| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | కర్ణపర్వము - తృతీయాశ్వాసము |
| వ. | అనిన, నట్ల కాక యని, యర్జునుం డచ్యుతు నాలోకించి ‘యా మహీపాలుం గనునంతకు నామనంబు గలంగెడు; రథంబు రయంబునం బోవ ని’మ్మని పలుకుటయు, నతండు భీముం జూచి ‘యేము మీయన్న సేమం బరయుట వలయుపని గావునం జనియెదము; నీవు కురుసైన్యంబుల జయించుట యరుదె? గెలుపు గొను’మని యగ్గించు తెఱంగున దీవన లిచ్చి, తురంగమంబులం ద్వరితగతి నడపె; నివ్విధంబున మాధవ ధనంజయులు సమరంబునకు సమీరనందనుం జాలించి, శిబిరంబున కరిగి ధర్మనందను మందిరంబు ప్రవేశించి, యేకతంబ శయ్యాతలంబున నున్న యన్నరపతిం గని, యాతండు గుశలి యయి యునికికి ముదంబు నొందుచుం, దదీయచరణంబులకుఁ బ్రణతులయి; రా ధరణీనాథుండు వారలు రాధేయు వధించి వచ్చిరకాఁ దలంచి డెందం బలర, మందస్మితంబుతో నభినందించి, వారల వదనంబులు వీక్షించి యి ట్లనియె: | 28 |
| మ. |
‘సుర లైనం జలమెత్తి కర్ణుని రణక్షోణిన్ జయింపంగ నే ర్తురె? యవ్వీరుఁడు జామదగ్న్య కలితాస్త్రుం; డిద్ధతేజంబునన్ దొర సప్తార్చికి, లావునం బవనుతోఁ దుల్యుండు; కల్యుండు సం గర సంక్రీడలయందుఁ బేర్కొనఁ దగున్ గాంభీర్య ధైర్యంబులన్. |
29 |
| తే. |
అట్టి బల్లిదు ననిఁ దెగటార్చి, మీర | లేమియును గాక వచ్చితి’ రింతసంత సంబు దొరకొనునే నామనంబు? చింత | వంత యెల్లను జెడ నరవర్యులార! |
30 |
| 3తే. |
#అతనికి నాకునుం గలిగె నాహవ మింతకు ముంద; రందుఁ బా ర్షతుఁడును సత్యకాత్మజుఁడు శాంతనవాంతకరుండు ద్రౌపదీ సుతులును జూడఁగా, నతఁడు సూత హయ ధ్వజ పాతనంబు సే సి, తనువు దీవ్రకాండములఁ జెండఁగ, నే వెగడందితిం గడున్. |
31 |
| వ. | అప్పుడు దుర్యోధన ప్రభృతి ధార్తరాష్ట్రులకు భీమసేను ప్రభావంబున బ్రదుకరాని యంత పుట్టిన, నన్ను విడిచి యాతం డట వోవ, నే నిట వచ్చితి’నని చెప్పి వెండియు గాండీవి నుద్దేశించి: | 32 |
| సీ. |
‘పదుమూఁడువర్షముల్ పగలును రేలును | గర్ణుదర్పం బెట్లు గడతు నొక్కొ? యను చింతఁ జేసి, యాహారనిద్రలు లేక | పరితాప మందితిఁ; బశువుఁ జేయ విప్రులు పట్ట రా వెఱ సొచ్చి యొదిఁగెడు | గవయంబుచాడ్పునఁ, గర్ణభీతి నుల్లల నుడుకుచు నుండుదుఁ; గర్ణుండు | విడువక మోమున వ్రేలు నాకు! |
|
| తే. |
సురనదీసుతుచేతను గురునిచేతఁ | బడని పరిభవమున వాఁడు వఱిచె నన్ను నంతయును నీఁగఁ గాంచి నీయట్టియనుజు | వలనఁ దేజంబు వడసితి నలఘుచరిత! |
33 |
| చ. |
వెరవును లావు దివ్యశరవీర్యము శౌర్యముఁ గల్గు కర్ణు నె ప్పరుసునఁ జంపి? తీ వతని బంధులు మిత్త్రులు బుత్త్రులున్ సము ద్ధురబలు లాజికేలి నిరతుల్ ధృతరాష్ట్రునిపుత్త్రు లెల్లఁ ద త్పరిజను లెట్టు లట్టు లనిఁ బ్రాణము లిత్తురు వాని కడ్డ మై. |
34 |
| చ. |
అరు దిది! నీవు నొవ్వక మహాబలుఁ గర్ణు వధించి, తాతఁ డ క్కురుపతి సంతసింప నరుఁ గూల్చెద సంగరభూమి నేన యొ క్కరుఁడను వీఁకఁ దాఁకి యను గర్వపుమాట సనంగ నీక, నేఁ టి రణములోన నిట్లు ప్రకటింతె భవద్భుజ వీర్య శౌర్యముల్! |
35 |
| చ. |
పలికిన నేమి? బీరములు పల్కుట సేవక నీతి! యాసభం బలుకునె యట్లు జూదపు నెపంబున ద్రౌపది నింతకాల మ ప్పలుకు లలంచుచుండె; మదిఁ బాయవు గీఱినయమ్ము లట్ల; దో ర్బల దృఢలీల నిప్పు డవి వాపితి; తీర్చి తలంత యంతయున్. |
36 |
| క. |
అతిగర్వ సమున్నత మగు | నతని శిరము వానివార లందఱు బాష్పో ద్గతితోఁ జూడఁగ సమర | క్షితి డొల్లెనె? విజయ! నీదు శిత భల్లమునన్. |
37 |
| క. |
ఈరసమునఁ గదిసి శరా | సారము పైఁ గురియ నీవు సక్రోధుఁడ వై పేరురమున వెస నాటిన | తోరం బగు నారసమునఁ ద్రుళ్ళి కెడసెనే?’ |
38 |
| వ. | అనిన ధర్మనందనునకుఁ బురందరనందనుం డిట్లను; ‘నేను సంశప్తకులతోడఁ బెనంగుచుండ, ననేక రథ సమూహ సమేతుం డయి యశ్వత్థామ వచ్చి, నన్నుం బొదివిన. | 39 |
| క. |
ఏనూఱురథంబులు వెసఁ | బీనుఁగు పెంటలుగఁ జేసి పేర్చినఁ, గుపితుం డై నిప్పు లురలు కన్నుల | తో నక్కోదండగురుసుతుఁడు నామీఁదన్. |
40 |
| క. |
ఉఱక యడరి మెఱసిన యే | డ్తెఱ నెఱయఁగ గుడుసువడి, యతిస్ఫురిత రుచిన్ మెఱసి, ధను వనల వలయము | తెఱఁగునఁ జక్షుర్గతి ప్రతిహతిం జేసెన్. |
41 |
| క. |
స్వాతిగతుం డగు శుక్రుం | డేతెఱఁగునఁ బరఁగఁజేయు నెసకపు వర్షం, బాతెఱఁగున సాయక | వర్షాతిశయం బావహించె నతఁడు నరేంద్రా! |
42 |
| క. |
తన యరదం బెద్దెసఁ జూ | చిన మొగమున వ్రేల, దీప్తశిత విశిఖములన్ ననుఁ గృష్ణుం గప్పిన, నే | ననఘా!, కెల వరయఁజాల నైతి వెగడునన్. |
43 |
| క. |
పదపడి, యొకభంగి నతని | మద మడఁచినఁ దొలఁగఁ బాఱె మానము దూలం; దదనంతరంబ నిన్ను | న్వెదకితి నరనాథ!, మన యనీకములోనన్. |
44 |
| క. |
ఆలోఁ గర్ణునిచేతం | దూలని చతురంగములను దొరలను ధరణీ పాల! మనమొనలఁ గానను | వ్రాలిన దర్పమున మెఱయు వడముడిఁ దక్కన్. |
45 |
| క. |
ఆతనిచే నీ విక్కడ | కేతెంచుట వింటి; సేమ మెఱుఁగు తలఁపు మై నేతెంచితి; నవ్వీరుని | చేతులలా వస్మదీయ సేన నిలుపుటన్. |
46 |
| క. |
మనుజేంద్ర! కుశలి వగు నినుఁ | గని, నామన మూఱడిల్లెఁ గావున మగుడం జనియెదఁ, గొనియెద రాధా | తనయుని తల చలము నెఱయ దర్పము మెఱయన్. |
47 |
| క. |
ననుఁ జూడుము వేడుకకుం | జనుదెంచి భవద్బలంబు సంతస మందం దునిమెదఁ గర్ణుని దుర్యో | ధను కోర్కియు నీమనంబు తాపముఁ దీఱన్. |
48 |
| మ. |
ధనురాచార్యుని చావు సూచి, తగ రాధానందనుం డా సుయో ధనునిం దమ్ముల వారి సైన్యములనుం దాఁ గాచువాఁడై రణం బునకుం బూనుట, నింత సేయ వలదే? భూపాల! యేపారి మం డునె యాఱం గల దీప! మ ట్లతఁడు మండుం గాక! యే నార్చెదన్. |
49 |
| చ. |
నరవర! పంపు! మేను బ్రధనంబున కేఁగిన సూతసూనుఁ డు ద్ధురత నెదిర్చెనేనిఁ దల ద్రుంపక తక్కిన, విప్రుతోడ ని ప్పరుసున నిచ్చువాఁడ నని పల్కి పదంపడి యీక తక్కు దు ష్పురుషునిఁ జూచుమాడ్కి ననుఁ జూడుఁడు నీవును వాసుదేవుఁడున్. |
50 |
| వ. | భీమసేనునకు సేనాముఖంబునఁ దాన నిలుచుట భరం బయి యుండు; నేనునుం దడయుట గర్జంబు గాదు; పోయెద’ననిన విని, యమ్మనుజపతి గర్ణుండు గుశలియై యుండుట యెఱింగి, యతని బాణంబుల నొచ్చినవాఁ డగుట నలుక గదిరి యక్కిరీటితో నిట్లనియె: | 51 |