పురాణేతిహాసములు శ్రీమహాభారతము స్త్రీపర్వము - ప్రథమాశ్వాసము
కృపాచార్యుఁడు గాంధారి నూరార్చిన ప్రకారము (సం. 11-10-5)
తే. తనుజ శోకార్తయైన గాంధారిఁ జూచి | యడలు తనదు చిత్తంబున నతిశయిల్ల
నలఁతఁ దేర్పంగఁ దలఁచి తానల్లఁ జేరి | యమ్మహాదేవి తోడ నిట్లనియెఁ గృపుఁడు.
107
మణిమాలా వృత్తము ‘భవదీయ సూను లరి సైన్య పఙఙ్త్కి ఁగొని కాల్చిరెల్లఁ బొగడన్‌
వివిధాస్త్ర శస్త్రమయ సాంద్రవృష్టిఁ దెగటాఱి పెంపు మిగులన్‌
దివి కేఁగి యందు మహనీయ తేజ మెసఁగంగ హృద్యబలభి
ద్ధ్రువ సౌఖ్యసంపదలు గాంచి సంతోషమునఁ దేలి రేల వగవన్‌?
108
స్వాగత వృత్తము అందొకండును రణావని భీతిం | బొంద కేటులను బోటుల డప్పిం
బొందియైనఁ బొలివోవఁడ దానం | బొంది రూర్ధ్వగతిఁ బుణ్యచరిత్రా!
109
వనమయూర వృత్తము పోర నొడ లస్త్రపరిపూతముగ ధీరో | దారతఁ బిఱిందికిఁ బదం బిడక దృప్య
ద్వైరితతి నొంచి తెగువారగుట మేలు | ర్వీరమణకోటి కని వేదములు సెప్పున్‌.
110
క. దానాద్యుత్తమ కర్మ వి | ధానంబులఁ బడయు గతు లుదాత్త రణమునం
జా నేర్చువాని చనియెడు | మానితగతిఁ బోల వండ్రు మహనీయాత్ముల్‌.
111
వ. కావునం గురుకుమారుల మరణంబు సంభావనీయం బది దా నట్లుండెఁ బాండుకుమారులు గెలిచితి మని సంతసింపలే దది యెట్లనిన. 112
నర్కుట వృత్తము వినుము మరుత్తనూభవుఁడు విశ్రుతధర్మగతిం
జనక కురుక్షితీశ్వరునిఁ జంపె గదాసమరం
బున నది యే మెఱింగి చనిపోయిన రేయి గడుం
గనలున ముట్టి మువ్వురముఁ గ్రౌర్య ముదగ్రముగన్‌.
113
వ. పాండవ శిబిరంబున. 114
బంధుర వృత్తము సకల రథములను నఖిల గజములున్‌ సర్వహయంబులతో బెరయన్‌
శకలములుగ భటనికర మఖిలముం జావఁగ ద్రౌపదిపుత్రులలో
నొకఁడును బ్రదుకక పొడిపొడియుఁగ నయ్యుర్వికి వారలమామల మ
స్తకములు కడమవడక వడి బలిగా సంతసమందఁ బిశాచాతతుల్‌.
115
వ. సమరంబు సేసితి మట్లగుట నప్పాండవుల విజయంబు వితథంబయ్యె నిటయేము సేయం దలంచిన దాని నెఱింగించెద నాకర్ణింపు మే మట్టి సమయంబున వార లాశిబిరంబున లేమింజేసి యాభంగి పరాక్రమం బాచరింప నోపితిమి గాని యమ్మహాబలుల మార్కొన శక్తులముగా మవ్వీరులట్లు దమ తనయులు మా తెగువం దెగటాఱుట విని శోక క్రోధాక్రాంతంబులగు నంతరంగంబులతో మమ్ము వెనుకొనుట దప్పదు. వారల బారికిం దప్పిపోవలయుం బోయెద మది తలం పనుజ్ఞయిమ్ము నీవు నుమ్మలింపకుండు ‘మని పలికి ధృతరాష్ట్రు నుద్దేశించి ‘దేవా! ధర్మపుత్రాదుల బారింబడక తొలంగుట భీతులగు మాకుం గర్తవ్యంబై యున్నయది మీ చేత ననుజ్ఞాతులమ నీ వింక దైవకృతం బలంఘనీయంబగుటఁ దలంచి వగ పుడుగు’ మని యచ్చట నా కృప కృతవర్మాశ్వత్థామ లారాజునకు నద్దేవికిం బ్రదక్షిణంబుగా వచ్చి మరలి మరలి వారలం జూచుచుఁ దేరు లెక్కి భయంబున రయంబున నరదంబులు దోలుకొని గంగాతీరంబున కరిగి యచ్చట నన్యోన్యామంత్రణంబు సేసి పాసి రందుఁ గృపాచార్యుఁడు గరిపురి కేతెంచెఁ, గృతవర్మ నిజపురంబునకుఁ జనియె. నశ్వత్థామ కృష్ణద్వైపాయనాశ్రమంబు నాశ్రయించి గ్రక్కునం దపస్వియయ్యఁ, దదనంతరంబ ధర్మజభీమార్జునులు దాడిమై వచ్చి యతని ముట్టుకొని రావృత్తాంతంబంతయు నీ విన్నయదియ తరువాతి కథ సెప్పెద విను మవ్విధంబునఁ గృపప్రముఖ రథికులు మువ్వురుం దన్ను విడిచి చనిన నాంబికేయుండు గ్రొత్తయైన నెవ్వగ పెల్లునఁ జిత్తంబు విషాద వేదనాయత్తం బగుచుండ నెడనెడ నిలుచుచుఁ జనుచుండె నక్కడ నయ్యజాతశత్రుండు గురునందను శిరోరత్నంబు దెచ్చి యిచ్చి యట్లు పాంచాలి నూరార్చియున్నంత నట వోయిన జనంబుల వలన వైచిత్రవీర్యుండు పొలికలనికి వచ్చుచున్నవాఁడని విని తదభిగ మనోన్ముఖుండై. 116
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )