| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | సౌప్తికపర్వము - ప్రథమాశ్వాసము |
| క. |
శ్రీమ త్కౌస్తుభ రత్నో | ద్దామారణ రశ్మి భూతి ధవళ మరీచి స్తోమ పరభాగ రమ్య మ | హా మహిత స్ఫురిత వక్ష! హరిహరనాథా! |
1 |
| వ. | దేవా! వైశంపాయనుండు జనమేజయున కి ట్లనియె. | 2 |
| తే. |
సంజయునిచేత గురుసుతోత్సాహ మట్లు | వినిన ధృతరాష్ట్రుఁ డిట్లను; ‘వీరవర్యుఁ డనఁగఁజాలు నశ్వత్థామయును, సహాయ | రథికులును విక్రమించిన క్రమము సె పుమ!’ |
3 |
| వ. | అనుటయు నమ్మానవపతి కా సూతసేనుం డి ట్లను; ‘నవ్విధంబునఁ గురుపతి యశ్వత్థామ కభిషేకంబు సేయిం చిన నా కృపాచార్యుండును గృతవర్మయు గురుపుత్రు నుత్సాహంబున కుపోద్బలకం బగు నుద్యోగంబునం బొదలి; రమ్మువ్వురు మహీపాలుండు పాండవులం బరిమార్చుటకుం బనిచిన నట్లు పూని దక్షిణంబు ముట్టి పడమట నున్న పాండవ శిబిరంబున కభిముఖు లై చని; రత్తెఱంగున నన్వీటి కెలని కనతి దూరంబుగాఁ జని యా రథికవరు లాలించి. | 4 |
| వ. |
అందలి వార లెల్లను జయంబునఁ బొంగుచుఁ బేరెలుంగు లం దంద చెలంగఁగాఁ బలుక నార్వఁగ నొత్తిలి నవ్వ నాకసం బందినయట్టి మ్రోఁత విని యక్కడ వోవఁగ నుల్కి రప్డు ద మ్ముం దడవన్ వడిన్ వెడలు మూఁకలు మ్రోయుటగాఁ దలంచుచున్. |
5 |
| వ. | ఉలికి యట వోవు టుడిగి యెచ్చటి కేనియుం దొలంగి నిలిచి మఱి కర్జంబుఁ జూచికొనువారై యా రథికవరులు మగిడి తూర్పుదెస కొంతదవ్వరిగి’రనిన నమ్మాటలు వెడవెడ వినుచుం దనకుం బాటిల్లిన దురవస్థ చింతించుచు నాంబికేయుం డి ట్లనియె. | 6 |
| సీ. |
‘సంజయ! కురురాజు సమయునే యిట్లు భీమునిచేత? బలశౌర్యముల నజయ్యుఁ డని నమ్మియుండితిఁ; దనయులు నూర్వురు మడియుట నినియు నా మనము పెక్కు పఱియలై పోవనిభంగిఁ జూడఁగ ఱాత నొనరించినదిగాఁగ నోపు. నింక నడియరితనమున నప్పాండవుల నాశ్రయింపఁగఁజాల; నే నెక్కడేనిఁ |
|
| ఆ. |
బోదుఁ గాక; యట్టి భూపాలు తండ్రినై, | ప్రాభవమునఁ బేర్చి పరమ దైన్య వృత్తి కోర్వఁదగునె? విన వశమే మాట | లా మరుత్తనూజుఁ డాడ నాకు? |
7 |
| వ. | అని పలికి ‘యశ్వత్థామ ప్రభృతు లేమిసేసి?’ రనుటయు నజ్జనపతికి సంజయుం డిట్లనియె. | 8 |
| క. |
ఇమ్మెయి నా రథికవరులు | గ్రమ్మఱి చని యడవి సొచ్చి కని రొక మడు; వం దిమ్ముల సూతజనులు ర | థ్యమ్ముల నీళ్ళకును దిగువ నప్పుడు దారున్. |
9 |
| వ. | రథంబులు డిగ్గి యంబుపానంబు నేసి యామ్రోఁతదెస నాలించుచుండిరి. | 10 |
| తే. |
అంతఁ బశ్చిమ ధరణీధరాగ్ర పశ్చి | మంబునకుఁ బోయె మార్తాండమండలంబు; సాంధ్యసమయ కృత్యంబులు సలిపి రపుడు | రథికవర్యులు మువ్వురు రాజముఖ్యు! |
11 |
| వ. | సలిపి నా రొక్క వటవిటపి సమీపంబున నాసీను లై; రా సమయంబున. | 12 |
| తే. |
వారిముఖమండలములతో వారిజములు | మొగిడె; శోకతమంబుతో నిగిడెఁ దిమిర పటలి; బహు విచారములతోఁ బరఁగఁ బొల్చె | భూత బేతాళ గణములు భూపవర్య! |
13 |
| క. |
కలుగు గురుసుతున కెట్లుం | బని చూడ నమరగణ మధికకుతూ హలమున వచ్చెనొ యనఁ జు | క్కలు దోఁచెన్ గగనవీథిఁ గౌరవనాథా!. |
14 |
| వ. | ఇట్లు రాత్రి యగుట దివాచరంబు లైన జంతువు లుపశాంత వర్తనంబు లయ్యె; రాత్రించరంబు లైనవి సంచ రింపం దొడంగె; నప్పుడమ్మువ్వురు నెవ్వగలఁ గూరిన మనంబులతోఁ గురుబలం బకారణంబ పొలియుట యుగ్గడించి తత్సంబంధకలితంబులైన భాషణంబులు సెల్లుచుండనుండి డప్పి గూరి కొండొకసేపునకు మహీ తలంబున మేనులు వైచి వందురుచుండి; రందుఁ గృపకృతవర్ములు నిద్రవొందిరి; గురునందనుండు క్రోధా తిశయంబునం జేసి నిదురవోవక వటవిటపంబు గలయం గనుంగొనువాఁడు తదీయశాఖోపశాఖల నానా కాకంబులు నిలీనంబులై నిద్రించుచుండ నాలోకించె; నయ్యవసరంబున. | 15 |
| సీ. |
మిడుఁగుఱుగములు గ్రమ్మినయట్లు నిగిడెడు రోచులు గల మిడిగ్రుడ్లుదనర మెఱుఁగారు కెంజాయ మెఱసిన యెఱకల మోపున నెసఁగు పెన్ మ్రోఁతతోడఁ గాకుల భీషణాకారత వేళ్ళతో లీలమై నెగసిన శైలమనఁగఁ; గర ముగ్రమగు మొగ మిరుదెస మురియించి యామిషంబుల యిక్క లరసికొనుచు; |
|
| తే. |
నచటి బయలెల్లఁ దానయై యక్కజంపుఁ | జందమును, ఘోరమైన నిస్వనముఁ, జండ గతియు భూతవితానభీకరముగా ను | లూక మొక్కటి వచ్చె భూలోకనాథ! |
16 |