| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము |
| వ. | దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె; నట్లు దన సుతుండు సూతసుతు కోర్కి దీర్పంబూని యతి ప్రయత్నంబు సేయుట యాకర్ణించి యాంబికేయుండు. | 2 |
| ఆ. |
‘ఎట్లు ప్రియ మొనర్చె? నట్లు సంప్రార్థితుం | డైన మద్రనాథుఁ డంతఁ గోరి తేరు గడప నతని తెచ్చికొన్నట్టి య | వ్వీరుఁ డేమి భంగి విక్రమించె?’ |
3 |
| వ. | అని యడిగిన సంజయుం డిట్లనియె, నట్లు రథికసారథులు విలసిల్లి వందిమాగధ ప్రస్తూయమాను లగుచుఁ దనవలను గౌరవంబునం గనుంగొనుటయుఁ, గురురా జయ్యంగరాజు నుద్దేశించి. | 4 |
| చ. |
గురుఁడును భీష్ముఁడున్ నరునకున్ బకవైరికి నగ్గలంబు, వీ రిరువురు వారి నిద్దఱ నహీన పరాక్రమ లీల గీటడం తురు ధ్రువమంచు నాత్మఁ బరితోషముఁ బొందుదు; నట్లు గాక ని ర్భర బల శౌర్యముల్ మెఱయ గ్రక్కున నాపని నిర్వహింపుమీ! |
5 |
| తే. |
బాడుదల నొండెఁ బట్టుము పాండు తనయ | ముఖ్యు; వీరు వా రన నేల? మునుము వట్టి వైరివర్గంబు నెల్లను బారిసమరి | సైన్యయుతముగ నద్భుత జయము గొనుము.’ |
6 |
| వ. | నడపు మనుటయు, నమ్మాటఁ గైకొని కర్ణుండు శల్యునిం దేరు నడపు మనిన నతం డట్ల చేసె; నప్పుడు శంఖ భేరీ ప్రముఖ తూర్యనాదంబులు రోదసీ గహ్వరంబు విహ్వలంబు గావించె; నవ్విధంబునం జనిచని గర్వాగ్రహ విధేయుం డగు రాధేయుం డమ్మద్రపతి కిట్లనియె. | 7 |
| శా. |
‘నారాచాది మహోగ్ర బాణ పటలీ నానావిధోల్లాసముల్ సైరింపన్ ధృతిలేక పాండుతనయుల్ సంభ్రాంతి నొందంగ, వి స్మేరంబై ఖచర వ్రజంబు వొగడన్, మెచ్చంగ నీ చూడ్కి దు ర్వారో దగ్రత నేఁడు సూపెద భుజావష్టంభ సంరంభినై’. |
8 |
| సీ. |
అన విని మద్రరా జాతని కిట్లను, | ‘సత్య పరాక్రముల్ శౌర్యఘనులు భుజ వీర్య మహితులు భూరి తేజోధను | లఖిలాస్త్ర విత్తము లార్యు లమర పతికైన రణమున భయము పుట్టింపంగ | నోపుదు రప్పాండుభూపతనయు, లేల వారల నింత దూలవోఁ బలికెద, | విప్పుడు వల్క రాదెట్లు నీకు |
|
| తే. |
గాండివ జ్యా నినాదమ్ము గ్రమ్మి కర్ణ | విదళనము సేసినను భీము గద మెఱుంగు లొలసి చూడ్కులు మిఱుమిట్లు గొలిపినను భ | యంబు పెల్లున నపుడు వా యడఁగుఁ గాక!’ |
9 |
| వ. | అని వెండియు. | 10 |
| చ. |
‘నరుని శరంబులన్ రథ గణంబులు గూలఁగ, భీము నుల్లస త్పరిఘమునన్ గజ వ్రజము భగ్నముగాఁ బెఱ తమ్ములున్ యుధి ష్ఠిరుఁడును దాఁకినం జలము డించి దొరల్ గలఁగంగఁ జూచియుం దిరమయి నీవు నాలుకకుఁ దెచ్చిన మాటగదా వినందగున్.’ |
11 |
| క. |
అను పలుకులు వినియుం దా | వినని చెవులు సేసి, మద్రవిభుతో రాధా తనయుఁడు ‘నా చేతి బరువు | గనుఁగొనియెద విపుడ’ యనియె గండ మరంగన్.’ |
12 |
| వ. | ఇట్లు సంగరోత్సాహ దీప్తుండై నడతెంచు నతని నుపలక్షించి. | 13 |
| చ. |
కురుబల ముబ్బి యార్చెఁ, బటు ఘోటక హేషిత నిస్వనంబులుం గరివర బృంహిత ధ్వనులు గాఢములై విలసిల్లె, నెత్తురుల్ గురిసె, నభంబు మ్రోయఁ బిడుగుల్ మొరసెం, బొరి నుల్క లెల్లెడం దొరఁగెఁ బ్రదీప్త మారుతము ధూళిఁ గడున్ వడిఁ జల్లె భూవరా! |
14 |
| వ. | మఱియు బహువిధోత్పాతంబులు గౌరవులకు నాశం బగుటం దెలుపుచుం దోఁచెఁ; దోఁచిన నవి యెల్ల సరకు గొనక వారు దైవమోహితులు గావున శల్య సహితుండైన కర్ణుం గనుంగొని కుంతీనందను లతనిచే నిర్జింపఁ బడుదురకాఁ దలంచి సంతోషించి; రతండు భీష్మద్రోణుల దోర్వీర్యంబులు పాండుతనయులచేతఁ గోలుపోయె నని మనంబున వారల మెచ్చక ముంగలియై మెఱసి నడచుచుండి పార్ధపరాక్రమ స్మరణంబునం గ్రోధంబు జనియించి యూర్పులు సందడింప మాన దర్పోన్మాదంబున మద్రపతి కిట్లనియె. | 15 |
| మ. |
‘అరదం బెక్కి శరాసనంబు గొని తెంపారంగ నేనేచి సం గర సంక్రీడకుఁ జొచ్చినం దృణ సముంగాఁ గొందు, న ద్దేవతా వరునైనన్ గురు నాపగాతనయుఁ జావం జూచుటన్ వైరు లే తురు చెండాడెద నుగ్రతం దలలు, నా దోర్దర్పముం జూడుమీ!’ |
16 |
| వ. | అని పలికి, యనంతరంబ ‘గాంగేయ కుంభసంభవులంతటిమానుసులు నిట్లు రిత్తసావు సత్తురే!’ యని యుగ్గడించి మఱియు నిట్లనియె. | 17 |
| ఉ. |
వారల లోకవీరుల నవధ్యుల గీటడఁగించి, పల్వురన్ వారల యట్ల యెందు ననివార్యు లనం జను మేదినీశులం బోర వధించి, రౌద్రమునఁ బొంగి క్రమాగత మృత్యు వొక్కొ నాఁ గా రణకేళికిం గడఁగు గాండివి నేన యెదిర్చి యోర్చెదన్. |
18 |
| ఉ. |
పాండు నృపాగ్రనందనుఁడుఁ బావనియుం గవలుం జలంబుమై నొండొరు మూదలించుకొని యొక్కటఁ దాఁకినఁ దీవ్ర విస్ఫుర త్కాండ విదారితాంగకులఁ గా నొనరించి యలంచి లీలమై గం డడఁగింతుఁ బోక పెనఁగం గల చంద మెఱింగి చెండుదున్. |
19 |
| క. |
అని పలికి వెండియును ని | ట్లను, భీష్ముఁడు దెగిన ద్రోణుఁ డతులిత దివ్యా స్త్రనిచయము దోర్విలాసం | బును జాలం గలిగియుండె భూనుత మగుచున్. |
20 |
| సీ. |
ద్రోణుండు బహుదివ్య బాణదీప్తుఁడు భుజా | బలశాలి శౌర్య సంపన్న హృదయుఁ డక్షీణ విక్రముఁ డతిరథ శ్రేష్ఠుఁ; డ | వ్వీరుండు పార్థుచేఁ బోరఁ బడిన ధార్తరాష్ట్రుల యేపు దఱిఁగెఁ; దదాప్త సై | నికులు గం డడఁగిరి; నీ వెఱుంగ నైనను రాము కృపాతిశయంబునఁ | గనిన యీ రథమును గార్ముకాది |
|
| ఆ. |
దారుణాస్త్ర శస్త్ర తతులును గలిమి నే | నతనిఁ దొడరి దివిజు లడ్డపడినఁ గూల్తు, నెల్లభంగిఁ గురురాజు మన్నన | యప్పు దీర్తుఁ బ్రాణ మాసపడక.’ |
21 |