| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | సభాపర్వము - ద్వితీయాశ్వాసము |
| వ. | ఈయర్థం బితిహాసంబులయందు వినంబడుఁ; దొల్లి ప్రహ్లాదునికొడుకు విరోచనుండును నంగిరసుండను విప్రునికొడుకు సుధన్వుండును నొక్క కన్యా ప్రతిగ్రహ నిమిత్తంబున నెల్లసుగుణంబుల ‘నేన పెద్ద, నేన పెద్ద’ నని తమలో నిద్దఱును ప్రాణంబు లొడ్డుగా నొడ్డి వివాదంబు సేసి ప్రహ్లాదు పాలికిం జని; రందు సుధన్వుండు ప్రహ్లాదున కి ట్లనియె. | 239 |
| తే. |
నీవు ధర్మవిదుండవు మా వివాద | మెఱిఁగి తీర్పు గుణశ్రేష్ఠుఁ డితఁడొ నేనొ చెప్పు; మన్యథాబుద్ధివై చెప్పితేని | మఘవు కులిశంబు వ్రచ్చు నీ మస్తకంబు. |
240 |
| వ. | అనినం బ్రహ్లాదుండు భయంపడి కశ్యపుకడకుం జని విరోచన సుధన్వులు తన్ను వివాదనిర్ణయం బడిగిన విధంబును జెప్పిన విని వానికిం గశ్యపుం డి ట్లనియె. | 241 |
| తే. |
సాక్షియును ధర్మదర్శియు సాక్షిధర్మ | విధులు దప్పంగఁ జెప్పిన నధమవృత్తి వరుణపాశసహస్రంబు వానిఁ గట్టి | పాయు నేఁటేఁట నొక్కొకఁ డాయతముగ. |
242 |
| వ. | ‘ధర్మం బధర్మవిద్ధంబయి సభకు వచ్చిన దానిం దీర్పనిసభ్యు లధర్మవిద్ధు లగుదురు; మఱి సభ్యులు కామక్రోధంబులు విడిచి యధర్మంబు నాపనినాఁ డయ్యధర్మంబునం దొక్కపాదంబు సభ్యుల, నొక్కపాదంబు భూపతిఁ, దక్కినయది గర్తనుం బొందు; సమంజసులైన సభ్యులచేత విధ్యుక్తం బయ్యెనేని నధర్మంబు కర్తనుం బొందుఁ; గావున ధర్మంబు దప్పక చెప్పవలయు’ననినం బ్రహ్లాదుండు ధర్మమతియై విచారించి తనకొడుకుకంటె గుణశ్రేష్ఠుఁడుగా సుధన్వుం జెప్పినఁ, ‘బుత్త్రస్నేహంబు విడిచి ధర్మువు దప్పక చెప్పి’ తని ప్రహ్లాదుం బ్రశంసించి సుధన్వుం డరిగెఁ; గావున ‘మీరును ద్రౌపదీ ప్రశ్నంబునందు ధర్మబుద్ధిసేయుం’ డని విదురుండు పలికిన, దుర్యోధను భయంబున సభ్యు లెవ్వరుం బలుకరయిరి; ద్రౌపదియు నట్లు సకలక్షత్త్రియసమక్షంబున దుశ్శాసనుచేతం బరిభవింపంబడి దుఃఖిత యయి. | 243 |
| సీ. |
‘అవ్విధంబున నొప్పి యా స్వయంవరము నాఁ | డఖిల భూపతులచే నట్లు సూడఁ బడి, పాండవుల ధర్మపత్నినై, గోవిందు | చెలియలినై, వీనిచేత నిట్లు పరిభూత నగుచు సభామధ్యమున మహీ | పతులచేఁ జూడంగఁ బడితి; నింత వడుదునె? యిపుడు నా పలుకుల కెవ్వరుఁ | బ్రతివచనం బేల పలుక రైరి? |
|
| ఆ. |
ధన్యులార! యే నదాసినే? దాసినే? | యెఱుఁగఁ జెప్పి పనుపుఁ’ డెల్ల దాని ననుచు వనరుచున్న నాపగాసుతుఁడు శాం | తనవుఁ డిట్టు లనియె దానిఁ జూచి. |
244 |
| వ. | ‘అవ్వా! నీ ప్రశ్నంబునకు నుత్తరం బయ్యుధిష్ఠిరుఁడు సెప్పవలయుఁ; గానినాఁడు ధర్మసూక్ష్మత యెవ్వరికి నెఱుంగ గహనంబు; దీని ఫలంబు వేగంబ యిక్కురుకులపాంసను లనుభవింతు’ రని పలుకుచున్న యవసరంబున నక్కోమలిం జూచి నగుచు. | 245 |
| తే. |
‘తరుణి! యేవురకంటె నొక్కరుఁడ భర్త | యగుట లగ్గు; జూదంబున నాలి నోటు వడని వానిఁగాఁ దగు భర్తఁ బడయు మింక’ | ననుచు రాధేయుఁ డుల్లసమాడె నంత. |
246 |
| ఉ. |
అమ్ముదితన్ విభీతహరిణాక్షిఁ గలాపవిభాసికేశభా రమ్మున నొప్పు దానిఁ దన రమ్యపృథూరుతలంబు నెక్కఁగా రమ్మని సన్న సేసె ధృతరాష్ట్రసుతాగ్రజుఁ డప్డు; దాని దూ రమ్మునఁ జూచి కౌరవకురంగమృగేంద్రుఁడు భీముఁ డల్కతోన్. |
247 |
| క. |
లయసమయదండధర ని | ర్దయుఁడై ధరణీశు లెల్లఁ దనపలుకులు వి స్మయసంభ్రమభయసంభృతు | లయి వినుచుండంగ నిట్టు లనియెన్ సభలోన్. |
248 |
| ఉ. |
ధారుణి రాజ్య సంపద మదంబునఁ గోమలిఁ గృష్ణఁ జూచి రం భోరు నిజోరుదేశమున నుండఁగఁ బిల్చిన యిద్దురాత్ము దు ర్వార మదీయ బాహుపరివర్తిత చండ గదాభిఘాత భ గ్నోరుతరోరుఁ జేయుదు సుయోధను నుగ్రరణాంతరంబునన్. |
249 |
| వ. | అని సర్వజన భయానక క్రోధావేశ వివశుండయి యాయుధంబు లున్న వలనికి దృష్టులు సలుపుచు నగ్రజు మొగంబు సూచుచున్న భీమసేను నతిరౌద్రాకారంబు సూచి భీష్మ విదుర ద్రోణాదు‘లిది కోపంబున కవసరంబు గా’దని యాతనిం బ్రశాంతచిత్తుం జేసి రంత. | 250 |
| క. |
ధృతరాష్ట్రు నగ్నిహోత్రా | యతనంబున నఱచె వఱళు, లగ్నులు శాంత ద్యుతులయ్యెఁ, గౌరవ స్త్రీ | తతిహృదయము లధికశోకతప్తము లయ్యెన్. |
251 |
| క. |
క్రూరాత్మకులై దుష్పద | వీ రతులగు ధార్తరాష్ట్రవీరుల శయ్యా గారముల నెగసె నెంతయు | ఘోరంబుగఁ గాక ఘూక ఘూత్కారంబుల్. |
252 |
| క. |
అట్టి మహోత్పాతంబులు | పుట్టినఁ గృప విదుర కలశభూ శాంతనవుల్ ‘నెట్టన ధృతరాష్ట్రజులకుఁ | బుట్టె నరిష్ట’ మని రిష్టమునఁ దమలోనన్. |
253 |
| వ. | అంత నంతయు నెఱింగి గాంధారి విదురుం దోడ్కొని ధృతరాష్ట్రు కడకుంబోయి పాండవపరాజయంబును ద్రౌపదిపరిభవంబును దుర్నిమిత్తోత్పత్తియుం జెప్పిన విని, ధృతరాష్ట్రుండు దుర్యోధనుం బిలిచి యి ట్లనియె. | 254 |
| చ. |
పరమపతివ్రతన్ సభఁ దపస్వినిఁ బాండవధర్మపత్ని ధ ర్మరత నయోనిజం బ్రకృతిమానవభామినిఁగాఁ దలంచి దె ప్పరములు వల్కఁగాఁ దగునె? బాల్యము నాదిగ దుష్టభావనం బెరిఁగితి నీ నిమిత్తమునఁ బెద్దయు దుఃఖితు లైరి పాండవుల్. |
255 |
| వ. | ‘వారలవలన నీ దురాగ్రహం బుడుగు’మని కొడుకును భంగించి సకలబాంధవహితంబు సేయందలంచి ద్రౌపదిని రావించి శాంతవచనంబుల నిట్లనియె. | 256 |