పురాణేతిహాసములు శ్రీమహాభారతము భీష్మపర్వము - తృతీయాశ్వాసము
కర్ణుఁడు భీష్మునియొద్దకుఁ బోయి వినతుం డగుట (సం. 6-117-1)
వ. అని యిట్లయ్యిరువురు నొండొరులం బ్రశంసించుచు నఖిలజన పరివృతు లై శిబిరంబుల కరిగిరి తదనంతరంబ కర్ణుండు గాంగేయుకడకుం బోయి భక్తి వినయంబులు దోఁపం బాదప్రణామం బాచరించి. 440
ఆ. ‘అలుక దక్కి నన్ను నధికవాత్సల్యశీ | తలము గాఁగఁ జూచి తగినమాట
లాడవే? మహాత్మ!’ యనుటయు నాతండు | గారవమున నతనిఁ జేరఁ బిలిచి.
441
వ. ఒక్కకరంబు మలంచి కౌఁగిలించుకొని యచ్చట నున్నరక్షకాదిజనంబుల నవులం బోవం బనిచి యతనితో ని ట్లనియె. 442
క. ‘నీ దెసఁ గోపింతునె? కుల | భేదముగాఁ బలుకుటయును బిడ్డలఁ జెఱుపం
గా దని కినియుదు లే దన | రా దదలుతు నిన్ను నిష్ఠురంపుఁ బలుకులన్‌.
443
వ. అది శిక్షగాని రోషంబు గా దట్లుం గాక. 444
క. నీ యుదయము దైవిక గ | ర్భాయత్తము నీకు మర్త్యు లసదృక్షులు గౌం
తేయుఁడవు గాని విను రా | ధేయుండవు గావు నీవు ధీరవిచారా!
445
వ. ఇది కృష్ణద్వైపాయనుండు నాకు నేకాంతంబున నెఱింగించె. నేనును భవదీయతేజోవిశేషంబువలననుం గనుంగొనియుండుదుఁ బాండుతనయుండ వగుటంజేసి నీ యెడ వాత్సల్యంబు కాని మాత్సర్యంబు లే దింక నొక్కటి సెప్పెద విను మేను గురుపాండవులవైరం బుడిపిపుచ్చితి నప్పాండవేయు లజయ్యు లప్రమేయుండగు కృష్ణుండు వారికి విధేయుండు గావున వారలతోడి విరోధం బొప్పదు నీవును నొండుదలంపు దక్కి య క్కౌంతేయులం గలిసి యుండు మనినఁ గర్ణుం డతని కి ట్లనియె. 446
క. ‘కౌంతేయుండ నగుదు నిది | యంతయుఁ దొల్లియును వింటి నార్యులచే ని
ట్లింతయు నెఱిఁగినఁ గుంతీ | సంతానముతోడి పొత్తు సనునే? నాకున్‌.
447
ఉ. వారు మహాబలుల్‌ హరియు వారికిఁ బ్రాపు గలండు వారలం
బోర జయింపరామియును బుద్ధి నెఱుంగుదు నైనఁ గౌరవ
క్ష్మా రమణుండు సేయుతగుమన్నన లెల్లఁ దలంచి చూచినన్‌
భూరివివేక! యే విడిచిపోవుట ధర్మమె? వీరకర్మమే?
448
వ. అదియునుం గాక. 449
ఉ. మాటలు పెక్కు లాడి యనుమానము లేక సభం గడంగి ప
ల్మాటుఁ బరాభవించితిఁ జలంబునఁ బాండవకోటి కెప్పుడుం
జేటు దలంచి యే బలువు సేసితి వైరము నాకు నింక నీ
వీటికి వారివీటికిని వెక్కస మయ్యెడు కయ్య మొప్పగున్‌.
450
శా. దైవాధీనము సర్వమున్‌ మనమతిం దప్పింపఁగా వచ్చునే?
నీ వింకన్‌ నను నొండు వల్కక పరానీకంబుపైఁ బంపు మ
త్సేవాధర్మము నిర్వహించెద బలోత్సేకంబు లోకంబు సం
భావింపన్‌ విహరించెదన్‌ మురరిపుం బార్థుం దలంకించెదన్‌.’
451
చ. అన విని భీష్ముఁ డిట్టులను నంతకుఁ జాలు టెఱుంగనే? సుయో
ధనునకు నెప్డు నీదుభుజదర్పమ కాదె? సహాయ మెద్ది యా
తనికిఁ బ్రియంబు దానిన యుదాత్తమతిం దగ నాచరింపు నీ
మనమున సంతసిల్లు మనుమానము దక్కు మనుజ్ఞ యిచ్చితిన్‌.’
452
వ. అని తెలి వొంది పలికిన దేవవ్రతుబంధుభావంబునకుం బరమానందంబు నొంది రాధేయుండును నిజ నివాసంబునకుం జనియె ’నని సంజయుండు ధృతరాష్ట్రునకుం జెప్పె నని జనమేజయునకు వైశంపాయనుండు సెప్పుటయు. 453
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )