పురాణేతిహాసములు శ్రీమహాభారతము మౌసలపర్వము - ఏకాశ్వాసము
అర్జునుఁడు రామకృష్ణుల వెదకుచు వనంబునకుఁ బోవుట (సం. 16-8-31)
సీ. పదపడి యాదవ భామినీబాలక | వృద్ధజనంబు నా శుద్ధబుద్ధి
కలయంగఁ గనుఁగొని పలుకుల మార్దవ | మారఁ బురంబున కరుగఁ జెప్పి
రామకృష్ణులు తపోరతులై ప్రవర్తించు | వనభూమి యారసికొని తదీయ
సందర్శనమునకుఁ జనియెద నని వారి | నామంత్రితులఁ జేసి యేమి యనుచు
 
ఆ. టకును శోక మార్చుటకును దారుకుఁ డాది | యయిన తగిన వారి నర్హవచన
రచన మెఱయఁ బనిచి యుచితాప్తకతిపయ | జనులు దోడ రాఁగఁ జనియె నధిప!
155
క. చనిచని మనమున నిట్లను | ననుఁ బిలువఁగఁ బనిచి జనకునకుఁ గావలిగా
నునిచినవాఁ డయి నెమ్మదిఁ | జనిన హరికిఁ జావు సెప్పఁ జనియెద నకటా!
156
సీ. ఆ రాజు సచ్చుట నారాయణున కేల | సెప్పఁ? దపోనిష్ఠఁ జెందియున్న
యమ్మహాత్ముని హృదయమునకు మెరమెర | పుట్టింప నేటికిఁ? బోయి కాంచి
పంచినపని యాచరించెదఁ గాక స | వినయభక్తికముగ’ ననుచు మఱియు
వివిధ చింతారూపవిధులు చిత్తమ్మునఁ | బాఱ గాంధారిశాపంబు తెఱఁగుఁ
 
తే. దలఁచి ‘యయ్యవ్వ యతఁ డెగ్గతంపుఁ జోట | నరయ ది క్కెవ్వరును లేనియట్టి తెగుట
నొందఁగలవాఁడుగాఁ బల్క నొద్దనుండి | వింటి నకట! నిప్పును జెద లంటు నొక్కొ?’
157
క. అనుచుఁ బెనుఁగలఁక నొందిన | మనంబుతో వలయుదిక్కు మతి నరయక వే
చనుచుండె నొండు దెస; కే | మనఁగలదు? విధాతచేఁత కడ్డము గలదే!
158
క. విను మనుచరు లాతని మో | మునఁ దోఁచు విషాదభావముం గని వెగడొం
దిన కతన నట్లుగా ది | ట్లని చనియెడువంక సాలరై రెఱిఁగింపన్‌.
159
ఆ. అట్లు దిక్కు దప్పి యడవిలోపలఁ గొన్ని | దినము లిట్టునట్టుఁ దిరుగ నొక్క
బోయ చూచి ‘యెందుఁ బోయెద?’ రనవుడు | ‘హరి తపంబుసేయు నచటి’ కనిరి.
160
క. అన విని ‘యొకనాఁ డొక్కెడఁ | గనుఁగొంటిం గృష్ణుఁ జూపఁగా వచ్చెద నా
వన భూమి నాతఁ డింతకుఁ | జనునో నిలుచునొ యెఱుంగఁ జనుదెం’ డనుచున్‌.
161
తే. అక్కిరాతుండు సన వాని ననుగమించి | వెన్ను రుచిరదేహము పడియున్నచోటు
సేరి తెలియంగఁ జూచి మూర్ఛిల్లి పుడమిఁ | బడియెఁ గవ్వడి యనుచరు లడలు నొంద.
162
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )