పురాణేతిహాసములు శ్రీమహాభారతము మహాప్రస్థానికపర్వము - ఏకాశ్వాసము
శ్రీరస్తు
శ్రీమదాంధ్ర మహాభారతము
మహాప్రస్థానికపర్వము - ఏకాశ్వాసము
క. శ్రీ పదసీమా వాప్తి స | మాపాదన కేళి కౌతుకాధీన దయా
వ్యాపార! సకలవేదో | హాపోహాతీతసార! హరిహరనాథా!
001
వ. దేవా! వైశంపాయనునకు జనమేజయుం డిట్లనియె ‘నట్లు కృష్ణుని పరమానందపదప్రాప్తియు, బలభద్రుని యనంతత్వసిద్ధియు, సకలయాదవ మౌసలాహవప్రకారంబును నెఱింగి పదంపడి పాండవు లెత్తెఱంగున వర్తించిరి మునీంద్రా! యెఱింగింపుము.’ 002
క. అని యడిగిన వైశంపా | యనుఁ డక్కురువంశవరు సమాదరణంబున్‌
వినయంబుఁ గౌతుకము పెం | పును సంభావించి యవ్విభున కిట్లనియెన్‌.
003
సీ. ‘అర్జునుం డమ్మెయి నచ్యుత రామాది | యాదవజనుల వృత్తాంతములును
దనదు తెఱంగు సత్యవతీతనూభవు | హితభాషణంబులు నేర్పడంగఁ
జెప్పిన విని యుధిష్ఠిరుఁడు ప్రస్థానంబు | నకు మది యొలయ నన్నరునితోడ
నఖిలభూతంబుల ననఘ! పాకంబుఁ బొం | దించుఁ గాలుండు మదీయబుద్ధి
 
తే. కర్మ సంత్యాగకలనంబు కార్య మిప్పు | డను వినిశ్చయ మొందె; నీ మనము నరయ
నిదియ మేలుగఁ గనుచున్కి విదిత మయ్యె | నాకు’ ననవుడు నయ్యింద్రనందనుండు.
004
వ. అ న్నరేంద్రున కి ట్లనియె. 005
క. ‘కాలము నే మన వచ్చును? | గాలముఁ గాలంబ పోలుఁగా కొంటికి నీ
లీలలు గలవే? లెస్సగ | నాలోకించి: తిది హితము నభిమతము నగున్‌.’
006
చ. అని తన మాట కియ్యకొను నన్నరుపల్కుల కిచ్చ మెచ్చి య
జ్జనపతి భీమునిం గవలఁ జయ్యనఁ బిల్వఁగఁ బంచి యత్తెఱం
గు నెఱి నెఱుంగఁ జెప్ప ననుకూలత వారలయందుఁ దద్ద గ
ల్గినఁ దెలి వగ్గలింప నెఱిఁగించె యుయుత్సున కవ్విశేషమున్‌.
007
క. ఎఱిఁగించి రాజ్యతంత్రము | తెఱఁగుపఱిచి నడపు వెరవు తేటపడంగాఁ
గఱపి, గృహాంతశ్చరితము | నెఱి నుపదేశించె నధిప! నెయ్యం బలరన్‌.
008
క. ఆ యనుజుని నట్లు మహా | నాయకుఁ గావించి భటజనముఁ గూర్చి మహీ
నాయకుఁ డార్యులు కీర్తన | సేయఁ బరీక్షితునిఁ రాజుఁ జేసె ధరణికిన్‌.
009
వ. ఇట్లభిమన్యు పుత్త్రునభిషిక్తుం జేసి యతనికిం బూజ్య సామ్రాజ్య పరిపాలన ప్రకారంబు లుపదేశించి కురుకుల పవిత్ర సముచిత చరిత్రభద్ర యగు సుభద్ర కిట్లనియె. 010
మ. భవదీయాత్మజు నాత్మజుండు కురుభూభారోద్వహుం డయ్యె యా
దవవంశోత్తరుఁడైన వజ్రునకు నింద్రప్రస్థ రాజ్యంబు గౌ
రవ దీప్తంబుగ నిచ్చినాఁడ సుచరిత్రా! రక్షణీయంబు లై
నవి యీ యిండులు రెండు నీవు దృఢధైర్యం బొప్ప రక్షింపుమా!
