| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | భీష్మపర్వము - తృతీయాశ్వాసము |
| క. |
నరుఁడు ధనుర్గుణరావ | స్ఫురణంబును దేవదత్తభూరిరవము నం బరము వగిలింప నానా | శరములఁ గురుసైన్యసరభసత్వం బుడిపెన్. |
153 |
| ఆ. |
అపుడు సేరి భీముఁ డతనికి భుజగేంద్ర | కన్యకాసుతుండు గలనఁ బడుట నల్లఁ జెప్పుటయును నడలి యెచ్చట నని | యడిగి యతఁడు సూప నచటి కరిగి. |
154 |
| వ. | దనుజఖండితుం డయి పడియున్న యయ్యిరావంతు శరీరంబు గనుంగొని యా ధనంజయుండు. | 155 |
| చ. |
ఘనతరశోకవేగమునఁ గన్నుల నీళులు నించి యా సుయో ధనునవినీతియుం బిదప ధర్మతనూజుఁడు సంధి గోరి ప ల్కిన తగవుం గడంగి యనికిం దలకొన్ననిజోద్యమంబుఁ దోఁ చిన విధిఁ దిట్టుచున్ వినుతి సేయుచు రోయుచునుండె నయ్యెడన్. |
156 |
| వ. | ఇట్లు పుత్త్రశోకానలసంతప్తచిత్తుం డగు సవ్యసాచిం జూచి గోవిందుండు మందస్మితంబు సేసిన. | 157 |
| క. |
‘కని యతఁడు దెలిసి నీచే | వినినది యిది మున్ను దీని విడిచితి నహిభం జన! తేరు నడపు కురుబల | వినిపాతనపాటవమున విహరించుటకున్.’ |
158 |
| వ. | అని పలికినం బద్మనాభుండు రథంబు రయంబున మనమొనపయిం బఱపం బార్థుండు పటుబాణపరంపరలు వరగింప భగదత్తుండును, గృపాచార్యుండును, ద్రిగర్తపతియు భీష్ముం గూడుకొని యాక్రీడి నెదిర్చిరి. సాత్యకి యడరినం గృతవర్మ బాహ్లికులు మార్కొనిరి మారుతి గవిసినం గుంభసంభవుండు దలపడియె. నతని ప్రాపున నేపు మిగిలి నీపుత్త్రకు లా బకమర్దను మర్దింపం గడంగి కవిసిన. | 159 |
| క. |
గురునంపవెల్లి నాఁగుచు | సరభసముగ వారిమీఁద శరవర్షంబుల్ గురియుచు వారలయమ్ములఁ | దెరలక భీముండు పటుగతిస్యందనుఁడై. |
160 |
| వ. | సమరక్రీడ సలిపి గురుకుమారులు దొరఁగించు నారాచధారల నొచ్చి యాజ్యధారాక్రాంతుం డైన యర్చిష్మంతుండునుంబోలె మండి యుద్దండకోదండనైపుణ్యంబు సూపినం గుండభేదియు, ననాధృష్యుండును, గనకధ్వజుండును, విరావియు, సుబాహుండును, దీర్ఘబాహుండును, దీర్ఘలోచ నుండును దీర్ఘనిద్రం బొందిరి; పెఱవారు వెఱచఱచి విఱిగి పఱచిన నజంబుల వెనుకొనువృకంబు విధంబున వృకోదరుండు దోర్విలాసంబు మెఱసె నప్పుడు బ్రొద్దుగ్రుంకుచుండ నీ పెద్దకొడుకు బలుమొనలం బురికొల్పికొని చలంబునం గోల్తల సేసిన గౌంతేయవ్యూహంబులు నభినవోత్సా హంబునం బోక పెనంగిన. | 161 |
| తే. |
ధరణి నెత్తుటఁ దోఁగి యాభరణ కాయ | శస్త్రఖండజాలంబులఁ జాలఁ బొలిచెఁ బలుచ గాకుండఁ గుంకుమ మలఁది పెక్కు | తెఱఁగుతొడవులు దొడిగినతెఱవవోలె. |
162 |
| వ. | అంత. | 163 |
| క. |
తిమిరము గవిసినఁ బాండవ | సమితియుఁ గౌరవులు రణము సాలించి నివా సములకుఁ దగఁ జని రయ్య | ష్టమయామిని నుదితపటువిషాదుం డగుచున్. |
164 |
| క. |
కురువిభుఁడు నగరు సొచ్చియుఁ | జొరమిన గాంధారవిభుని సూతతనూజుం ద్వరితముగఁ బిలువు మని యా | తురతం బలుమాఱుఁ జెప్పె దుశ్శాసనుతోన్. |
165 |
| వ. | చెప్పిన నతండు వారిం గూర్చికొని వచ్చుటయు నేకాంతంబున నమ్మహీకాంతుండు వారలతో ని ట్లనియె ‘గాంగేయ గురుకృపాశ్వత్థామలు మధ్యస్థు లై పాండవబలంబులం జెఱుచునట్టి సంరంభంబునకుం జొరరు. మనసేనలు నానాఁటికి సన్నంబు లై సమయుచువచ్చె నేమి సేయంగలవార?’ మనిన విని రాధేయుండు రణక్రీడాలంపటుం డై. | 166 |
| క. |
నరనాథ! యింక భీష్ముని | దురమునకుం దేకు మేను దోర్బలవిభవో ద్ధురతం బాండుకుమారో | త్కరముం దత్సేనలన్ మదం బడఁగింతున్.’ |
167 |
| క. |
అని పలికిన విని దుశ్శా | సనుఁ గనుఁగొని మనము వోయి శాంతనవుని భం డన ముడిపి వత్త మని చె | ప్పి నరేంద్రుఁడు వీడుకొల్పెఁ బెఱవారిఁ దగన్. |
168 |
| వ. | ఇట్లు కర్ణసౌబలుల నిజనివాసంబులకుం బోవం బనిచి బహుప్రకార సౌరభసంవాసితంబులగు జలంబుల జలకం బాడి పరమసురభిచందనానులేపనంబులను జీనిచీనాంబరపరిధానంబులను మహనీయ మాల్యాభరణంబులను బ్రస్ఫీతమణిమయ భూషణధారణంబులను దగ నలంకృతుం డై తమ్ములుం దగువారలుం బరివేష్టింపఁ బరిమళపరంపరాభాసితనూతనతైలధారాభిషేక ప్రదీపితంబులయిన కరదీపికాసహస్రంబులు వెలుంగ వేత్రహస్తులు దొలంగుఁడు తొలంగుండని సందడి నెడ గలుగ జడియ వందిసందోహంబులు సంకీర్తనంబులు సేయ మాగధమంజులగానంబులు వీనులం బొరయఁ బాఠక పఠనరవంబుల మనంబు రంజిల్ల రమణీయరత్నఖచితం బగు రథం బెక్కి మందగమనంబున మందాకినీనందనుమందిరంబు సేరం జని తదీయద్వారంబునం దేరు డిగ్గి దుశ్శాసను ముంజేయి కరతలంబున నవలంబించి యల్లన నడచి యుచితప్రకారంబునం బ్రవేశించి యప్పితామహు పాదంబులకుం బ్రణామంబులు సేసి తత్పీఠ సమీపంబున సమంచిత కనకాసనంబున నతం డనుప నాసీనుం డై చేతులు మొగిచి యమ్మనుజపతి యతనితో నిట్లనియె. | 169 |
| మ. |
నిను మున్నెంతయు నమ్మి పాండవుల యున్మేషంబు నేఁ జీరికిం గొన నీపోరెడు చందముల్ దెలియఁ బెక్కుల్ సూచితిం జేరి చే రి నయం బిచ్చుచు నొంప నూల్కొనక వారిం బట్టి పాలార్చె దొం డన నేరం గురుముఖ్య! యింక నిట నీ వాలంబు సాలింపవే! |
170 |
| చ. |
అనిమొన దేవదానవుల కైనను మార్కొనరాదు నిన్ను నేఁ డెనిమిది నాళ్ళు లయ్యె సమయింపవు నొంపవు సవ్యసాచి న ప్పని యటులుండనిమ్ము నినుఁ బ్రార్థన సేసెద నింతవట్టు నా చనవునఁ బోవ నిచ్చి నృపసత్తమ పోరికిఁ గర్ణుఁ బంపవే! |
171 |
| వ. | అనవుడు. | 172 |
| క. |
అమ్మాట మనమునకు వా | లమ్మై తాఁకుటయు భీష్ముఁ డత్యంతవిషా దమ్మున నించుకవడి మౌ | నమ్ముఁ దగం దాల్చియుండె నతవదనుం డై. |
173 |
| వ. | పదంపడి నిట్టూర్పు నిగిడించి మొగం బెగయించి భూపాలు నాలోకించి. | 174 |
| క. |
‘తలకొని నీకుం బ్రాణంబులు డాఁ | పక యోపినట్లు పోరఁగ నిమ్మైఁ బలుకఁదగునె? యక్కట! నా | వలనం గలభక్తి యెల్ల వమ్మునఁ గలయన్? |
175 |
| వ. | అని పలికి యలుక వొడమి వెండియు. | 176 |
| సీ. |
‘కాల్పడే మహనీయ ఖాండవం బింద్రుని | నమరగణంబుతో విముఖుఁ జేసి? బహుదివ్యశరములు వడయఁడే? యెక్కటి | బవరాన మెప్పించి శివునిచేత? గంధర్వులకు నోడి కర్ణుండు నీ తమ్ము | లును బాఱ విడిపించికొనఁడె నిన్ను? నిను నను ద్రోణు నాతని పుత్త్రుఁ గృపుఁ గర్ణు | గెలిచి విరాటుగోవులఁ గొనండె? |
|
| ఆ. |
తక్కు పెక్కులెడలఁ బెక్కండ్ర నేమేమి | సేసె వినమె? యట్టి జెట్టి నిన్ని దినము లిట్లు దొడరి పెనఁగియు నీ చేత | నేఁడు వినఁగ వలసె వేఁడిపలుకు. |
177 |
| క. |
తగనిపని యని తలంపక | పగ గొంటి వజేయులైన పాండుసుతులతోఁ దెగి యింక నీవు రణమున | మగఁటిమి వాటింపు రిత్తమాటల నగునే? |
178 |
| వ. | అని మఱియును. | 179 |
| క. |
‘గాండీవి గెలువ రాదు శి | ఖండిని జంపంగ నాకుఁ గాదు వినుము న న్నొండుమగలు మార్కొనినం | జెండుదు నుగ్రముగ మున్న చెప్పితి నీకున్. |
180 |
| క. |
ఏనును నాదళమున ద్రుప | దానీకవిరాటసైన్యయాదవబలసం తానములతోడఁ బెనఁగెదఁ | బూనుఁడు మీ రెల్లఁ బాండుపుత్త్రుల గెలువన్. |
181 |
| ఆ. |
నడికిరేయి వచ్చి నను నొవ్వ బలికినఁ | కలుగునయ్య జయము? గడఁగి నీవు నడవు మనికి నెల్లి నా చేతి బలుపు సూ | చెదవుగాక వేయి సెప్పనేల?’ |
182 |
| క. |
అనినఁ బ్రియమంది నగరికిఁ | జని పతి సుఖనిద్ర సేసి సముచితసమయం బున మేలు కాంచి కయ్యం | బున కాయిత మయ్యె మేను వొంగారంగాన్. |
183 |
| వ. | ఇట్లు సన్నద్ధుం డయి బలంబుతో వెడలి నీ పుత్రుండు భీష్ము నుపలక్షించి భూపతిప్రకరంబులతో ని ట్లనియె. | 184 |