| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | కర్ణపర్వము - ప్రథమాశ్వాసము |
| ఉ. |
‘ద్రోణు పరాభవం బధికరోషము సేయఁగ నున్న యీతఁ డ క్షీణ పరాక్రమంబు విలసిల్లఁగ నీ ద్రుపదాత్మజున్ గత ప్రాణునిఁ జేయ కే లుడుగుఁ బైకొను నంతటఁ బోక విస్ఫుర ద్బాణవిలాసముల్ నెఱపుఁ దా మనసైన్యము దల్లడిల్లఁగన్’. |
152 |
| వ. | అని వెండియు. | 153 |
| మ. |
‘వరదివ్యాస్త్రవిదుండు బాహుబల గర్వస్థేమ నిర్వాహకుం డరులం జీరికిఁ జేకొనం డితఁడు క్రోధాత్తాత్ముఁడై నేఁడు ని ర్భర శౌర్యంబు నుదాత్త ధైర్యము నుదగ్రస్ఫూర్తి శోభిల్ల దు స్తర దర్పోద్ధతిఁ దేకయున్నె? మనలం దా నేలకుంగోలకున్. |
154 |
| వ. | ధృష్టద్యుమ్నుండును బెండువడియున్నవాఁ డనుచు నుండి రట్టియెడ బెట్టిదంబులగు గృపాచార్యులతూపుల యేపు రథ్యంబుల నొంచి సారథి క్రొవ్వడంచి యా ద్రుపదనందనుతనువు నెత్తుటం దోఁచి యుల్లంబు గలంచె నప్పుడాతని సూతుం డతనితో నిట్లనియె. | 155 |
| చ. |
‘వినుము కుమార! విప్రుభుజవీర్య మవార్యతఁ దేజరిల్లెడుం జనవు భవత్సమగ్రశరజాలము లీతని మీఁద దైవ సం జనితము సువ్వె! యియ్యెడరు సంగరమిట్టిది తొల్లియెందు నా కనినది లేదు తేరు దొలఁగం గొనిపోవుట కార్య మిత్తఱిన్. |
156 |
| వ. | నీ యట్టి వాని విక్రమంబునుం దిట్టిన యట్లు సమయుటంజేసి యిమ్మహాత్ముం డవధ్యుండని నిశ్చయించితి నా మాటకియ్యకొను’ మనవుడు నా పృషత పౌత్రుం డిది యట్టిద యని నిశ్చయించి పలికి మఱియు హీనస్వరంబున నిట్లనియె. | 157 |
| చ. |
‘చరణములుం గరంబులును సంచల భావము నొందఁ జొచ్చె మేన్ విరవరఁ బోవుచున్నయది విహ్వలమయ్యె మనంబు నీతలం పరయఁగ మేలు మారుతసురాధిపసూనులలోన నల్ల నొ క్కరుదెసకై రథంబు దొలఁగం గొని పొ మ్మడిబీర మేటికిన్.’ |
158 |
| చ. |
అనవుడు సూతుఁ డెంతయు రయంబునఁదేరు వృకోదరాంతికం బున కెగవంగ శంఖరవమున్ గుణనిస్వనమున్ నిగిడ్చి యే పునఁ గృపుఁ డుజ్జ్వలప్రదరపుంజములం బరఁగంగఁ జేయుచున్ వెనుకొనిపొల్చి నిల్చె గిరి వెన్కొని నిల్చిన వజ్రికైవడిన్. |
159 |
| తే. |
కడఁగి కృతవర్మతోడ శిఖండి పెనఁగు | చుండి శరపంచకంబున నురము నొంప నతని నయ్యాదవోత్తముఁ డలఘు షష్టి | విశిఖవిద్ధునిఁ జేసి విల్ విఱుగ నేసె. |
160 |
| క. |
ఒండు శరాసన మెత్తి శి | ఖండి గురియు నవతి సాయకమ్ములు పెలుచన్ ఖండించె నతఁడు తత్కో | దండం బాద్రుపదనృపతితనయుఁడు నఱకెన్. |
161 |
| క. |
‘ధనువు దునిమి కొమ్ములు మురి | సిన వృషభము చందమగుడు శీఘ్రస్ఫురణం దనువున శితశరములు వడిఁ | జొనిపి యతం డతని గళితశోణితుఁ జేసెన్. |
162 |
| చ. |
అలుక మనంబునం గదిరి యాదవసత్తముఁ డొండువింట దో ర్బల మెసఁగంగ డెబ్బది శరంబుల నాతని మేన రక్త ధా రలు దొరఁగించి పెక్కు ప్రదరంబులు పైపయి నేయుచుండ న గ్గలికఁ బెనంగె వెండియు శిఖండి విచిత్రరథప్రచారుఁడై. |
163 |
| వ. | ఆ ద్రుపదనందనుండు జత్రుదేశంబున నంబకత్రయంబు నాటించిన. | 164 |
| శా. |
క్రూరోల్లాసము పల్లవింపఁ గృతవర్ముం డుగ్రదీప్తి స్ఫుర న్నారాచంబులు పెక్కు లొక్క మొగి మేనంగ్రువ్వ మూర్ఛిల్లె న వ్వీరాగ్రేసరుఁ డప్డు సారథి భయావిర్భావదీనాత్ముఁడై తే రచ్చోటు దొలంగఁ దోలుటయు భీతింబాఱెఁ దత్సేనయున్. |
165 |
| వ. | వివ్వచ్చు విక్రమవిహారంబున కోర్చి శిబిత్రిగర్తసాల్వసంశప్తకసైన్య నారాయణ గోపాలోపేతుండై సత్యసేన చంద్రదేవ మిత్త్రదేవ మిత్త్రవర్మ సౌశ్రుతి సువర్మ సుశర్మాదు లగు సోదరసుతులు బాసటగాఁ ద్రిగర్తపతి పెనంగు నప్పుడు. | 166 |
| సీ. |
సత్యసేనుఁడు మూఁడు సాయకంబుల, మిత్త్ర | దేవుండు షష్టి సందీప్త మార్గ ణంబులఁ గ్రూరబాణంబులు మూఁటను, | జంద్రదేవుఁడు శరసప్తకమున, మిత్త్రవర్ముఁడు గంకపత్త్రత్రిసప్తతి, | సౌశ్రుతి యేడు నిశాతవిశిఖ ములను, శత్రుంజయుఁ డలఘు వింశతి కాండ | ములను, సుశర్ముఁ డుజ్జ్వల నవాస్త్ర |
|
| తే. |
ములను గప్పి రప్పార్థు నాబలియుఁ డంబు | దముల ధారలు వొదువ నుదాత్తరేఖ గరము పొలుపారు మేదినీధరము భంగిఁ | దలఁపఁ బట్టగుధీరతఁ బొలిచె నధిప! |
167 |
| వ. | ఇట్లు సుస్థిరుండై మిత్త్రదేవు నంగంబునఁ గంకపత్త్రశతంబును, సత్యసేను తనువున మార్గణత్రయంబును, సుశర్మమిత్త్రవర్మల శరీరంబుల శిలీముఖాష్టకనవకంబులను బఱపి, శత్రుంజయు శిలాశితశరంబులం బడవైచి, సౌశ్రుతిం బంచవింశతి కాండంబుల గీటడంగించియుఁ జంద్రదేవుని నెనిమిది యమ్ములం దునిమి యుల్లసిల్లిన. | 168 |
| చ. |
కనకపుఁగామతోమరము గర్వ మెలర్పఁగ నెత్తి పద్మ నా భుని భుజశాఖ యుచ్చిచన భూరిబలుం డగు సత్యసేనుఁ డు క్కున నిగిడింపఁ జేతి మునికోలయుఁ బగ్గములున్ మహీతలం బున నొగలందునుం బడిన భూవర! పార్థుఁడు గ్రోధదీప్తుఁడై! |
169 |
| క. |
హరి దెసఁ గన్గొని యాతని | యరదముఁ గదియంగ నడపు మరద మనుడుఁ జె చ్చెర నొండొక మునికోలం | గరముద్ధతి నడపె ఘోటకంబుల నతఁడున్. |
170 |
| క. |
తే రతని యరదమునకుం | జేరువ యగుటయును గ్రీడి శితబహుభల్ల స్ఫారగతుల గాత్ర శిరో | దారణ మొనరించి యొప్పె దరహాసముతోన్. |
171 |
| వ. | ఇట్లు సత్యసేనుని చిత్రవధంబు చేసి. | 172 |
| చ. |
ఘనతర వత్సదంతశరఘాతమునం బడవైచి మిత్త్రవ ర్ముని రథసూతు నట్టిదొక క్రూరపుఁ దూపున నుర్విఁగూల్చె నా తని సముదీర్ణమై పెలుచఁ దాఁకి త్రిగర్తబలంబు సుట్టు ము ట్టిన వివిధోగ్రసాయకపటిష్ఠత నొప్పి కలంచె నేపునన్. |
173 |
| వ. | వెండియు సుశర్ముని జ్ఞాతులు వోక పెనంగిన. | 174 |
| ఆ. |
వెండిపింజఁ బొలుచు వెడఁద యమ్మున మిత్త్ర | సేనధరణినాథుశిరముఁ ద్రుంచి వాఁడినారసము సువర్మవక్షంబున | నాటె నయ్యమర్త్యనాథసుతుఁడు. |
175 |
| వ. | అట్టియెడ సంశప్తక గణంబులన్నియు నార్పులునింగిముట్ట నలుదిక్కులం గిట్టి బెట్టిదంబులగు నస్త్ర శస్త్ర పరంపరలు గురిసిన నమ్మేటివిలుకాఁ డలుక మానిన యలంతి నవ్వు చెలువంబు మొగంబునకు వింత చెన్నొసంగ విజృంభించి యైంద్రాస్త్రంబు ప్రయోగించిన నది ప్రదీప్త భల్లాంజలిక ప్రముఖ విశిఖరూపంబులం బరఁగుటయు. | 176 |
| సీ. |
తేరుల చెక్కలు వారణంబుల ఖండ | ములు భూషణంబుల పొడియు ఘోట కంబుల తునియలుఁ గరవాలతోమర | శరపరిఘాదుల శకలములును రథికజనంబుల వ్రయ్యలుఁ జామర | చ్ఛత్రకేతువుల యంశములు భటుల తుమురును రౌతుల తుండంబులును గంక | టముల భాగములుఁ జిందముల నుఱుముఁ |
|
| తే. |
గలిసి నెత్తుటమునిఁగి ప్రేపులఁ బెనంగి | మెదట బ్రుంగి వియచ్చర హృదయములకు నద్భుతంబు బీభత్సంబు నావహింప | సంగరాంగణ మతిఘోరభంగియయ్యె. |
177 |
| వ. | అప్పుడు. | 178 |
| క. |
కరిహయశవముల విఱిగిన | యరదంబుల విషమమైన యాజి క్షితి నె త్తురు రొంపిలోన రథ్య | స్ఫురణ కతనఁ దవులఁబడక శోభితగతియై. |
179 |