011
క. విను! శేషించిన యాదవ | జనులకు నా వజ్రనృపతి సంరక్షకుఁ డా
తనిఁ బోషించుట ధర్మం | బనఘా! యది లేమి ధర్మహాని యగుఁ జుమీ!’
012
క. అని తారు గృహంబు దొఱఁగి | చనునెడ నవ్వనిత పిఱుఁదఁ జనుదేకుండన్‌
జననాథ! యతఁడు నియమిం | చినవాఁడై యూఱడిల్లెఁ జిత్తములోనన్‌.
013
చ. పదపడి భారతాజి మృతబాంధవకోటికి మౌసలాజి ను
న్మదు లయి పడ్డ యాదవజనంబులకుం బరలోకసౌఖ్య సం
పద కయి చేసె నక్కురునృపాలవరిష్ఠుఁ డనేకదానముల్‌
రదని తురంగ గోకనక రత్నమయంబులుగా ముదంబునన్‌.
014
క. భూదానంబులునుం గ | న్యాదానంబులును జేసె నన్నరపతి వా
సోదానంబులు నత్యం | తాదరమున నాచరించి యరదము లిచ్చెన్‌.
015
తే. ఇట్లు ధౌమ్యాది విప్రులకెల్లఁ దృప్తి | యెసఁగ బహువస్తుకోటుల నొసఁగి కృపుని
ధనమునను బహుమానంబునను బ్రమోద | భరితుఁగాఁ జేసెఁ గురుపతి కురువరేణ్య!
016
వ. శేషించిన కాంచనరత్నాదు లా క్షితిపతి పరీక్షితునకుఁ బరమాదరంబున సమర్పించి యతనిం గృపాచార్యునకు శిష్యుంగా నప్పగించి పౌరజానపద ప్రవరజనంబుల రావించి. 017
సీ. ఆ పార్థపౌత్రునిఁ జూపి ‘మా యేవుర | మాఱుగా మీ రిక్కుమారవరునిఁ
గైకొని తగ నెల్లకార్య జాతంబును | నడపుచు ననురక్తి నాఁడునాఁటి
కెక్కు డగుచు నుండ నీతని యుల్లంబు | రంజిల్ల సమ్యగారాధనంబు
నందు సంప్రవణుల రగుఁడయ్య!’ యని పల్కి | తమ నిశ్చయంబు నుదాత్తభంగిఁ
 
తే. జెప్పుటయు వారు మొగములు చిన్నఁబోవ | ‘మము నుపేక్షించి యిటుసేఁత సముచితంబెన్‌?
నీదు చిత్తంబు కారుణ్య నిలయ; మేము | దరతరంబ యాశ్రితులము ధర్మశీల!’
