| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | సౌప్తికపర్వము - ప్రథమాశ్వాసము |
| క. |
గురుసుతుఁడు క్రోధమయమగు | బరవసమున నప్పు డా ద్రుపదనందను మే నిరువఱియ గాఁగ నేసెను | శిరము నుదగ్రతఁ గృపాణశిక్ష మెఱయఁగన్. |
192 |
| వ. | ఇవ్విధంబున దొరలు దెగినను బాంచాల ప్రభద్రక మత్స్యసైన్య శేషంబులు వోక పెనంగిన నతండు మాతంగ వితాన విదళనం బప్పుడు సలిపిన కంఠీరవంబు తనమీఁద హరిణకులంబు గవిసిన నెట్టిదగు నట్టివాఁడగుచుఁ బేర్చి యార్చె; నత్తెఱంగు తుములంబునఁ బొడగానమిఁ బాండునందనులు కృష్ణసాత్యకులును నా శిబిరమున లేకయునికి యెఱింగె; నప్పుడు గనుంగొను జనంబులకు నితం డశ్వత్థామ యనుబుద్ధి వొడమె; నది యెట్టనినఁ గురుపాండవులు భండనంబుఁ జేయందొడంగినయది మొదలుగా రాత్రులచ్చటి జనులు నీలతనువును, రక్తాస్యనయనయు, రక్తాంబరధరయు, రక్తమాల్యానులేపనయు నగు లేమ యొక్కతి దమవీటివారు నిద్రపోవుచుండఁ దలలు వీడ మేనులు వికృతంబులై వ్రేలం బాశంబులఁ గరితురగ సహితంబుగా బంధించి ఘోరసంరంభంబునం దెచ్చి తెచ్చి యశ్వత్థామ యగ్రభాగంబునం బెట్ట నుగ్ర భావంబున నతండు దునుముచు నార్చు చునికిఁ గలలు గాంతు; రట్లగుటం జేసి నిద్రాసక్తులం జంపుటయు నవ్విధంబునార్పును నేర్పడ ననుసంధించి యక్కలల ఫలంబు గాకేమి యని తలంచి చొచ్చి పోటునకు నయ్యరాతి రాత్రిమై వచ్చుట నిశ్చయించి యశ్వత్థామగా నెఱింగి; రవ్వీరుండు మెఱుంగు మెఱచినట్లు వివిధగతులఁ జరించినం జెండాడినం జూచియు నీడంబోక రణక్రీడ సల్పిన, నబ్బలుమగండు సముద్దండ బాహుదండవిలాసుండై. | 193 |
| మహాస్రగ్ధర |
తలలన్ హస్తమ్ములం బాదములఁ దనువులం దత్ప్రదేశంబు గప్పుం; దొలఁగించున్ వానిఁ గ్రొన్నెత్తురు వఱపి, హయస్తోమదంతిప్రతానం బుల మేదోమాంస ఖండంబుల దనుజమహాభోజనం బావహించు, న్మలఁగం బాఱుం, జెలంగు, న్నలి నెసఁగు, జయోన్మత్తుఁడై మానవేంద్రా! |
194 |
| తే. |
అట్లు విహరించి హతశేషులైన జనులు | పాఱఁ గనుఁగొని రథమెక్కి పటురయమున వారి వెనుకొని మెఱుఁగు వాలారు తూపు | గములు వరఁగించి యందఱ సమయఁజూచి. |
195 |
| క. |
‘ఆ కలన నట్లు సేసి మ | హాకుల జనతతులు గాఁగ నన్యస్థలులున్ భీకరరథగతుల నుద | గ్రాకృతియై మెఱసి యమ్ము లడరింపంగన్. |
196 |
| వ. | ఇ ట్లెసఁగు బహుళకోలాహలంబున హయంబులు నిభంబులుఁగట్లు దెంచుకొని కలయంబాఱెఁ; బాఱుటయు గోడిగలకై దంతపాతకలహంబులం గెరలుగుండ్లక్రందునను, నొండొంటి మదగంధంబులు సహింపక మార్కొని పోరాడు సామజంబుల సమ్మర్దంబునను, గాళ్ళు దునిసియుఁ, జేతులు నలసియు, నురంబు లవిసియు, వెన్నులు విఱిగియుఁ, బ్రక్కలు నొగిలియుఁ, దలలు పగిలియుఁ, జాఁపకట్టువడి చదిసియుఁ, గ్రంతలనిఱకటంపుఁ జోట్ల మానవకోట్లు పీనుంగు తిట్టలగుచుండఁ బలకయు వాలునుం గొని యవ్వాలుమగండు వేడుకం దేరుడిగ్గి యగ్గజంబులను ఘోటకంబులను బొదివి పాటవాటోపం బొప్పవిపాటన వినోదంబు సలిపె; నప్పుడు గొందఱు నెఱయ మేల్కనని భ్రమను, భయంబునను బాదంబులు గుదివడఁబాఱలేక నెలవెడలిన యెలుంగుల నస్తవ్యస్తపుమాటలాడఁ, గొందఱు జనకసహోదరాదులగు బంధువులఁ బేరుపేరం బిలుచుచుం దిరిగి కనుదిరిగి తమవారు గానివారల చెట్టలు వట్టుకొని చనఁ, గొందఱు కైదువులు గొని కదిసి నిదురకన్నులం బొదువు చెలులను జుట్టంబులను బగఱ యని సమయింపఁ, గొందఱెదురుగాఁ జనుదెంచినవా ‘రిదియేమి?’ యని యడుగ, ‘నశ్వత్థామసొచ్చిపొడుచుచున్నవాఁ’డనిన, ‘వాసుదేవార్జునులు శిబిరంబున లేమి నప్పాపాత్ముక కిట్లు సేయవచ్చెంగాక వారున్నఁదన్ను గాసిసేయరే?’ యని పలుకఁ, గొందఱు ‘బీభత్సుం డిట్టి పరాక్రమంబు సేసినం జూచి మనంబున రోయకుండునే? యతండెన్నఁ డేనియు వాహన వికలుఁడైనవానిని, చేత నాయుధంబులు లేని వానిని, దలవీడిన వానిని, వెఱచినవానిని, వెఱఁగుపడినవానిని, నిద్రించువానిని నొంచునే?’ యని యర్జును నగ్గింప, నయ్యందఱ నగ్గురునందనుండు గురుతరంబయిన కురురాజు పరిభవంబు నప్పటప్పటికిఁ దలంపఁ బెంపారు దారుణ క్రూరత్వంబునఁ గోలుమసంగి, యించుక యరవాయిఁగొనక, చెండియుం, ద్రుంచియుం, జించియుఁ, దుంగమడుఁగుఁ జొచ్చిన మాతంగంబు పగిది బడలువడం జేసె; నా సమయంబున. | 197 |
| సీ. |
ఆ యోధవరు బారి కగ్గంబు గాక ద | వ్వుల భీతిఁ దలల చీరలును వీడఁ బాదంబులట దొట్రువడఁ బాఱి కొందఱు | మానవాధీశులు సైనికులును విడిదల వాకిట వెడలుచోఁ గృప కృత | వర్మలఁగని వఱువట్లు వట్టు పెదవులు దడుపుచు ‘సదయతఁ గావరే’ | యనుచు మ్రొక్కఁగ నమ్మహాత్ము లపుడు |
|
| తే. |
రాక్షసావేశ సంభృత క్రౌర్యులగుట | నధిప! యాత్మీయ మానుషహాని దలఁప లేక వారలఁ బొదివి యనేకభల్ల | దారితులఁ జేసి రందఱఁ దరతరంబ. |
198 |
| క. |
ధరణి నెఱిదప్ప నొఱగిన | కరిహయనరచయము లొఱలఁగాఁ గరుణము భూ వర! యొరసె శిబిరమునఁ దన | కరయఁగఁ జేరుగడ లేమి నది వృథ యయ్యెన్. |
199 |
| వ. | అట్టియెడ. | 200 |
| మహాస్రగ్ధర |
దనుజవ్రాతంబు కాంతాతతియును బ్రజలుం దారు; నానా విధోగ్ర ధ్వను లాకాశావకీర్ణత్వ మహిమఁ బొరయం, దంష్ట్ర లత్యంత ఘోర త్వనిరూఢిం బొంద నార్చుం; దఱచుగ నగు; నుత్తారసల్లాపముల్ సే యు; నలిం గ్రందారఁ బైపై నురవడిఁ గవియున్ హుంకృతాభీలభంగిన్. |
201 |
| వ. | ఇవ్విధంబున వివిధ వికారాననంబులు బహుళ భంగిక కరపాదంబులు గలుగు నపరిమిత క్రవ్యాదులు గవిసి మేదో మాంస మస్తిష్క మజ్జంబు లానుచుం జవియైన వానిం బుత్ర మిత్ర కళత్రాదుల కొసంగుచు నన్యకోటి బెరసిన యెడఁ ద్రోద్రోపు లాడి యవియుఁ గైకొనుచుం గీలాల పానంబున మత్తిల్లి నృత్యంబులు సేయుచు మఱియు ననేకప్రకారంబుల విహారంబు సలుపుచు నుల్లసిల్లిరి. పదంపడి యఱపీనుఁగు లొఱలుటయును దానవగణంబు కలకలంబును డిందువడియె నప్పుడు జగంబులు గొని కాలిన కాలాగ్నియుం బోలెఁ బాండవ శిబిరంబు నిరవశేషంబుగా సమయించి శమియించి చాపాచార్య నందనుండు మే నెత్తుట జొత్తిల్లి మోహాంధ్యంబుతోఁ గలసి యునికింజేసి సాంద్రతర రక్తసిక్తంబు లైన బాహుఖడ్గంబు లేక ద్రవ్యంబు చందంబు నొంద మరలి తాను బ్రవేశించు తఱి నెట్లుండె నట్ల నిశ్శబ్దం బైన యవ్విడిదల వెడలు చుండఁ దెలతెలవేగె; నిట్లు ప్రతిన నెఱపి కృపకృతవర్మల పాలికిం జనుదెంచి వారలతో నిట్లనియె. | 202 |