పురాణేతిహాసములు శ్రీమహాభారతము కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము
కృపాచార్యుండు సుకేతుం డను పాంచాలకుమారునిం జంపుట (సం. 8-38-82)
తే. అట్టు నొప్పింపఁ దూఁగాడు నా సుకేతు | కంధరము మెఱుఁగారెడు కత్తివాతి
దొడ్డ తూపున నేపునఁ ద్రుంచుటయును | శిరము ధర డొల్లెఁ గుండలస్ఫురణ మెఱయ.
246
వ. ఇట్లు సుకేతుండు సచ్చిన నతని మూఁకలు విచ్చె; ధృష్టద్యుమ్నుండు గృతవర్మయుం బోరునెడ ధృష్టద్యుమ్నుండు గృతవర్మ వక్షస్స్థలంబు విశిఖ నవకంబున నొప్పించుటయు’ నప్పాంచాల వరునతండు సూతకేతు హయస్యందన సమేతంబుగా నిబిడ శరజాలంబునం బొదివిన నవ్వీరుండు బలాహకపిహితమూర్తి యగు మార్తాండు ననుకరించి తాను సైంధవ వధ దినంబునం బారావతవర్ణంబు లగు రథ్యంబు లగ్గురు నరుణాశ్వంబులన్‌ బెరయం బఱపిన తెఱంగున. 247
తే. అలిగి నొగ నొగతోఁ దాఁక నతిరయమునఁ | దేరు వఱపి కృపాణ ప్రదీప్త పాణి
యగుడు, గద వుచ్చికొనియును నఱుమ లేక | చలము డిగఁ ద్రావి కృతవర్మ యిలకు దాఁటె.
248
వ. అక్కుంభసంభవు చందంబుగాక వంచకుండై యప్పరుసున నబ్బలు మగండు దొలంగిన నయ్యరదంబు మీఁదికి లంఘించి యా ధృష్టద్యుమ్నుండు. 249
క. ఆ రథికు నచటఁ గానక | సారథి తల దునుముటయును, సంతసమునఁ బొం
గారి తన శబ్ద మిచ్చి మ | హారవమున నిక్క డిక్క డనియె నతండున్‌.
250
చ. విని కృతవర్మఁ గాంచి పటువిక్రమకేలి యొనర్ప నాత్మ వా
హనమున కేఁగి యేచి ద్రుపదాత్మజుఁ డాతఁడు లోను గాఁగ న
మ్మొనఁ గల మేటి జోదుల సముద్ధతి యేడ్తెఱ నిల్వరింప వి
ల్గొనెఁ బటు శౌర్య శోభితబలుం డగు నయ్యదుముఖ్యుఁ డొక్కఁడున్‌.
251
వ. అట్టియెడ నొక్క రథికుండు రయంబున నిజరథంబుమీఁదికిఁ గృతవర్మం దిగిచికొని యనికిం దొలంగం గొనిపోయెఁ; బాంచాలోత్తముండును దన మునుము బలంబు గలంగం బరాక్రమించుచుండె. 252
సీ. ధర్మపుత్రుఁడు గురుతనయుతోఁ బెనఁగుచో | బాసటయై శినిపౌత్రుఁ డడరె
నా యిద్దఱును ద్రౌపదేయులు వెఱఁగందు | నట్లు వారలను సైన్యంబుఁ బొదివి
బహుళాంధకార మాపాదించి యమ్మేటి | విలుకాని సాయక వితతి నింగి
ఘనమయంబుగఁ బర్వ జననాథ వా రల్గి | యొక్కొక్కరుం డనేకోగ్ర బాణ
 
ఆ. నిహతుఁ జేయ, నతఁడు ప్రహసిత వదనుఁడై | యొకని నొకని బహు సముజ్జ్వలాస్త్ర
విద్ధుఁ జేసి కడఁగి వివ్వచ్చుకొడుకు చా | పంబు దునిమెఁ గ్రూరభల్లనిహతి.
253
క. ధృతి నొండు విల్లు కొని యా | శ్రుతకీర్తి దదీయ తనువు సొనిపెం బ్రదర
త్రితయంబుఁ గనలి యాతం | డతనిం దత్పార్శ్వచరుల నమ్ముల ముంచెన్‌.
254
క. ముంచు మహోద్ధతి యాలో | కించి తనదు చూడ్కి దట్ట కెం పెసఁగం గో
పించి శరనికరములు గు | ప్పించుచు ధర్మజుఁడు గవిసె భీషణభంగిన్‌.
255
చ. కదిసిన నమ్మహాభుజుఁడు గార్ముకముం దనుమాడి మూఁడు బె
ట్టిదపు మెఱుంగు తూపులఁ బటిష్ఠత సూపిన నా నృపాలుఁ డు
న్మదుఁ డయి మేటివింట బలుమార్గణముల్‌ వెస నేసె మూఁడు న
ర్వదియును నద్ధరామరునిపై శినివంశవరుండు దోడ్పడన్‌.
256
వ. ఇట్లు ప్రాపై కడంగి. 257
ఆ. అర్ధచంద్రబాణహతి గురుపుత్రుని | ధనువు శినివరుండు దునుముటయును,
శక్తి వైచి యతఁడు సారథిఁ గూల్చి బల్‌ | వింటఁ గురిసె బహుళవిశిఖ వృష్టి.
258
క. సారథి లేమిని సాత్యకి | తే రీడ్చెఁ దురంగమములు దే రటు వాఱన్‌
భూరమణ! ధర్మనందను | వారు వొదివి రంపగముల వడి గురుతనయున్‌.
259
క. భీమాస్త్రశిఖల నశ్వ | త్థామాగ్ని దహించె ధర్మతనయానుచర
స్తోమాటవి నొక వ్రేల్మిడి | నామెయి జన్మవిస్మయావహం బయ్యె నృపా!
260
వ. అప్పుడు కురురాజు పాండవుల నాచార్య నందనుచేతం దెగినవారలంగాఁ దలంచె నంతఁ దఱిమి యుధిష్ఠిరుండు ప్రచండ కాండంబుల నవ్విప్రవరుం బీడితుం జేసి. 261
సీ. అలవును వెరవును గలవు కృతాస్త్రుండ | వని నిన్ను నెఱుఁగుదు; నైన నెల్ల
సొంపు పార్షతునకుఁ జూపనోపినఁ దెల్ల | మగు; నది యట్లుండె; నరయ నీకు
నెయ్యంబు వాటించునేర్పు కృతజ్ఞత | యనునివి లేవు; బ్రాహ్మణుఁడు దపము
దమమును గల్గు వర్తనమున నుండుఁగా | కని సేయునే? యెంత యడిచిపడినఁ
 
ఆ. బడితిగాని యడ్డపడలేవు కౌరవ | కులము నెల్లభంగి గెలుతు మేము
నీవ చూడ’ ననుడు నా వీరుఁ డేమియు | ననక నగుచుఁ బఱపె నంపవెల్లి.
262
వ. ఆ వెల్లికి నోర్వలేక యా భూవిభుండు దొలంగె; ని ట్లంతటి మానిసిం గెలిచినవాఁడై నిలిచి నిజపార్శ్వంబుల మూఁకలం గనుఁగొని గురుపుత్రుండు గ్రూర విహారంబునకు నమరి మెఱసె; మారుతితోడం బోరు కర్ణుండు దదనుచరంబులగు కరూశ చేది సృంజయ పుంజంబులుం దన్నుఁబొదివిన నబ్బలంబునకు బాహుబలంబు సూపుచుండ నతని విడిచి యా భీమసేనుండు గౌరవసేనపయిం గవిసి కనుపుగొట్టె; నా రాధేయ వృకోదరుల మునుములు ధనంజయ మునుము భంగిం బ్రజాక్షయం బగుచుండె; నీ దుర్మంత్రంబున ననేకులకుం బొలియవలసె; నయ్యవసరంబున. 263
సీ. కవలతోఁ బెనఁగెడు కౌరవనాథుఁ డ | న్నకులు నంగంబున నవ శరములు
సొనిపి యా సహదేవు కనకపు సిడము ద్రుం | చిన, వార లిరువురు నెనిమిదింటఁ
బది తూపులను నొంపఁ; బతి రెండు విండులుఁ | దునుమాడుటయు నన్యధనువు లెత్తి
యన్నయుఁ దమ్ముండుఁ దన్నుఁ బెక్కమ్ములఁ | బొదివినఁ గనలి యా భూవిభుండు
 
తే. వారి దివ్యాస్త్రములఁ గప్పు ఘోరభంగి | గాంచి జను లక్కుమారులు గాలవశతఁ
బొందుదుర కాఁ దలంప నప్పుడు గడంగి | యడ్డపడియె ధృష్టద్యుమ్నుఁ డతి రయమున.
264
వ. ఇట్లు పాండవ సేనాపతి భూనాథుం దాఁకి యేసిన నతండు. 265
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )