| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము |
| సీ. |
పాండ్యుఁ డా సేనలపై బెట్టిదంబుగ | నడరి బాహాబల మక్కజముగఁ బేరిచి పీనుంగుపెంటగాఁ జతురంగ | ముల రూపుమాపె న య్యలఘుభుజుఁడు ద్రోణ భీష్ములు దనతోఁబాటి యను పలు | కున కోర్వఁ డచ్యుతార్జునులు దనకు నెక్కుడు నా విన్న నేవగించుచునుండు | నవ్వీరుఁ డమ్మెయి నాక్రమింపఁ |
|
| ఆ. |
గని కడంగి యెదురు చని గురుతనయుండు | నగుచుఁ ‘బగఱ నీవు మృగకులంబు గలఁచు హరియుఁ బోలెఁ గలఁచెదు నా దిక్కు | మొగము సేసి యనికి మొనయు’ మనియె. |
318 |
| చ. |
అన విని మేను వొంగ మలయధ్వజుఁ డుగ్రపు నారసంబుఁ ద త్తనువునఁ గ్రుచ్చి మౌర్వి నినదంబు నభంబునఁ బర్వ నంప వె ల్లి నిగుడఁ జేయఁ దొమ్మిది శిలీముఖముల్ వెస నమ్మహీశుపై ననిమిషవర్ణనీయగతి న గ్గురునందనుఁ డేసె నేసినన్. |
319 |
| వ. | అ త్తొమ్మిదింటిలోన. | 320 |
| క. |
ప్రతిశరములు పాండ్య మహీ | పతియును బరఁగింప నైదు భగ్నము లయ్యెన్ గతి సెడక నిగిడి రథ్య | ప్రతతి ధరం గూల్చె నాల్గు బాణము లధిపా! |
321 |
| తే. |
మఱియు గురుపుత్రుఁ డేయ నమ్మలయకేతుఁ | డా శరంబులు దద్ధనుర్జ్యాలతయును దునిమెఁ; దునిమిన నతి రయంబున నతండు | నారి సంధించి యమ్ముల నభముఁ గప్పె. |
322 |
| వ. | అ ప్పాండ్యమహీపతి పరివార సామర్థ్యంబున రథ్యవంతుం డయి వాయవ్యాస్త్రంబున నయ్యంప పరంపరఁ బ్రతిహతంబు సేసి తదీయ చక్రరక్షకులం దెగటార్చి యార్చినం గెరలి యగ్గురునందనుం దత్సహచరుల నుఱుమాడి రత్నమయాగురు చందనసుందరంబైన మలయగిరి ప్రకారంబునం బొలుచు కేతనంబు గూల్చి గుఱ్ఱంబుల గీటడంగించి సూతు ప్రాణంబులు గొని చాపంబు ద్రుంచి తేరు దుమురు సేసి యతండు పొలివోని పౌరుషంబునం బ్రయోగించు నస్త్ర శస్త్రంబుల నుఱక నఱికి యగ్గమై యున్నను గయ్యంబువలని వేడుక నతని సమయింప నొల్లక యరవాయి గొనిన యాలోనఁ బతిత యోధం బైన సుకల్పిత మాతంగంబు నెక్కి గిరి శిఖరంబు నలంకరించు కేసరియ ట్లొప్పి యా ద్రవిడేశ్వరుండు సామజంబు నుద్దామగతిం దఱిమి భీమాభిరామం బైన తోమరంబు వైచిన మణిగణోజ్జ్వలంబైన యా ద్రౌణి శిరోభూషణంబు ధరణిం బడినఁ ద్రొక్కంబడిన భుజంగంబు పోలికం గనలి యబ్బలుమగండు తత్పార్శ్వవర్తుల నార్వుర రథికవరులఁ దద్వేదండంబుఁ తుండంబును చరణ చతుష్టయంబును నమ్మేదినీపతి పాదంబులుఁ గరంబులు శిరంబును నతి తీవ్ర భల్లంబులం దునుమాడిన నద్దిక్కు మూఁకలు విచ్చెం; గురుభూవరుం డమ్మహీసురవరుం జేరం జని యగ్గించె నప్పుడు. | 323 |
| క. |
నిలు నిలు మని తమ మూఁకల | నిలిపి వృకోదరుఁడు గవిసె నీ బలములపైఁ దలకొని ధృష్టద్యుమ్నా | దులు సంరంభోద్భటముగఁ దోడ్పడి రధిపా ! |
324 |
| క. |
వారల వడి కోర్వక య | క్కౌరవ సైన్యంబు దెరలఁ గర్ణుఁడు దర్ప స్ఫారత నదల్చి నిలిపి యు | దారగతిన్ వైరిరథికతతి మార్కొనియెన్. |
325 |
| వ. | అతనికి బాసటయై యడరిన యశ్వత్థామచేతం బలువురు పాంచాలురు వొలిసిరి; కృష్ణుండు గ్రీడికిం బాండ్యమహీపతి సమయుట సూపి సమీరనందన కర్ణాదులగు నిరువాఁగు రథికుల పరాక్రమంబును వేఱువేఱ నిరూపించి చూపిన నతండును రథంబు మన సేనలోనికి బోవనిమ్మనిన నచ్యుతుం డట్లు చేయ నుబ్బిన పాండవానీకంబునకును రాధేయ గురుపుత్రుల రభసంబునం బేర్చిన మనమొనకును సంకుల సమరం బయ్యె; నం దాకర్ణునకు ధృష్టద్యుమ్నునకుం బరస్పర శరకర్తనంబును నితరేతర చ్ఛత్రకేతుఖండనంబును నన్యోన్య వర్మ విదారణంబును మిథశ్శరీర పాతనంబును నగు సంగ్రామంబు సెల్లె; నట్టియెడ నా సూతనందనునకుం దలకడచి గురునందనుండు ద్రుపదనందనుం గవిసి ‘బ్రహ్మఘ్న! నిలు నిలు; మేను గలుగ నెట్లు బ్రదికెద’వని పలికి వెండియు. | 326 |
| క. |
మాతండ్రియెడం జేసిన | పాతకముకతంబు గాఁగఁ బాంచాల నికృ ష్టా! తునిమెద నిను నరుఁ డిట | కేతేరకయున్నఁ బాఱ కీవు నిలిచినన్.’ |
327 |
| వ. | అన విని ధృష్టద్యుమ్నుం డతని కిట్లనియె. | 328 |
| క. |
‘మీ తండ్రి కుఱికి నఱికిన | హేతియ నీ కొఱకు నునిచితిపుడ నఱుకుదున్ నీ తులువపలుకులకు నీ | డై తోఁచిన యుత్తరంబు నదియ దురాత్మా!’ |
329 |
| వ. | అని యంత నిలువక. | 330 |
| తే. |
‘వినుము బ్రహ్మఘ్నుఁ డన నీకు జనునె? బ్రాహ్మ | ణ బ్రువఘ్నుఁడ నై సమున్నతి వహించు నన్నుఁ గిల్బిషపరుఁ డను నిన్ను జనకు | కడకుఁ బుచ్చెద వేగిరపడక నిలుము.’ |
331 |
| వ. | అనియె నట్లయ్యిరువురు నొండొరులం బరుషంబులు పలికి తలపడి వియత్తలంబు విశిఖ శిఖా కలాపంబులం గప్పిరి రాధేయుండు యుధామన్యు నుత్త మౌజో ద్రౌపదేయ శైనేయులను మఱియుం జేయంగల పాండవ పాంచాల యోధులను బొదివి భండనంబు సేయుచుండె; నా ధృష్టద్యుమ్నుండు గురుపుత్రు కోదండంబు దుండంబులు సేసినం గుపితుండై యొండు విల్లుగొని యవ్వీరుండు. | 332 |
| క. |
సూత తురంగ స్యందన | కేతన చాపములు నఱికి కేలిమెయిన్ ను గ్గైతొరఁగ నేసెఁ దోడ్తో | నాతత శక్తియును గదయు నతఁ డెత్తంగన్. |
333 |
| వ. | అప్పాంచాలోత్తముండు వాలునుం బలుకయుం గొని కవియం గడంగిన నవియును దుమురు సేసి పె ల్లేసి పడకున్న నశ్వత్థామ వేగిరపడి వెఱఁగందుచుఁ జేతి బాణాసనంబు విడిచి కృపాణంబు గొని భుజంగంబు దెస కడరు విహంగపతి విధంబునఁ జనుట సూచి సవ్యసాచితో శౌరి ధృష్టద్యుమ్నుండు గురుపుత్రు బారింబడియెం గావవలయు ననుచు నద్దిక్కు సూపిన నతండు సత్వరుండై యవ్వీరుం డా ద్రుపదపుత్రుం గవిసిన కొలందిఁ గ్రూరంబు లగు నారాచంబులు గుప్పించి నొప్పించిన నమ్మహీసురవరుం డయ్యుత్సాహంబు వదలి మరలి యరదంబున కరుగ సహదేవుండు దన తేరిపైకి నప్పార్షతుం దిగిచికొని తొలంగం గొనిపోయె నక్కుంభసంభవ సంభవుం డగ్గాండీవి మార్కొని పెనంగి బెట్టిదంబుగాఁ గనుకనిం దాఁకి యతండు నాటిన సునిశిత శరంబున సోలె; సారథి రథం బొండు వలనికిం దోలె నర్జునుం డట్లు నిజసేనానాథు రక్షించి ద్రౌణి మదం బడఁగించుట గనుంగొని కౌంతేయ సైనికులు సింహనాదంబులు సేయ నక్కడ నిస్సాణాదుల నాదం బెసంగి నింగి నిండిన. | 334 |
| తే. |
సూతసుతుఁడు ధనంజయుఁ జూచి రోష | కలుషితాక్షుఁ డై తలపడఁ దలఁచె నపుడు తత్‌క్షణమున సంశప్తక తతియుఁ దోఁచె; | రెండుఁ గని యిట్టు లనియె నా క్రీడి హరికి. |
335 |
| వ. | ‘కర్ణుండు మనల మార్కొనం గడంగెడు సంశప్తకులు గ్రుమ్మఱం బొదివిరి; కర్ణుచేతం దగులుపడితిమేని సంశప్తకుల కోహటించిన వార మగుదుము వారల దిక్కు దేరు పోవనిమ్ము.’ | 336 |
| చ. |
అన విని యట్ల చేసె నతఁ డర్జునుఁ డా రిపుకోటి ముట్టి యే పున నుఱుమాడుచుండెఁ గురుభూవర! యప్పుడు ధర్మసూతనం దనులు సముద్ధతిం గడఁగ దందడి క్రొత్తగ వారి సేనయున్ మన మొనయం బెనంగె నుపమా రహితంబగు విక్రమంబునన్. |
337 |
| ఉ. |
సంగర మేను బెక్కు దివసంబులు సూచితిఁ గాని యెప్డు నా భంగి మునుంగ దచ్చెరువుపాటునఁ జిత్తము వోరు చున్కియో త్రుంగుచు నున్కియో యెఱుఁగఁ దూలక పైపయిఁ గ్రమ్ముఁ గూలు సే నాంగములందు నిందుఁ గలహంబు మహోగ్రత యేమి సెప్పుదున్! |
338 |