| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము |
| తే. |
‘ఎందు వచ్చెదు? నిలు నిలు; మేను గలుగఁ | గడిమి సెల్లునె నీకు; నీ క్షణమ నిన్ను నంతకుని పాలి కనిచెద’ ననుచు రోష | రక్తలోచన రుచుల శరములు వఱపె. |
362 |
| క. |
రాధేయుండు నుదీర్ణ | క్రోధుం డై గర్జతోడి గుణరవము నభో బాధం బొనర్పఁగా నిజ | యోధులఁ బురికొల్పికొని సముద్ధతిఁ గడఁగెన్. |
363 |
| వ. | అ ట్లయ్యిరువురు నుత్సాహంబు వాటించి నిజానీకంబు నిలువరించిన నది పురికొని పోరికి నమరుటయుఁ బాండవబలంబును దిరంబయి పెనంగందొడంగె; నట్టియెడ నక్కడ నిక్కడఁ జేయంగల దొరలు దలపడి యుక్కున నక్కజం బగు సమరక్రీడ సలిపి; రందు. | 364 |
| సీ. |
కర్ణుఁ డేపారి శిఖండి రథ్యముల సా | రథిఁ గేతువును గూల్చి రయము మెఱయ విగతాయుధుఁడు బాణవిహతాంగుఁడును గా ను | దగ్రుఁ డై తఱుమ నతండు దొలఁగఁ బాఱె; దుశ్శాసన పార్షతు లొండొరు | తనువులు నొంచుచు ననిమిషులకు నచ్చెరు వగు నట్టి యని సేయ వారల | తనువులు లెడసొచ్చి పెనఁగి రంగ |
|
| తే. |
రాజు సూడఁ దత్పుత్రు సారథి శిరంబు | నకులుఁ డొక భల్లమునఁ ద్రుంప, జకిత మై క లంగు నచ్చటి మూఁకఁ జలంబు మెఱయ | నిలిపె నా సూతసూనుండు నృపవరేణ్య! |
365 |
| వ. | అట్లు సారథిరహితుండైన వృషసేనుండు వేఱొక్కసూతు నమర్చికొని తండ్రికిం జక్రరక్షకుండై నిలిచె; నకులుండు నొండు దెస కడరె; సహదేవుం డులూకుని విరథునిం జేసి పఱపె; సాత్యకిసౌబలు లన్యోన్య కేతు పాతనంబును బరస్పర కంకట కర్తనంబునుం జేసి; రా సమయంబున శైనేయుండు దురంగంబులం జదిపిన నరదంబు డిగ్గనుఱికి యోసరించు న గ్గాంధారవిభుం గని యులూకుండు. | 366 |
| క. |
మును సహదేవుం డెగువం | జనినప్పుడ యొండు దేరు సవరించుకొనం గనుట నది పేర్చి యతనిం | గొనిపోయెను సంగరమునకుం దొలఁగంగన్. |
367 |
| ఉ. |
అచ్చటిమూఁక నల్గడల నాతురతం జెడి పాఱె భీముచేఁ, జచ్చెఁ గురుక్షితీశ్వరుని సారథి; కూలె హయాళి నుగ్గుగాఁ జొచ్చె రథం; బతండు వెఱ సొచ్చి ధరిత్రికి దాఁటి పోయి వె న్నిచ్చిన నీదు యోధవరు లేడ్తెఱ మార్కొని రమ్మరుత్సుతున్. |
368 |
| వ. | యుధామన్యుండుఁ గృపాచార్యు ధనువు దునిమిన నమ్మహాత్ముండు వేఱొక్కవిల్లెత్తి. | 369 |
| ఆ. |
కేతనంబు గూల్చి యాతపత్రము దును | మాడి సూతుఁ జంప నధికభయము గదిరి తేరు దాన కయ్యంబునకుఁ దొలఁ | గంగఁ దోలె నతఁడు కౌరవేంద్ర! |
370 |
| క. |
శితశరము లుత్తమౌజుఁడు | గృతవర్ముని మేన నింపఁ గినుక గదిరి మూ ర్ఛితుఁ డుగఁ జేసె; నతఁడు వెస | నతనిం దత్సూతుఁ డెగచె నరదము దొలఁగన్. |
371 |