018
వ. అని గద్గదకంఠు లగుచు నాడిన మాటలకు నమ్మనుజేంద్రుండు దగు తెఱంగున మఱుమాటలాడి తమ గమనంబులకుఁ దజ్జనంబుల నియ్యకొల్పె; నప్పు డందులోనం గొందఱ నివేశనంబు లధికాభిలాషంబున నొత్తి కొనుట కారణంబుగా వివాదంబు పుట్టిన సహదేవుండు ‘కలియుగంబు ప్రవేశించుటంజేసి కాదే యిట్టివి పుట్టెడు’ నని తలంచి నవ్వి నరనాథునకుం జెప్పిన, నప్పౌరవోత్తముండు నవ్వుచు ‘మన మనువులు సాలు’ నని పలికి సర్వాభరణంబులు నూడ్చి వల్కలాజినంబులు ధరియించినం, దమ్ములు ద్రౌపదియు నట్ల చేసి; రందఱుం దత్కాలోచితంబులగు నిష్ఠా విధానంబు లాచరించి, యగ్నుల నంబుగతంబులు సేసి, మొగం బులం దెలి వగ్గలింప గృహంబు వెలువడి; రప్పుడు ద్రౌపది షష్ఠత్వనిష్ఠం బోవ సప్తమం బై యొక్క సారమేయంబు వారల వెనుకఁ జనియె; నప్పుడు. 019
సీ. పౌరజనంబు లాబాలవృద్ధంబుగా | వచ్చి రక్కురువంశవరులఁ జూడఁ;
దత్సమయంబు జూదమునాఁడు వెడలి వా | రరిగెడు నయ్యవసరముఁ బోలె;
భటసమేతముగ నప్పాండుతనూజుల | తోన యుయుత్సుండు దాను నరిగె;
భవదీయ జనకుఁ డభ్యంతరసతు లెల్ల | ననుగమించిరి వారి మనుజనాథ!
 
తే. యిట్లు కరిపురి వెలువడి యేఁగె ధర్మ | తనయుఁ డందఱు నెంతయు దవ్వు గాఁగ
సొలయ కేఁగి రొకళ్ళనుఁ జూచి నిలువు | మనఁడు; తలవాంచి యా రాజు సనుచునుండె.
020
చ. తనువులు దూల నందఱుఁ బ్రదక్షిణముల్‌ వినుత ప్రణామముల్‌
వినయసమేతులై నడపి వీడ్కొని రా నృపతిం గ్రమక్రమం
బున; నిటు లుమ్మలంబు మనముల్‌ పొగిలింపఁగ వచ్చి చొచ్చి ర
జ్జనములునుం బరీక్షితుఁడు సామజపట్టణ మస్ఫురద్గతిన్‌.
021
వ. ఆ సమయంబున. 022
తే. జనకు కడకు నులూచి (పి) భుజంగలోక | మునకుఁ బోయెఁ; జిత్రాంగద తన తనూజు;
డైన బభ్రువాహనుపాలి కరిగెఁ దక్కుఁ | గలుగు సతు లెల్ల నీ తండ్రికడన నిలువ.
023
వ. అప్పుడు. 024
సీ. కృపుఁడు ధౌమ్యుండు నా నృపతినిఁ దగువారి | నర్హభాషణముల ననునయించి
యెలమి చిత్తంబులఁ దలకొల్పి పౌరులఁ | దగఁ జేర్చి పనుల నుత్సాహ మెసఁగ
వర్తింపఁ జేసిన వారణపురి పూర్వ | భంగి సంపత్పరిభరిత మయ్యె;
నట ధర్మజుండు ముందటఁ జనఁ గ్రమమున | ననుగమించిరి పవనాత్మజుండు
 
తే. నర్జునుండు నకులుఁడుఁ దదవరజుండు | ద్రౌపదియు నిట్లు సనుచుండఁ దగిలి వారి
వెనుక విడువక శునకంబుఁ జనియె; నవ్వి | ధమున వారు మహాపథగమనమునకు.
025
వ. పూని యుపవాసవ్రతపరులై భాగీరథిఙ పొంతకుం జని యంత నుండియుఁ బ్రాఙఙఙ్ముఖ వర్తనంబు గైకొని యోగబలంబున నరిగి గిరిసరిదరణ్యంబు లనేకంబులు గడచి పూర్వసముద్ర తీరంబు సేరి; రట్టియెడ. 026
క. దిక్కులు మేఘపథంబును | బిక్కటిలఁగ నవయవములు భీషణములుగా
నొక్కయెడ నగ్నిదేవుం | డక్కౌరవవంశవరుల యగ్రతలమునన్‌.
027
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - mahAprasthAnika parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )