| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | సభాపర్వము - ప్రథమాశ్వాసము |
| క. |
శతమఖుసభ శుభరత్నాం | చితకాంచనరచిత, మతివిచిత్రము, లోక త్రితయాఖిల లక్ష్మీ సం | శ్రిత; మలవియె దానిఁ బొగడ శేషున కయినన్. |
62 |
| వ. | అదియును నూఱుయోజనంబుల వెడల్పును, నూటయేఁబది యోజనంబుల నిడుపును, నేను యోజనంబుల తనర్పునుం గలిగి, వైహాయసంబయి, కామగమనంబయి, వ్యపేతశీతాతపంబయి, సకల కాల కుసుమ ఫలభరిత పాదపవన సంకీర్ణ సరోవర విరాజితంబయి, తపఃప్రభావంబున నమరేంద్రుచేత నిర్మితంబయి కరం బొప్పుచుండు; నట్టి సభయందు. | 63 |
| చ. |
అతుల విభూతితో మణిమయాభరణద్యుతు లొప్పఁగా శత క్రతుఁడు శచీసమేతుఁడయి కాంచన చారు విమానమాలికా గత దివిజోత్తముల్ గొలువఁగాఁ గొలువుండు వరాప్సరోంగనా యత విలసత్కటాక్ష కుసుమార్చిత సుందర వక్త్ర చంద్రుఁడై. |
64 |
| వ. | మఱియును. | 65 |
| సీ. |
వదలక యేలినవాని ప్రస్తవమునఁ | బోరిలో నీల్గిన వీరభటులుఁ, దమకుల ధర్మముల్ దప్పక సలిపిన | గృహమేధులును, జగన్మహితకీర్తిఁ బరఁగిన ధన్యులుఁ, బరహితవ్రతులైన | పురుషులు, రుగ్జరా మరణ శోక భయ బుభుక్షార్తి పిపాసా వ్యపేతులై | కొలుతురు సురరాజు నొలసి యర్థ |
|
| ఆ. |
ధర్మకామములు సదక్షిణ క్రతువులు | శ్రీ విలాసములు విశేషయజ్ఞ వాహమంత్ర తతులు వచ్చి సేవింతురు | మూర్తిమంతు లగుచు ముదముతోడ. |
66 |
| వ. | మఱియు శుక్రబృహస్పతులు నగ్నీషోములు నాశ్వినులు విశ్వదేవతలును ధాతయు విధాతయు హరిశ్చంద్రుం డను రాజర్షియు సురేంద్రసభ నుండుదురు. | 67 |