| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము |
| సీ. |
‘తలఁచిన నెదకు సంతాపంబు సేయంగఁ | జాలెడునట్టివి జామదగ్న్యు కోపంబు బ్రాహ్మణ శాపంబు గాక యే | సరకు గొందునె మురహరుఁ గిరీటిఁ జెప్పెద విను మస్త్రశిక్షార్థినై మహేం | ద్ర నగంబునకు జమదగ్ని సుతునిఁ గోరి పోయినఁ కృపాంభోరాశి యగు నమ్మ | హాముని కులము నన్నడుగుటయును |
|
| తే. |
బొంకునకు నోర్చి బ్రహ్మాస్త్రమునకుఁ గాఁగ | బ్రాహ్మణుఁడనని చెప్పి తత్పాదభక్తి గలిగి మెలఁగంగ శిక్షించె నలఘు బహువి | ధాస్త్ర శస్త్ర సంవేదిఁగా నతఁడు నన్ను. |
88 |
| వ. | భార్గవాభిదానంబగు మహాస్త్రంబు లోనుగా ననేక దివ్యాస్త్రంబు లిచ్చెఁ; బదంపడి బ్రాహ్మంబగు నస్త్రంబు నొసంగె నొసంగి సమరంబున నాపత్సమయంబున దీనిం బ్రయోగింపుమని యానతిచ్చె; మఱునాఁ డత్త పోధన సత్తముండు మదీయాంక తలంబున నొఱగి నిద్రించుచుండ నొక్క జంతువు నా క్రింది తొడం దొలిచిన నమ్మహాత్మునకు నిద్రాభంగం బయ్యెడు నని కదలకుండితిఁ దదనంతరంబ మేలుకని యతండు నెత్తుటి వెల్లువఁ గని తత్ప్రకారం బడిగి ఏను జెప్ప విని మద్ధైర్యంబున కచ్చెరువడి నీవు బ్రాహ్మణుండవు గా వెవ్వఁడవని యొత్తి యడుగుటయు వెఱచి సూతసుతుండ నని చెప్పితిఁ జెప్పునప్పు డక్కీటకంబు నాలోకించిన నది యదృష్టపూర్వ వికృతాకారంబై యుండె నర్జున హితంబు గోరి యింద్రుం డమ్మునీంద్రునకు నన్నుఁ దేటపఱిచి యతనిం గోపింపంజేయువాఁడై కీట తనువు దాల్చి యట్లు సేసెంగా నోపు నా సంయమి కోపించి కపటంబున బ్రహ్మాస్త్రంబుఁ బరిగ్రహించి తది నీకు వలయు కాలంబున దోఁపమియు మృత్యువాసన్నంబైనం దోఁచుటయు నాపద ముట్టినయెడ భార్గవాస్త్రంబు దోఁపకుండుట యుం గలిగెడుమని శపించె; నిది జామదగ్న్య కోపంబు తెఱంగు బ్రాహ్మణ శాపంబు తెఱంగెఱింగించెద నాకర్ణింపుము. | 89 |
| సీ. |
శ్రమమునకై యేను సకలాంబకములు నె | క్కుడు వెస నేయ నయ్యెడకు నొక్క యాఁబెయ్య యుఱికి నా యజ్ఞానమున నంప | తాఁకునఁ గూలుడు దానిఁ గలుగు బ్రాహ్మణుం డధికకోపంబున నిది హోమ | ధేనువత్సం బిట్లు దీని శల్య నిహతంబుఁ జేసితి నీవు నా వచన శ |ల్యంబున నిహతుండ వగుము నీకు |
|
| తే. |
సమర మేకాగ్ర నిర్భరోత్సాహవృత్తి | నడవ నరదంబు చక్రంబు పుడమిఁ గ్రుంగ వలయు నెవ్వరు మార్కొని గెలువఁ గోరి | శ్రమము సేసెద వతనిచేఁ జావు మీవు.’ |
90 |
| చ. |
అనుటయు భీతి వేఁడికొని ‘యావులు వేయును నెడ్ల నాఱునూ ఱును రథముల్ శతంబును మెఱుంగుల మొత్తముఁ బోని యంగనా జన శతకంబు దంతి శత సప్తకముం గొని శాంతిఁ బొందవే!’ యనినను మానదయ్యె వసుధామరు కోపము తీవ్రరూపమై. |
91 |
| వ. | మానక యున్న మఱియును. | 92 |
| క. |
‘నాకుఁ గల సొమ్ములెల్లను | నీ కిచ్చెద ననుఁ బ్రసాద నిరత కటాక్షా లోకితుఁ జేయు’ మనుడు నతఁ |‘డీ కాఱులు మాను’ మనుచు నేఁగెం బెలుచన్. |
93 |
| వ. | ఇ ట్లరుగుచు నలుక పెంపునం గన్నుల నిప్పులు రాల మరలి కనుంగొని ‘నా పలుకులకు బొంకునుం గలదే? నీకీ దుష్కర్మంబు పరలోకంబున బాధకంబు గాకుండ నిదియ ప్రాయశ్చిత్తం బయ్యెడుం గాక పొమ్ము సూతనందనా! యే నెట్లంటి నట్లగుట దప్ప దరుగు’ మనియెం గావున నా జామదగ్న్య; బ్రాహ్మణుల శాపంబులకు వెఱతు సత్యంబ పలికితి నీ యున్న రాజులను నాతోడి సుఖ దుఃఖంబులకుం గలవా రగుటం జేసి కృష్ణార్జునులకు నే వెఱవ నింద్ర యమ వరుణ కుబేరులు వజ్ర దండ పాశ గదా హస్తులై బెట్టుముట్టి నను బెదర నని యాడుదుఁ; దక్కిన వారిం జెప్పనేల? యిప్పుడు బ్రహ్మాస్త్రంబునుం దోఁచుచున్నది; యన్నరుని యున్నెడకు మనరథంబు నడపుము పుడమి జనంబులు మదీయ కోదండ పాండిత్యం బొండొరులకుం జెప్పికొని యచ్చెరువందు చుండునట్లు సేసెద; నమ్మేటి మగని మృత్యు నివాసంబు నొందించెద. | 94 |
| సీ. |
కాండ మహా తరంగముల వైరుల ముంచు | విజయాంబురాశికి వేల నగుదు; బాణరశ్ములఁ బరిపంథులఁ బొదివెడు | నర్జునాదిత్యున కభ్ర మగుదు; విశిఖోగ్ర శిఖల విద్విషుల నేర్చు కిరీటి | ఘోర దావాగ్ని కాసార మగుదుఁ; బ్రదర వేగమున నరాతులఁ గూల్చు పా | ర్థాతి వాయువునకు నచల మగుదు; |
|
| తే. |
విల్లు వట్టెడు వారికి నెల్ల నెక్కు | డనఁగ నెగడిన గాండీవి నాహవమునఁ దొడరఁ బ్రాణంబులకు నాసపడు లఘు ప్ర | కారులకు వచ్చునే నాకుఁ గాక శల్య!’ |
95 |
| వ. | అని పలికిన విని యమ్మద్రపతి ‘వీని యంతరంగంబు గలంగెఁ; దా నర్జును చేతం జచ్చుట నిర్ణయించె; నెట్లనిన నిట్టి యప్పుడు జనులు దన మీఁదం జాలమి వెట్ట కుండుటకుం గాదె జామదగ్న్య బ్రాహ్మణుల శాపంబులు భూపాలురు విన నుగ్గడించె; నిక్కలంక యే నీ రజ్జులానికి నర్జును గుణ విశేషంబు లెఱింగించి మదం బడంచిన కతంబునం గలిగెఁ; గౌంతేయాగ్రజునకు నా యిచ్చిన వరంబు సఫలం బయ్యె’ నని మనంబునం దలంచి సంతోషించె మనుజేశ్వర వినుమా శల్యుండు సెప్పిన యాఖ్యానంబునం జిత్తం బెరియుచునికిం జేసి యా సూతనందనుం డతనితోఁ గనలుచు మఱియు నిట్లనియె. | 96 |