పురాణేతిహాసములు శ్రీమహాభారతము మౌసలపర్వము - ఏకాశ్వాసము
యాదవు లందఱుఁ గృష్ణసహితులై సముద్రతీరమునకుఁ బోవుట (సం. 16-4-6)
సీ. సమకట్టికొనుచు భోజ్యములు భక్ష్యంబులు | నానావిధముల నొనర్చికొనుచు
క్షీరశర్కరలును ఘృతబహుభంగిక | వ్యంజనంబులు వివిధాన్నపాన
ములును నక్షత గంధములును బుష్పంబులు | గావించుకొని బలుగావళులును
దలమోపులును బండ్లుఁ దమతోడ నొప్పారి | చనుదేరఁ గరులు నశ్వములు నరద
 
తే. ములు నలంకార విరచనములు నుదాత్త | లలితరేఖంబు లగు మాల్యములును భూష
ణములు నాలేపనములు వస్త్రములు వింత | చెన్ను సేయఁ జేష్టలు విలసిల్లుచుండ.
029
క. తన రథము లేమి నొండొక | ఘనరథమును దారుకుండు గైకొని యెలమిన్‌
గొనిరా వెడవెడ గైసే | సిన కృష్ణుఁడు నిర్వికారచిత్తత వెడలెన్‌.
030
ఆ. తొడవు చీర పూఁత తొంటియట్టులు గాఁగ | నేమి వాహనంబు నెక్క కించు
కేని వికృతి లేని హృదయంబు మిత్ర సం | భాషణంబుఁ గలిగి బలుఁడు వెడలె.
031
క. ఆందోళికాది వాహన | సందోహంబున నితాంత చారుత్వము చె
న్నొందఁగ సమలంకృతలగు | సుందరు లేతేర విభవశోభిత భంగిన్‌.
032
చ. వెలువడి లీల నేఁగి మును వేడ్క నొనర్చిన మేటి చప్పరం
బుల నెలమిన్‌ మహార్ణవము పొంత వసించిన నుద్ధవుండు దా
నలఘుతపం బొనర్చుటకునై విపినంబున కేఁగువాఁడుగాఁ
బలికిన దాని కొండొకఁడు వల్కడ కృష్ణుఁడు కాలవేదితన్‌.
033
వ. అంత బలుండునుం బోవ నిశ్చయించి చెప్పిన. 034
చ. పలుకక మ్రొక్కి వీడుకొలుపంగ వనంబున కప్పురోహితుం
డలఘు వినిశ్చయంబు వగ పంతయు మాన్పఁగఁ బోయె నాతనిన్‌
హలధరుఁ డన్పఁ బోయి వినయంబున భక్తియుఁ దోఁప నయ్యనా
కులు నటఁబుచ్చి యొక్కెడ నకుంఠితనిర్ణయ శాంతచిత్తుఁడై.
035
క. ‘విను మొక్కఁడు నొక భూరుహ | మున మూలంబున నిరస్తమోహాంధత్వం
బున వెలుఁగు బుద్ధి విజ్ఞే | య నిరూఢతఁ జేసి యుండె నాసీనుండై.
036
చ. భూమిసురావళీమహిత భోజనతంత్రముఁ దీర్పఁ బూని హృ
ద్యామలరాజితంబులగు నట్లొనరించిన కూడుగూర లా
కోమలు లాఁగఁగా గడఁగి క్రోఁతుల కన్నియుఁ బంచివెట్టి రు
ద్దామవిహారలీల వసుధావర! యాదవు లేమి సెప్పుదున్‌?
037
చ. పదపడి గీత వాద్యగతిబంధురనృత్యము లుల్లసిల్లఁగా
నుదధికి నంచితాక్షత మహోత్తరగంధవిశిష్టపుష్ప సం
పదలు బహుప్రకారములఁ బ్రస్తుతి కెక్కఁగఁ బూజసేసి పెం
పొదవ నివేద్య మిచ్చిరి సముజ్జ్వలహృద్య పదార్థకోటులన్‌.
038
చ. విను తదనంతరంబ మదవిహ్వలభావము చేయఁ జాలి యిం
పొనరిన యాసవంబులు సముత్సుకతం గనకంపుఁ గోరలం
గొని హరి సన్నిధానమునఁ గ్రోలిరి యాదవు లంతరంగ మో
దనకరణంబులైన యుపదంశములం గొనుచున్‌ మహీశ్వరా!
039
తే. సాత్యకియుఁ గృతవర్మయుఁ జారుధేష్ణుఁ | డును గదుండును బ్రద్యుమ్నుఁడును మొదలుగఁ
గలుగు యాదవు లెల్లను గాంక్షఁ బాన | విధి యొనర్చిరి పెల్లున విధివశమున.
040
తే. వృష్ణి భోజాంధకులు కురువీర! యిట్లు | రేఁగి మద్యపానం బొనరించి మదముఁ
బొంది కేకిస లాడుచుఁ బొందుపడని | పలుకు లెసఁగంగఁ దిరిగి నవ్వులు సెలంగ.
041
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )