| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము |
| ఆ. |
మెఱుఁగు మెఱచినట్లు మెఱయంగ నరదంబు | కర్ణికార కేతు కాంతి వెలుఁగ నంపగముల గురుని నలయించి కడచి యిం | ద్రజుని కొడుకు మొగ్గరంబు సొచ్చె. |
17 |
| వ. | ఇ ట్లనన్యభేద్యం బగు నా పద్మవ్యూహంబు భేదించి సొచ్చి సౌభద్రుండు రౌద్ర రసోల్లసితమూర్తియై యందు మహార్ణవంబునం దిరుగు మందరనగంబు చందంబునం, గాననంబునం జరియించు తీవ్రానలంబు తెఱంగునఁ గాలపక్వజనసమాజ సంహరణ క్రీడనంబు సలుపు శూలిపోలికం గేలీగతుల మెలంగి, యమ్మెయి నమ్మోహరంబు ద్రిప్పుకొలిపియుం బొడిసేసియు రూపుమాపియు రణవిహారం బొనరింప, నవ్వీరవరు నారా చాది నానావిధ విశిఖ వ్రాతంబులు, హేతి సంఘట్టనంబున మండుచుఁ, గరుల నుచ్చిపోవుచుఁ, దేరుల విఱుచుచు, హయంబుల ధట్టంబుల నుఱుము సేయుచుఁ గాల్బలంబులఁ జిదుపుచు, గేతువులం ద్రుంచుచు, నాతపత్రం బుల నుఱుమాడుచు, రథ్యంబులం గూల్చుచు, సూతుల గీటడంగించుచు, ధనువులు దునుముచు, మైమఱువుల వ్రచ్చుచు, భూషణంబుల డుల్చుచుఁ గరవాలంబులఁ ద్రోయుచు, మేనులు సించుచుఁ దూపులు దూలించుచు, జేతులు నఱకుచుఁ, సబళంబులు జడియుచు, దలలు చిదుముచు, నంకుశంబులు రాల్చుచు, నెత్తురు లురలించుచుఁ, గండలు సెక్కుచు, నెమ్ములు నలఁచుచుఁ బరఁగిన నమ్మొన చిక్కువడియును, నుడి వడియును, గలంగియుఁ, దొలంగియు, వెఱచఱచియు, విచ్చిపఱచియు దీనదశకు వచ్చినం గనుంగొని. | 18 |
| క. |
వీఁకమెయిఁ గ్రీడి కొడుకుం | దాఁకఁగ నీ కొడుకు తలఁచి తఱిమి కవిసెఁ బే రాఁకలితో నున్న హరిం | దేఁకువ సెడి చేరు కరిగతిం గురుముఖ్యా! |
19 |
| వ. | ఇట్లు సౌభద్రుఁ జెనయం జూచు సుయోధనుం జూచి శరాసనగురుండు సైనికవరులకుం జేయి వీచి యెలుంగెత్తి. | 20 |
| క. |
‘నరసుతున కగ్గమయ్యెం | గురుధరణీవల్లభుం డకుంఠితగతి మీ రరుగుం డేయుం డడ్డము | చొరుఁడు వెరవు లావు నెఱయ శూరత మెఱయన్.’ |
21 |
| వ. | అనుచుఁ దనయరదం బద్దెస మొగంబు సేసి పురికొల్పిన. | 22 |
| ఆ. |
కృపుఁడు గురు సుతుండుఁ గృతవర్మ గర్ణుండు | సౌమదత్తి శలుఁడు సౌబలుండు పౌరవుండు మద్రపతి వృషసేనుండు | గౌరవేశ్వరుండుఁ గడఁగి రపుడు. |
23 |
| వ. | అట్లు గడంగి. | 24 |
| చ. |
ప్రకటబలాఢ్యు లొక్కటఁ దిరంబయి పల్వురు వీఁక భూమి పా లకునకు నడ్డమైనఁ దవులంబడి హుమ్మని నోరికండ నాఁ చికొనిన మ్రోఁగు బెబ్బులి విశేషము దోఁపఁగఁ బార్థుపట్టి సా యకముల నొంచినం దెరలి రందఱు లేళులపిండు నాకృతిన్. |
25 |
| వ. | ఇ వ్విధంబున నయ్యోధవరులు విచ్చిన, వివ్వచ్చుకొడుకు పేర్చి యార్చిన నాచార్యుండు వీఁడు వీరిచేత నిలువండని తా నరిగి యన్నరనందను నెదుర్కొనిన వారును గూడుకొని పొదివిన. | 26 |
| క. |
అతఁ డందఱ మార్గణములు | నతిరయమునఁ ద్రుంచుచుం దదంగముల శర ప్రతతులు నించుచుఁ బోరఁగఁ | బతి సేనకుఁ జేయి వీచె బరవస మలరన్. |
27 |
| క. |
మనసేన పెలుచఁ గడఁగిన | వననిధి వొంగెడు విధంబు వాసవిసుతుఁ డే చినఁ జెలియలికట్ట తెఱం | గును గానఁగనయ్యె నపుడు కురువంశనిధీ! |
28 |
| వ. | ఆ సమయంబున. | 29 |
| సీ. |
రారాజుఁ గృపుఁడును భూరిశ్రవుండు మూఁ | డేసి యమ్ములు పదియేడు గురుఁడు వినుము! వివింశతి వింశతి విశిఖంబు | లాచార్యుసుతుఁడు బృహద్బలుండు నైదు నెన్మిదియును నాఱు శల్యుఁడు, సప్త | శరములు గృతవర్మ సౌబలుండు రెండు బాణములు పండ్రెండు తొమ్మిదియును | దుశ్శాసనుండును దుస్సహుండు |
|
| తే. |
నేసి రర్జునుసుతుమీఁద నెల్లవారి | తనువులందును సాయక త్రయము లతఁడు గ్రుచ్చె; నశ్మకుఁ డదరినఁ గూల నేసెఁ | దురగసూతకేతనములతోడఁగూడ. |
30 |