పురాణేతిహాసములు శ్రీమహాభారతము సౌప్తికపర్వము - ప్రథమాశ్వాసము
అశ్వత్థామ కృపాచార్య కృతవర్మలతోఁ దనపూన్కి స్థిరీకరించుట (సం. 10-3-1)
సీ. వెరవిట్టి తెఱ; గిది వెంగలితనమని, | యెల్లవాఁడును దన యెఱిఁగినట్టి
తెఱఁగున నిజకార్య దృష్టియ కయికొను | నొరుల నేర్పులు పట్టనొల్లఁ; దాత్మ
బుద్ధియ మే లని పొగడు; నన్యుల చిత్త | వృత్తుల నిందించు; వివిధగతులఁ
జెందెడు నాత్మీయ చేతః ప్రవర్తన | మరయఁడు; దాన బాల్యమున దలఁచు
 
ఆ. తలఁపు గీడుచేసి, యెలప్రాయమున నొండు | తలఁపునందుఁ బట్టుకొలుపుఁ బ్రీతి;
ముదిమి వచ్చినతఱి నదియును విడిచి య | న్యంబు లైన నేర్పు లాచరించు.
45
క. ఆపదఁ బడి యొక్కఁడు స | ద్వాపారము గాఁగఁ జూచి దాని నడవు; శ్రీ
ప్రాపించిన నరుఁ డొండొక | చూపున వర్తించు నది విశుద్ధపదముగన్‌.
46
క. తగునని మరణాదులకై | తెగువదెసన్‌ మానవుండు దృఢనిశ్చయతం
దగిలినయది పరమహితం | బుగ వదలక నడుపు నన్యబుద్ధులు గొనమిన్‌.
47
వ. ‘మీ రెఱుంగనియది లేదు. నాకుం దోఁచిన కర్జంబు మన కందఱకును శోకనాశంబగునట్టిది, దాని వినుండు చెప్పెదఁ బ్రజాపతి ప్రజల సృజించి విప్రునకు దమంబును, క్షత్రియునకుఁ దేజంబును, వైశ్యునకు దక్షత్వంబును, శూద్రునకుఁ ద్రివర్ణానుకూలతయు వలయు గుణంబులుగా విధించెం గావున శాంతుండు గాని విప్రుండును, దేజస్విగాని రాజును, దక్షుండుగాని వైశ్యుండును, ద్రివర్ణానుకూలుండుగాని శూద్రుండును నిందం బడుదు; రదియట్లుండె; నేనును విప్రకులంబునందు జన పూజితం బైన వంశంబునందు జనియించిభాగ్యహీనతవలన రాజోచిత ధర్మం బనుష్ఠించితి, నడుమ నా నిష్ఠ వదలి విప్రదర్శంబు మహనీయంబైన, నది యాచరించు వాడనగుట నా మదికిం జూడమేలై యుండ దదియుంగాక. 48
తే. ‘మేటి విల్లును దివ్యాస్త్ర కోటియును ధ | రించి మెఱయంగ నాజి వధించెఁ దండ్రి
నొకఁడు; వాఁడును రూపుతో నుండు నట్టె | యెట్లు తలయెత్తి మెలఁగుదు నేను జెపుఁడ?’
49
క. వాఁడు మొదలుగాఁ బగతుర | వాఁడి గలుగు తూపుగముల వలన మెఱసి యే
నేఁడు వధింతును; నెవ్వగ | వేఁడిమిఁ బడఁజాల కొక్క వెరవుఁ దలఁచితిన్‌.
50
క. లే దింకం బగ యని ధను | రాదుల దెస వాహనముల యందును సంత్య
క్తాదరులై పగతురు నేఁ | డాదమఱచి నిద్రవోదు; రని తఱి పాడునన్‌.
51
ఆ. ఓడిపోయి దప్పినూని గట్టును చెట్టుఁ | జేరి యొదిఁగి యున్నవారిఁ గాఁగ
మనలఁ దలఁతు రరులు; మనముల నావంత | శంకలేదు; సంతసంబు ఘనము.
52
చ. మదమునఁ దేలి యేనుఱిన మార్తుర దాడిగఁ బోయి బెట్టు ము
ట్టెద; శరజాల సత్వర పటిష్ఠతఁ బల్వురఁ ద్రుంతుఁ; గొందఱం
జదువుదు నుల్లసత్వరిఘసంహననంబునఁ; గొన్ని కంఠముల్‌
చిరుముదు నేల రక్తపరిషిక్తముగాఁ గరవాల ధారలన్‌.
53
తే. గెలుపు నూఱట నొదవు నగ్గలపు నిద్రఁ | బీనుఁగులుఁ బోలె నున్న యా బిరుదుమగలఁ
జంపి పీనుంగుఁబెంట గావింపవలయు | శిబిర మెల్లను భూతముల్‌ సెలఁగుచుండ.
54
వ. అని వెండియు. 55
క. కరి హయ నర శవముల భ | ర్న రథంబుల నెరసి ద్రుపదనందనగాత్రో
త్కరము పడియుండఁ జూడక | పరిభవతాపోవశాంతి వడయఁగ నగునే?
56
శా. ధృష్టద్యుమ్నుని ముట్టి పట్టుదు; మరోద్రేకం బడంగింతు; ను
త్కృష్టాస్త్రంబులఁ జంప; నల్క పశుభంగిం జంపినం గాని పో;
దిష్టావాప్తి యనంగ నా కిదియె కాదే యిప్డు? కౌంతేయులన్‌
గష్టస్వైరవిధాభియోగమృతులం గావింతు నుగ్రాకృతిన్‌.
57
క. అలిగిన పినాకి చందం | బలవడ శిబిరంబుఁ జొచ్చి యందఱఁ బగఱం
బొలియించెద; శుద్ధుఁడఁ గా వలదే జనకునకు నాదు వల నేర్పడఁగన్‌?
58
క. పాండవులం | బాంచాలురఁ | జండ భుజా విభవ మెసఁగ సమయించి కృతా
ర్థుండ నయి పెంపుఁ దేజము | గండును; దక్కొండు లేదు కార్యము దలఁపన్‌.
59
వ. అనవుడుఁ గృపాచార్యుం డి ట్లనియె. 60
సీ. పఱిచిన వారికిఁ బగమాఱు పఱుపంగ | నుత్సహించుట కడు నొప్పగాదె?
దైవయోగంబునఁ దగిన యుద్యోగంబు | నీ మానసంబున నెలవుకొనియె;
మాకు నీ పూన్కి సమ్మత; మేము దీనికి | నీ తోడివారము; నీవు డస్సి
యున్నవాఁడవు నిద్రయును లేకయున్నది; | నెడఁగురు పడియె దీ యడవిలోన
 
ఆ. నెమ్మి డప్పిదేఱ నిద్రించి వేగినఁ | దెలివితోడ నత్యుదీర్ణవృత్తిఁ
గరఁగి యేము దోడ నడతేర నడరిన, | నరిగణంబు గెలుతు వశ్రమమున.
61
మ. వరదివ్యాస్త్రవిదుండు బాహుఘనుఁ డశ్వత్థామ పైఁ బోన, ను
ద్ధురలీలం గృతవర్మయుం గృవుఁడు నుద్యోగస్ఫురన్మూర్తులై
వెరవుం జేనయుఁ జూపి తో నడవ, దోర్వీర్యోద్ధతిన్‌ మార్కొనన్‌
నరయోధావళి గాదు దేవతతికి న్రా దెమ్మెయిం జూడఁగన్‌.
62
వ. అని మఱియును. 63
చ. ‘విను కృతవర్మ దివ్యశరవేది బలాఢ్యుడు శౌర్యశాలి, యే
మను సమరోద్యమంబునకు నూల్కొనఁజాలుట నీ వెఱుంగు, ‘ది
ట్లని గణతింపరాదు గురునట్టిఁడ యీతఁ’ డనంగవచ్చు ని
న్ననఘచరిత్ర! యిట్టి రథికావలి వైరుల నెట్లుఁ జేయదే!’
64
వ. ‘కావునఁ గోదండంబుఁ నెక్కుడించి, కంకటం బూడ్చి, నిద్రింపు మేము నిద్రాగమనంబున జడులమై యున్న వారము; ప్రభాతం బగుటయు నెల్లవారలకు నుల్లంబు దెలివొందు; నప్పుడు గడంగి యోధులం బొదినిపేరు వాడి పాలియింతము; మనము పాంచాల సహితంబుగాఁ బాండవులం దెగటార్చుటయొండె, వారి చేతం దెగుట యొండె నయ్యెడుం గాక, రిత్త మరలుదుమే?’ యనిన మామకు నశ్వత్థామ యిట్లనియె. 65
తే. ‘అలుక యెత్తినవానికి, నర్థచింత | కునకు, నాతురునకుఁ, గామ గోచరాత్ము
నికిని వచ్చునే, విను నిద్ర? నీవు నెఱుఁగు | దెఱిఁగియుండి యి ట్లేడిటికి నేఁప నన్ను?’
66
క. ఎన్నఁబడి జనులెఱిఁగిన | యిన్నాలుగు తెఱఁగులందు నెయ్యదియైనన్‌
గన్ను మొగుడ నీదటె నా | కిన్నియుఁ గలుగంగ నిద్రయేటికి వచ్చున్‌?
67
చ. ‘గురుదెసవంత నాతురతఁ గూరెద, వైరిఁ దలంచి కోప సం
భరితుఁడ నయ్యెదన్‌, సమర భంగి నిరూపణచింత నొందెదం,
గురుపతికిం బ్రియం బెసఁగఁ గోరుట నుత్తలపాటు సెందెదం
బురుషనరేణ్య! యే నిదురవోవఁగ నెమ్మెయి నేర్తుఁ జెప్పుమా.’
68
శా. ‘సారాచారనిరూధుఁ డైన ధనురాచార్యున్‌ వధింపంగఁ గ
న్నారం జూచితి నీవుఁ; దత్పరిభవం బట్లుండె; భగ్నోరుఁడై
రారా జెంతయు దీనవృత్తిఁ జెవులారం బల్కఁగా విన్న యే
నీ రే యూరక నిద్రవోదునటె! యిట్లే లంటి, వీరోత్తమా?
69
ఆ. ‘మనము వినఁగ రాజు పనవిన భంగి కే | క్రూరచిత్తుఁడైన గుందకున్నె?
కరుణ లేకయున్న పురుషున కేనిఁ గ | న్నీరు దొరుఁగకుండునే, మహాత్మ?’
70
చ. అతఁడు మదీయ సఖ్యవరుఁ, డక్కట! యేఁ గసుగందకుండ నా
క్షితిపతి యిమ్మెయిం బరులచేతఁ బరాభవ మొందె; దానిఁ జూ
చితి; మును లోకు లవ్విభుని చేటును, బాండుతనూజకోటి యు
న్నతియును జెప్పవింటి; నది నా మది సూడెఁడు; నిద్రవచ్చునే?
71
వ. అదియునుం గాక. 72
ఉ. కవ్వడియున్‌ ముకుందుఁడును గావలిగా భయమేదియున్న వీ
డెవ్వరికైన ముట్టుకొని యే నని పేర్చి జయింపవచ్చునే?
యెన్విధి నైననుం బగఱ యే పడఁగించుట పౌరుషంబ; యే
నొవ్వక గెల్తు రాత్రిమెయి నూల్కొని తాఁకితినేని మాతురా!
73
ఆ. ఇట్లు నిశ్చయించి యెసకంపుఁ గడఁకతో | నున్నవాఁడ; నిట్టి నన్ను మాన్ప
రామి యెఱుఁగ కంటి; రారాజు మన్నన | వమ్ము చేసి మరలవచ్చు నెట్లు?
74
క. సమయింతుం బొదివి సౌప్తిక | సమయంబున నెల్లభంగిఁ జతురంగసమే
తముగాఁగఁ బాండునృపసుత | సముదయమును ద్రుపదభూపసంతానంబున్‌.
75
వ. సమయించి మఱి విశ్రమించియు నిద్రించియు సుఖించెద; నీవు నిద్ర పేరు సెప్పి యుద్యోగంబు మాన్పి మర ల్పఁ జూచెద; విది తగ వగునే?’ యనిన గురునందనునకు గౌతముం డిట్లనియె: 76
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )