| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము |
| వ. | అట్టియెడ నాచార్యుం డసమాన శౌర్యంబును, మాననీయదోస్సారంబును, దివ్యాస్త్ర ప్రభావంబును జూపినం గౌంతేయ సైన్యంబునందు. | 145 |
| సీ. |
తఱుచుగాఁ దెగిపడ్డ ధవళ చామరములు | డిండీరముల యొప్పుఁ బుండరీక ములు మరాళంబుల పొలుపును గరవాల | ములు మీన భంగియుఁ, దలలు శిలల చాడ్పును, గేశముల్ శైవాలరేఖయు, | మాంసంబు పంక సమానతయును, దాల్ప భటాశ్వమాతంగాంగ భగ్నర | థముల తిట్టలు పులినములు గాఁగఁ |
|
| తే. |
ధీరవరకోటి ద్రెళ్ళిన వీరతతికి | సంభ్రమము వుట్ట సంభృతోత్సాహ లీల నుబ్బి భూతబేతాళంబు లోలలాడ | నిట్టలంబగు నెత్తురు టేఱు వఱపె. |
146 |
| వ. | అప్పుడు. | 147 |
| తే. |
గగన మధ్యంబునకు వచ్చి ఖరకరుండు | దేఱి చూడంగ రాక యుద్దీప్తుఁ డగుచు నెట్లు వెలుఁగొందు ద్రోణుండు నట్ల వెలుఁగు | చున్నఁ గనుఁ గొని ధర్మజుం డురవడించి. |
148 |
| వ. | ధనంజయ ధృష్టద్యుమ్నుల నాలోకించి యమ్మహావీరు వారించుటకు నియోగించిన. | 149 |
| శా. |
చంచత్తుంగ తురంగ సత్వరగతి స్ఫారీభవత్కేతనో దంచద్దీప్తులు ప్రజ్వరిల్ల నతిసాంద్రంబై శరశ్రేణికా సంచారంబు నితాంత ఘోరముగ నాచార్యున్ వడిం దాఁకె న ప్పాంచాల క్షితిపాల నందనుఁడు శుంభద్వీర్యసంరంభుఁడై. |
150 |
| వ. | తదనంతరంబ. | 151 |
| క. |
నరుఁ డగ్గలికం దఱుముచుఁ | బురికొలిపిన గండుమిగిలి భూరిబలంబుల్ గురునిఁ బొదివె నప్పార్షతు | నరదమునకు మించి రభస మత్యుగ్రముగన్. |
152 |
| క. |
పొదువుటయుం గనుఁగవఁ గెం | పొదవఁగ మెయి వొంగి ద్రోణుఁ డున్మదలీలం దదనీకములఁ గలంచుచు | ముదుకం డయ్యును కుమారమూర్తిం బొలిచెన్. |
153 |
| క. |
విను మప్పుడు నిజశక్తుల | కనురూపము గాఁగ నిలిచి యద్దెస వీరుల్ పెనఁగిరి రథ్యంబులు నా | తని సూతుని మేను శోణితంబునఁ దోఁగన్. |
154 |
| క. |
గురుఁ డలిగి పెలుచ నడరినఁ | గరిఘోటక భటనికాయ కాయముల సమి ద్ధరణి వొలిచె నరుణపయో | ధరసంవృతమైన గగనతలము చెలువునన్. |
155 |
| క. |
అప్పుడు ధృష్టద్యుమ్నుఁడు | నిప్పు లురులు చూపు లడర నిశితాస్త్రములం గప్పె గురునిఁ దతై న్స్యం | బొప్పఱి తన బెట్టిదంపు టురవడిఁ దెరలన్. |
156 |
| క. |
ద్రోణుని శరములు నిలుపుచు | బాణవితతి సేనమీఁదఁ బరఁగించుచు గీ ర్వాణనుతు లెసఁగ నతఁ డ | క్షీణోద్ధతి నట్లు సమరకేళి సలుపఁగన్. |
157 |
| క. |
ఏచిన రథికవరులు ధను | రాచార్యుని యిరుగెలంకులందుఁ దఱిమినం జూచి వడి సవ్యసాచి శ | రాచిత దేహులుగఁ జేసె నందఱఁ గడిమిన్. |
158 |
| వ. | ద్రోణుండు పది బాణములు ద్రుపదసూనుమేనం గీలించినం దూలక యతం డతనిపై నిశిత విశిఖవర్షంబు గురిసె; నయ్యిరువుర శరనికరంబు లంబరంబు గప్పె; నట్టియెడఁ బాండవాగ్రజ పురోగములగు దొరలు గడంగి కుంభసంభవుదెసకుం దఱిమిన మన వలని ఘనయోధవరులు వారిం దలపడి; రందు శకుని సహదేవుం దాఁకి. | 159 |
| మ. |
తురగవ్రాతము నొంచి కేతువు వెసం ద్రుంపంగ నాతండు గ్రో ధరయం బుగ్రము గాక యుండియును గాంధారేశు వీతధ్వజున్ విరథున్ విస్ఫురితాస్త్రఘట్టితునిఁ గావింపన్ గదాభీల మూ ర్తి రథం బుద్ధతి డిగ్గపాఱి యతఁ డుర్విం గూల్చెఁ దత్సారథిన్. |
160 |
| క. |
సహదేవుండును గదఁ గొని | మహి కెరఁగిన యప్పు డొప్పె మనుజేశ్వర! య మ్మహిత సుభట యుగము శిఖర | సహిత మహాశైలయుగ్మ సదృశాకృతియై. |
161 |
| క. |
వింశతి శరముల నేసి వి | వింశతి ననిలజుఁ డతండు వీఁకనగుచుఁ ద త్ప్రాంశుధనుర్దండము రెం | డంశములుగ నేసె వెడఁదయమ్మునఁ బెలుచన్. |
162 |
| సీ. |
మన బల మార్చినఁ గినిసి భీముఁడు గద | నతని యశ్వంబుల నవనిఁ గూల్చె; భూరిశ్రవుఁడు పొలుపారి ధృష్టద్యుమ్నుఁ | గప్పె నస్త్రముల; శిఖండి యేచి యాతని నిలు నిలుమని తాఁకి శరవృష్టిఁ | బొదివెఁ; బిశాచముల్ వూనుతేరు లెక్కి కప్పారెడు నెలువు చర్మపుఁ గత్త | ళములతో ఖరనిస్స్వ నములు సెలఁగ |
|
| తే. |
నసుర వల్లభు లగు నలంబుస ఘటోత్క | చులు సముద్ధతిఁ దొడరి మాయలు వొనర్చి పేర్చి యొండొరు నొంచుచుఁ బెనఁగి పెనఁగి | తెల్లముగఁ జూడఁ జూడ నదృశ్యు లైరి. |
163 |
| వ. | అయ్యవసరంబున. | 164 |
| సీ. |
క్షత్త్రదేవుండు లక్ష్మ ణుతోడ సమరంబు | సేసె నుగ్రంబుగఁ; జేకితానుఁ డనువిందుఁ దలపడి యద్భుతగతిఁ బోరె; | శల్యుండు నవ్వుచు శరచయమున నకులు నొంచినఁ గేతనము నాతపత్రంబు | వెసఁ ద్రుంచి యాతని విరథుఁ జేసి శంఖంబు పూరించె శారద్వతుని మీఁద | ధృష్టకేతుఁడు సప్తతీవ్ర దీప్త |
|
| తే. |
విశిఖములు నింప నతఁ డస్త్రవృష్టి పెల్లు | గురిసె; సాత్యకి కృతవర్మ యురము నార సముల నొప్పించి డెబ్బది సాయకంబు | లేయ డెబ్బదియేడమ్ము లేసె నతఁడు. |
165 |
| క. |
సేనాపతి యగు ద్రుపద | క్ష్మా నాథతనూభవుఁడు సుశర్మునిమర్మ స్థానంబు నొంచె నాతఁ డ | దీనుండై యతని జత్రుదేశం బేసెన్. |
166 |
| చ. |
బలమును దాను మత్స్యనరపాలుఁడు కర్ణునిఁ దాఁకి రెండు సే నలు వినుతింప నుద్భటరణం బొనరించినఁ గంటిక్రేవఁ గెం పొలయఁగ నీతనూభవుల కుబ్బుగఁ దద్రథదంతి ఘోటకం బుల నుఱుమాడె నా రథికపుంగవుఁ డంబరచారు లార్వఁగన్. |
167 |
| క. |
వేడుకమైఁ దలపడి పో | రాడిరి ద్రుపదభగదత్తు లస్త్రబలము శౌ ర్యాడంబరమును నెలుఁగులుఁ | జూడను వినఁ జిత్రములుగ శుంభద్భంగిన్. |
168 |
| సీ. |
పౌరవుం డభిమన్యు బలువిడిఁ దాఁకి బా | ణాసారమున ముంప నతఁడు గినిసి యతని ధనుఃకేతనాతపత్రంబులు | ద్రుంచి యేనింటఁ దత్తురగములను సారథి నొప్పించి శరము లేడిట స్రుక్కఁ | జేసి దర్పంబున శిరముఁ ద్రుంచు టకు భల్లమరిఁ బోయుటయుఁ గృతవర్మ రెం | డమ్ముల విల్లు నయ్యమ్ముఁ దునిమెఁ |
|
| తే. |
బలకయును వాలుఁ గొని నరుపట్టి గవిసి | పౌరవుని రథ్యముల నేలపాలు సేసి యుఱికి సూతుని బడఁదన్ని యురగ విభునిఁ | బట్టు గరుడుని క్రియఁ దల వట్టికొనియె. |
169 |
| వ. | ఆలోన సైంధవుండు సంభ్రమంబున శాతకృపాణ చర్మంబులు గొని, రథంబు డిగ్గనుఱికి, రయంబున నెయిది యదల్చినం గని, జనకద్వేషియగు నతని వలని రోషం బగ్గలింప నా పురందరపౌత్రుండు పౌరవుని విడిచి, యద్దెసకు లంఘించి కవిసె నప్పుడు. | 170 |
| తే. |
వికట విస్ఫుర దసి చర్మ వివిధ చిత్ర | గతులు చూపఱ యెడఁద కద్భుతమొనర్ప నార్జునియు సింధురాజుఁ బక్షాభిరామ | సింహ శార్దూలగతి విలసిల్లి రథిప! |
171 |
| వ. | అట్టియెడ. | 172 |
| క. |
అఱిముఱి వ్రేసినఁ బలకం | గఱచిన సైంధవుని యలుఁగు గని నరసుతుఁ డే డ్తెఱ ముఱిసిన నది రూపఱి | విఱుగుటయును వెస నతండు వెనుకకు విఱిగెన్. |
173 |
| క. |
విఱిగినచో నిలువక వెఱ | నుఱికెం దన రథము మీఁది ‘కోడితి పో పో పిఱికి’ యని పలికి నుఱుముగ | నఱికెం దత్సేనఁ బార్థనందనుఁడు వడిన్. |
174 |
| క. |
తెరలిన సైంధవుఁ గని నృప | వరులు పలువు రొక్కపెట్ట వాసవిసుతుపై నురవడిఁ దఱిమిరి; మద్రే | శ్వరుఁడు గదిసి దీప్తశక్తి వైచెం బెలుచన్. |
175 |
| క. |
ఉరగాంగన నలిఁ బట్టెడు | గరుడుని క్రియ శక్తి వట్టి క్రమ్మఱ వైచెన్ నరసుతుఁడు శల్యసూతునిఁ | బొరివోవఁగ నార్చెఁ బాండుపుత్రబలంబుల్. |
176 |
| వ. | అయ్యవసరంబున విరాటుండును ద్రుపదుండును ధృష్టకేతుండును యుధిష్ఠిరుండును సాత్యకియును గేకయపతులును భీమసేనుండును ధృష్టద్యుమ్నుండును శిఖండియుం గవలును ద్రౌపదేయులును సౌభద్రుం బొగడు నెలుంగులు సింహనాదంబులు నింగి ముట్ట నతనికి నుల్లాసంబును నీ కొడుకులకు రోసంబును జనియింప, నతనిం బరివేష్టించిన నవ్విజయంబు సైరింపక కూడుకొని నీ కొడుకు లతనిపైఁ బటు శరంబులు గురియ, నక్కుమారసంతతికి సంతసంబుగా శల్యుండు గద గొని యభిమన్యున కభిముఖుండై కవిసె’ ననిన విని ధృతరాష్ట్రుండు సంజయున కి ట్లనియె. | 177 |
| తే. |
ఎక్కటెక్కటి పెనఁగిన నింతవట్టు | పెనఁకువలు నిట్టు లేచునే? పృథివి నింక జనము లీ కురుపాండవ సంగరంబు | సెప్పికొండ్రు మనంబు లచ్చెరువు నొంద.’ |
178 |
| క. |
అని సొంపు వినియు ‘నాకుం | దనివి సనదు శల్యపార్థతనయుల సమరం బున తెఱఁగు సెప్పు మేర్పడ’ | ననవుడు సూతసుతుఁ డిట్టు లనుఁ బతితోడన్. |
179 |