసిన తెఱంగు సెప్పు మనవుడు సంజయుఁ డతని కిట్లనియె. 106
శా. తోడంబుట్టువుపాటు సూచి యలుకన్‌ దుర్వారశుం భద్గతిన్‌
హైడింబుండు, మహాసురేంద్రులు గజేం ద్రారూఢు లై సంగర
క్రీడాలోలతఁ దన్ను మీఱి విలయా గ్నింబోల దిక్చక్ర మ
ల్లాడన్‌ బెట్టుగ నార్చి చొచ్చెఁ గురు సై న్యంబున్‌ మహోగ్రంబుగన్‌.
107
చ. కరమున నున్న శూలమునఁ గ్రమ్ముమెఱుంగులు శత్రు సైన్య భీ
కరములుగా గజాశ్వభట కాయములన్‌ గుదిగ్రుచ్చినట్లుగాఁ
జెరువుచు వచ్చువానిఁ గురు సింహుఁడు సూచి మదాంధసింధురో
త్కరరభసాతిభీషణముగాఁ గవిసెం బటువిక్రమోద్ధతిన్‌.
108
క. వంగాధిపతియు శౌర్యో | త్తుంగతనుండగుచు నీసుతుం డలరఁగ దై
త్యుం గదిసె గాఢమద మా | తంగ ఘటలతోడ నపుడు దారుణభంగిన్‌.
109
వ. ఇట్లు దన్ను బెట్టు గిట్టిన కరినికరంబులం గని పొంగి కరవాలంబు గొని యడరి ఘటోత్కచుండు. 110
క. కరదంతకర్ణమస్తక | చరణములవి తోఁపకుండుచందముగా ని
ష్ఠురవిక్రమకేళీ వి | స్ఫురణంబున రూపుమాపె సురలు నుతింపన్‌.
111
వ. ఇవ్విధంబున గజంబులు వొలిసిన గజపురనాథుండు రోషంబున నురవడించి నారాచవృష్టి ముంచి వేగవంతుండును, విద్యుజ్జిహ్వుండును, బహ్వాశియు, నను దనుజప్రధాననాయకులం బ్రేతపతిపురంబున కనిచి యా భీమసేన తనయుతనువుననిశాతశరములు నించినం గోదండపాణియై క్రోధాగ్నిజ్వాలలు నిగుడువడువునఁ బటుబాణజ్వాలలు నిగిడించి కదిసి కురుపతి నవలోకించి యా ఘటోత్కచుం డిట్లనియె. 112
ఉ. ‘పాడియు సత్యముం గలుగు పాండుతనూజుల కీవు దొల్లి యె
ప్పాడిమెయిన్‌ సభం గరము భంగ మొనర్చితి నాఁటియందఱుం
జూడఁగ నేఁడు తత్ఫలము సూపెద నీ కని మూదలించి మై
నాడఁగ నేసెఁ గృష్ణభుజ గావలిఁ బోలిన నారసంబులన్‌.
113
క. ‘దానికిఁ జల మెడలక నీ | సూనుం డా పవనసూనుసూనునిమేనం
దా నుగ్రశరము లిరువది | యేను వెసం గీలుకొలిపె నిభపురనాథా!
114
తే. అసుర కినిసి కృతాంతజిహ్వయునుబోని | శక్తి యెత్తిన న మ్మహీశ్వరున కపుడు
వంగపతి యడ్డపడుటయు వానిగజముఁ | గూల వైచిన నాతండు నేల కుఱికె.
115
క. ఏనుంగు వడిన నచ్చటి | సేనలు దెరలుటయు రాజసింహుఁడు దన్నుం
దాన పురికొల్పికొని వెఱ | పూనక దానవునియెదుర నొక్కడ నిలిచెన్‌.
116
క. నిలిచి మహాస్త్రం బెఱ మం | టలు గ్రమ్మఁగఁ బెలుచ నేయుటయు నడుమన చె
క్కలు గాఁగ నేసి దిక్కులు | నలిగులిగా నతఁడు సింహనాదము సేసెన్‌.
117
వ. ఇట్లు సేసిన విని గాంగేయుండు గురుపక్షయోధవీరులం గలయం గనుంగొని. 118
క. ‘భీముని తనయుం డత్యు | ద్దామగతిన్‌ రాజుఁ దొడరి తత్కరటిఘటా
స్తోమంబు గూల్చి యాతని | పై మారిమసంగినట్లు బలువిడిఁ గవిసెన్‌.
119
వ. ‘ఆ ఘటోత్కచుండు దివిజులకు దుర్జయుండు’ మీరు వేవేగ రారాజుం గూడికొనుం డనిన, సేనాపతి పలుకులకు గురుకృపాశ్వత్థామచిత్రసేనులు, బృహద్బల బాహ్లికావంతీనాథభూరిశ్రవసులును, సైంధవసోమదత్త వివింశతివికర్ణులు నేకోద్యోగంబునం దమతమ యనుచరు లైన యోధవీర సహస్రంబులతో రథంబులు దోలికొని చని భవత్తనయుం బరివేష్టించి హిడింబాతనయుం దాఁకిన నతండును దైతేయ బలంబులంగొని బలిమి మెఱసి నిలిచి మార్కొనియె, నారెండు సైన్యంబులు నొండొంటి కెదిర్చి పేర్చి పెనంగుచుండ నా భీమసేన నందనుం డాచార్య ప్రభృతులగు నా పన్నిద్దఱపై బహుప్రకార క్రూరబాణంబులు వరఁగింప నందు. 120
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )