| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | కర్ణపర్వము - ప్రథమాశ్వాసము |
| వ. | కని ఫాలంబులు భూమిసోఁకం బ్రణమిల్లిన నద్దేవుండు ‘లెండు మీ రాకకుం గారణంబేమి?’ యనవుడు లేచి నిలిచి వారు కరకమలంబులు భక్తి మొగిడ్చి. | 270 |
| క. |
‘స్తుత్యానుభావ నిర్మల | నిత్యానందస్వరూప! నిగమవిరోధి స్థిత్యపనయనోన్ముఖ! చి | త్సత్యాత్మక! భక్తలోక దౌర్గత్యహరా! |
271 |
| వ. | అని మఱియు ననేక ప్రకారంబుల బ్రస్తుతించినం బ్రసన్నుండై భవుండాదరించి ‘మీకు భయంబు వలవదు మీ చెప్పిన యట్ల చేసెద వలయు కార్యంబెయ్యది?’ యనిన దేవమునిసంఘంబులు ప్రహర్షంబు నొందె నరవింద భవుం డప్పరమేశ్వరున కిట్లనియె. | 272 |
| సీ. |
‘ప్రజలకుఁ బతిగాఁగఁ బనిచితి నీవు న | న్నట్లు పదస్థుండ నగుటఁజేసి విచ్చలవిడి వరంబిచ్చితి నసురత్ర | యమునకు దుర్గత్రయంబు గలిగి యమ్మువ్వురును దారుణాక్రమమున భువ | నత్రయ సంబాధనం బొనర్చు చున్నారు వారల నొరులకు నుడుప శ | క్యముగాదు నీవు శీఘ్రంబు చెఱుప |
|
| ఆ. |
వలయు మునులు దేవతలు నేను శరణు చొ | చ్చితిమి నిన్నుఁ గరుణ జేకొనంగ వలదె? మమ్ము నొరులు గలరె జగంబులు | గావ భూతనాథ! నీవు దక్క’ |
273 |
| వ. | అనవుడు నద్దేవుం డయ్యసురులు సెఱుపవలయువారగుదురు వారలు బలవంతు లేనొంటిమై నా పనికి నుత్సహింపనేర మదీయంబు లయిన తేజోబలంబులం దర్ధంబు పుచ్చికొని మీరందఱుం గూడి యా దుష్ట దైత్యుల మర్దించుట కార్యం’ బనిన నద్దివిజులు ‘మాకందఱకు గల తేజోబలంబులకు నద్దనుజుల తేజోబలంబులు రెట్టియయి యుండు నట్లగుటం జేసి మా చేతం జెడ రదియునుంగాక భవదీయ తేజోబలంబులు భరియింప మేము శక్తులము గాము మా యందఱ తేజో బలంబులలో సగంబు పుచ్చికొని నీవ యాశత్రుల సమయింపు మెల్ల భంగిని నీకు రక్షణీయుల మగు మమ్ము రక్షింపు’ మనుటయు నజ్జగన్నాథుండు. | 274 |
| క. |
‘అమరులకు నసురులకు నే | సముఁడ శివం బఖిల భూతజాలంబులకున్ సమత నొనరింప శివ నా | మము నాకుం జెల్లు లోకమాన్యం బగుచున్. |
275 |
| వ. | అయినను. | 276 |
| చ. |
అనయముఁ గ్రూరకర్ములగునట్టి విమూఢులఁ బిల్కుమార్పఁ బూ నన తగు ధర్మవర్తను లనంజను మీయెడ ద్రోహులైన య ద్దనుజులఁ ద్రుంచి మీకుఁ బ్రమదం బొనరించెదఁ దేజమున్ బలం బును సగపాలు వెట్టి ననుఁ బొందఁగఁ జేయుఁడు మీరలందఱున్.’ |
277 |
| వ. | అని ‘మఱియు నొక్కటి సెప్పెద లోకంబులకెల్లను బశుత్వంబును నాకుం బశుపతిత్వంబును గావలయు నట్లయినఁ బశుహననంబునం బాపంబు లేకుండు. | 278 |
| క. |
ఒనరింపుఁడు దివ్యరథం | బును దచ్చోదకుని నశ్వముల విల్లును న మ్మును నాకు నట్టులైనను | దనుజుల దుర్గములు వినిహతములగు నాచేన్.’ |
279 |
| ఆ. |
అనిన విని పశుత్వమునకు శంకించి | విషణ్ణులైన సురల చందమెఱిఁగి భయము గొనఁగవలదు పశుభావమోక్షణ | విధియుఁ గలదు దాని వినుఁడు మీరు.’ |
280 |
| వ. | అని పలికి హరుండు వారలతోఁ బాశుపత వ్రతానుష్ఠానంబునం బశుత్వ మోక్షణంబగు నదియును ద్వాదశాబ్దంబులు నడపవలయు నిష్ఠానురూపంబుగా సంవత్సరంబునఁ దదర్ధంబున ఋతువున మాసంబునఁ బండ్రెండు దినంబుల మాత్రను ఫలించు’ ననుటయు నట్లకాక యని వారలందఱును లోకంబులకు లోకేశ్వరునకుఁ బశుత్వంబుఁ బశుపతిత్వంబు గలుగుటకు నొడంబడి యమ్మహాత్మునిఁ బశుపతి వని పేర్కొని నిజతేజోబలార్ధంబులు సమర్పించినం గైకొని యత్యధిక బలుండై తొల్లింటికంటె వెలింగె నప్పుడద్దేవునకు దేవతలు విభవంబెసఁగఁ బురహననంబునకయి యభిషేకంబు సేసి త్వష్టనాలోకించి ‘మహాదేవునకు దివ్య రథంబును దగియెడు సాధనంబులను గల్పింపు’ మనవుడుఁ దపఃప్రభావ మహనీయుండగు విశ్వకర్మ యవహితుండై. | 281 |
| సీ. |
సామర్థ్యమొప్ప విశ్వంభరా చక్రంబు | రథముగఁజేసి చంద్రముని నుష్ణ కరునిఁ జక్రంబులుగాఁ బెట్టి వారిధి | నక్ష మొనర్చి హిమావనీధ రంబున వింధ్యనగంబున నస్తా చ | లంబున నుదయశైలమున బలుపు టవయవంబులు దీర్చి యగ్నుల మూఁటఁ ద్రి | వేణుకరచనఁ గావించి మేరు |
|
| ఆ. |
పర్వతమున నాతపత్రంబుఁ గల్పించి | హరులు వేదములు శరాసనంబు వత్సరంబు శరము వాసుదేవుండును | గాఁగ సంఘటించె గౌరవమున. |
282 |
| వ. | ఇట్లు చరాచరాత్మకంబై తేజరిల్లు నత్తేరు వీక్షించి ఫాలాక్షుండు గ్రహమండిత వ్యోమమండలం బుపాదానకారణంబుగా విశ్వకర్మ గావించిన కవచంబు దొడిగి శరాసనంబు ధరియించి శరంబు పుచ్చికొని దానవ సంత్రాసనోత్సాహుం డగుచు రథారోహణంబు సేసి వృషభధ్వజంబునం బొలుపొంది. | 283 |
| ఆ. |
‘అప్సరోగణంబు లాడుచుఁ బాడుచు | సంతసమునఁ జెలఁగ సకల మునులు బహువిధములఁ దన్నుఁ బ్రస్తుతిసేయంగ | నమరవరులఁ జూచి యల్లనగుచు. |
284 |
| క. |
‘సారథి యెవ్వం? డనుటయు | వారలు ‘నీ చిత్తమునకు వచ్చిన వానిం గారుణ్యంబునఁ గైకొని | తేరునడపఁ బనుపుమనిరి ధీరవిచారా! |
285 |
| వ. | అనవుడు నద్దేవుండు. | 286 |
| తే. |
‘అరయ నెవ్వాఁడు నాకంటె నధికుఁ డతని | మీర యెఱిఁగి యొనర్పుఁడు సారథిత్వ మునకు’ ననిచెప్పుటయు మహామునులఁ గూర్చి | కొని యమర్త్యులు సంభృతవినయు లగుచు |
287 |
| వ. | కమలాసను కట్టెదిరికిం జని భక్తిం బ్రణమిల్లి ‘దేవా! నీ వలన నీలగ్రీవుండు ప్రసన్నుం డయ్యె భవదాజ్ఞ ‘నే మితనికి రథంబుం దగు సాధనంబులు సమకట్టితిమి సారథి దొరకకున్నవాఁ డది యెట్లనిన సారథ్యం బాచరించు పురుషుండు బలసత్త్వంబుల రథికునకధికుండు గావలసియుండు రథంబు పృథ్వి, రథ్యంబులు వేదంబులు, రథికుండు రుద్రుండు, రథచోదకుండు సులభుం డగునే? గుణాధికుండ వగు నీ విప్పనికిం బూనవలయు దానవ భయభ్రాంతులమైన మమ్ము రక్షింపుము మా కేడుగడయు నీవ భవదీయ ప్రసాదంబున బ్రదికెద’ మని చాఁగిలి మ్రొక్కినం బరమాదరంబున నెత్తి యప్పరమేష్ఠి వారలం గారుణ్యంబునం గనుంగొని. | 288 |
| ఉ. |
‘మీరు నిజంబ చెప్పితిరి మిక్కిలి నేర్పును లావుగల్గినన్ సారథి పోరులన్ రథికసత్తముఁ దా గెలిపించు బుద్ధి దో స్సార విలాస భంగులకు శర్వుఁడు మెచ్చఁగ నాగమాత్మ కో దార హయంబులన్ నడపెదన్ దనుజుల్ వెఱఁగందు నట్లుగన్.’ |
289 |
| వ. | అని పలికి సురగణంబు ముదంబునం బొదలఁ దనచేతి కమండలు వొక్కెడనిడి జడముడి బిగియించి యజిన పరిధానంబు దృఢంబుగా బంధించి ప్రణవంబునం ద్వష్టయొనర్చిన మునికోల వుచ్చికొని నొగ లెక్కె నిట్లు లోకపితామహుని సురలు శంకరునకు సారథ్యంబు సేయించి’ రని చెప్పి దుర్యోధనుండు వెండియు నిట్లనియె. | 290 |
| క. |
‘హరు లమ్మహాత్ము లిరువుర | భరియించుట కోర్వలేక పడుటయు నెత్తెన్ వెరవున లావున వాగెలు | ధరియించుచుఁ బద్మభవుఁడు ధరణీనాథా! |
291 |
| వ. | ఎత్తి యత్తురంగంబులకు వెండియు వీర్యశౌర్యంబులు గలుగ ననుగ్రహించి రథంబు గడపం దత్కౌశలంబు గొనియాడి కామదమనుం ‘డా దనుజుల దుర్గంబుల దెసకు నరదంబు వఱపుము నేఁడు జగంబుల యలజడి మాన్చెద నాచేతి బలువుసూడు’ మని పలికిన నప్పరమ సారథి మనోమారుత జవసత్త్వంబులు గలుగు నవ్వేదాశ్వంబులం బఱప నథర్వాంగిరసులు చక్రరక్షకులయి చనుదేర నత్తే రా పురంబుల కడరిన నయ్యాదిమ రథికుండు. | 292 |