పురాణేతిహాసములు శ్రీమహాభారతము స్త్రీపర్వము - ద్వితీయాశ్వాసము
గాంధారి దుర్యోధనుని కళేబరంబు చూచి పలవించుట (సం. 11-17-1)
వ. ఇట్లు మూర్ఛిల్లి కొండొక సేపునకుం దెలిసి గాంధారి పరిచారిక లూఁదికొని పోవ నప్పుత్ర శవంబుకడకుఁ బోయి. 26
తరలము విపుల వక్షముమీఁద నశ్రులు వెల్లిగొల్పుచు వ్రాలి ‘యో
నృపతికుంజర! కౌరవేశ్వర! నేలనిమ్మెయి నీ యుదా
త్తపు శరీరముఁ బొందఁ బాడియె? తల్లి వచ్చిన భక్తితో
నుపచరింపక లాఁతివై యిటులూరకుండుట యుక్తమే?’
27
వ. అని మఱియు ననేక ప్రకారంబులం బలవించుచు హాహాకారంబు లెసంగ రోదనంబు చేసి యా సుబలనందన తన సమీపంబునకుఁ జనుదెంచియున్న యుపేంద్రున కిట్లనియె. 28
మంగళమహాశ్రీ ఈతఁడు రణంబునకు నెత్తి చనుచుండియును నెంతయును భక్తిఁ గని నాకుం
బ్రీతియెసఁగం బలికి బ్రేమ మొలయం బొగడి పెద్దయు వినీతినిరతుండై
చేతులు మొగిడ్చి జయ సిద్ధియుఁగ దీవన విశిష్టదయ నిమ్మనిన ధర్మం
బే తల ననూనమగు నిద్ధజయ మా తలకు నెట్లయిన సిద్ధమగు నంటిన్‌.
29
వ. ఇట్లన నేల? యంటేని. 30
మానినీవృత్తము జూదమునప్పుడు సర్వజనంబులు చూచి భయంపడి యిప్పని యి
మ్మేదిని సేనలకుం గురుకోటికి మృత్యువు గాని నిజం బలఁతిం
బోదని యాడరె? యమ్మెయి నాదగు బుద్ధికిఁ దోఁచిన సత్యము దా
మోదర! పాటిలదే కొడుకంచుఁ బ్రియోక్తులు వల్కినఁ బెంపు సెడున్‌.
31
వ. వినుము దీవనకుం జొరక మధ్యస్థపుమాట లాడుటయకాదు మఱి నే నప్పు డతని తోడ. 32
తే. ‘ఆహవంబునయందు నీ వోహటించి | పోవ సడివచ్చు సడి కంటెఁ జావుమేలు;
శస్త్రజీవితఁ బరలోకసౌఖ్య మనుభ | నింపు మమరత్వసంపద వెలయు మంటి.’
33
క. అని చెప్పియుంటి; నా చె | ప్పిన యట్టులు సేసి యితఁడు పేరును బెంపుం
గనియుండఁగ ని ట్లడలున | మునుఁగు టరయఁ గడుపుశోకమున పెంపు సుమీ!
34
ఆ. అరి విమర్ది యితనికై వగపేటికిఁ | బుణ్య లోకమునకుఁ బోయెననుచు
నుండ నోపెనేని నుల్లంబు ధృతరాష్ట్రు | దిక్కులేమిఁ దలఁచి పొక్కకున్నె?’
35
వ. అని వెండియు. 36
సరసిజ వృత్తము ‘శ్రీరమ్యత్వం బారఁగఁ బెం పూర్జితముగ మణివిరచితమకుటములం
దారుం జూడన్‌ సారవిభూతిన్‌ ధరణిపు లనిమిషధవనిభు లగుచున్‌
భూరిప్రీతిన్‌ సూరెలఁ గొల్వన్‌ భువనవినుతమగు పొలుపు వెలయ ము
న్నీ రా జుండున్‌ దారుణ దైవం బిటు వఱచునె తుది నితని? కటకటా!
37
తే. కనకబహురత్నమయ పీఠమున మృగాక్షు | లాలవట్టంబు లిడఁ జెలు వమరునట్టి
కౌరవేంద్రుండు పెనునేలఁ గంకపక్ష | పవన హతుఁడయ్యెఁ జూచితె? పద్మనాభ!
38
క. ఈ రాజు భీమసేను ను | దారోగ్ర పరాక్రమమున ధరణి నొఱగి దు
ర్వారమదవారణము కం | ఠీరవము విహారమునఁ బడిన గతిఁ బొలిచెన్‌.
39
క. విదురుఁడుఁ దండ్రియుఁ దనకుం | బదివేలవిధములఁ జెప్పఁ బాటింపఁడు దు
ర్మదమునఁ దగియెడు బుద్ధులు | విధి మూఁడిన మర్త్యుఁ డేల విను నుచితోక్తుల్‌?
40
క. పదునొకఁ డక్షౌహిణు లే | పొదవఁగ నలిఁ గొలువ నొప్పు నుర్వీశ్వరుఁడే
తుది నిష్పరివారుండై | గదఁ జేకొని యొంటి పోరి కలనిం బడియెన్‌.
41
తే. ధరణి గజఘోటకము లొప్ప ధార్తరాష్ట్రు | లెల్లఁ బొలుపారఁగాఁగంటి నిప్పు డవి వి
నాశ మొందినఁ బాడఱి నలిననాభ | యది పరాధీనముగఁ జూచునట్టి దయ్యె.’
42
వ. అని దుర్యోధనవల్లభ నిరీక్షించి మాధవు నుద్దేశించి యిట్లనియె. 43
ఆ. ‘కొడుకు చావుకంటెఁ గోడలి యడలునఁ | బెరిఁగి శోకవహ్ని దరికొనంగ
నంతరంగ మిప్పు డగ్గల మెరియంగఁ | దొడఁగె దీనికేది తుది? యుపేంద్ర!
44
సీ. చూడు మిమ్ముద్దియ సుతుఁజూచి వదన మ | ల్లార్చుచుఁ బ్రాణేశునాననంబు
పైఁ జూడ్కి యడరించి పాణితలంబున | నందంద నెమ్ముగ మడిచికొనుచు
మరలఁ బుత్రునిదెస కరిగిన మనసు పే | రడలున మునుఁగంగ నతని చెన్ను
మోమునఁ దనమోము మోపి మూర్ఛల్లుచుఁ | దెలిసి వల్లభునురఃస్థలము గ్రుమ్ము
 
తే. నుడుకుఁ గన్నీరఁ దడియంగ నొఱగుచును వి | చేష్టయై యూరకుండుచుఁ జెలులతోడఁ
దిరిగి పొగులంగ వేనలి విరియ మేన | నవులఁ దిరుగుచునున్నది యక్కటకట!
45
వ. అని వెండియు. 46
సీ. ఈ సుమధ్యమ యిమ్మహీశ్వరు బాహు త | లంబున లలితోపలాలనంబు
నొంది రాగిల్లెడునుల్లంబుతో నుండు | నింకిట నిమ్ముగ్ధ నెట్లు సూడ
వచ్చుఁ? గనుంగొన వశముగాదిది యిట్టి | కొడుకును మనుమండుఁ బుడమి నిట్లు
పడియుండఁ జూచెడు పాపజాతికి నిప్పు | డవియక నిగ్గడియైన యినుప
 
తే. గుండియకుఁ జేటుపాటింకఁ బుండరీక | నయన! యెన్నఁడు లేమి నిర్ణయముగాదె?
యింత కోర్చెడు నట్టివా రెన్నఁడేని | నుర్వి నెందేని గలుగుదురొక్కొ యొరులు?
47
క. జననియు భార్యయు నేమై | న నేమి? వేదములు బొంకునకుఁ జొరమి నిజం
బని పుణ్యలోక మగునని | తన కార్యము సూచె నిట్లు తగునె యితనికిన్‌?’
48
వ. అని యనేక భంగుల విలాపంబు సేసి తక్కటితనయుల దెస నాలోకించి విష్ణుదేవునితో నిట్లనియె. 49
భాస్కర విలసిత వృత్తము కౌరవనృపతి తనూజశతంబుం గంటె? పవనసుతు పటుభుజలీలా
ఘోరతఁ దడఁబడ మేదినిమీఁదఁగూలె వికటముఖకరచరణత్వం
బేరికయినఁ గనుఁగొన్న విషాదం బెంతయు మది నొలయఁగఁ బ్రియకాంతల్‌
చేరి విలపనము దద్దయు నార్తిం జేయఁగ నునికి వనట తిరిఁ బెట్టన్‌.
50
తే. చందనార్ధ్రకుట్టిమములఁ జరణతలము | లొందుటకు నేవగించు నయ్యువిదలిపుడు
నెత్తురుల ఠేవ మెక్కిన నేలఁ బొరలు | చున్న వారేమి సెప్పుదు? నుడుకుపేర్మి.
51
క. బాలలుఁ దరుణులు బ్రౌఢలుఁ | దూలెడు వికలాంగకములతో డెందములన్‌
వాలిన విరహానలముల | పాలై వందురెద రొక్కభంగిన యకటా!
52
క. బలదర్ప ధైర్యశౌర్యో | జ్జ్వలులగు ధృతరాష్ట్రసుతుల సతులకు ని ట్లా
కులతమెయి వనటపెల్లునఁ | దలరవలసె దిక్కుమాలి దైవముచెయిదిన్‌.
53
క. నిజభూషణాతపత్ర | ధ్వజకంకటఖండవేష్టితములైన కురు
వ్రజగాత్రశకలములు వా | రిజనాభ! కనుంగొనంగ రెట్టించె వగల్‌.
54
క. జననియుఁ దండ్రియుఁ దొలు బా | మునఁ జేసిన పాపకర్మమునఁగాక సుయో
ధనుఁడు మొదలయిన నూర్వుర | ననఘుఁడు ధర్మజుఁడు నామ మడఁపగఁదగునే.
55
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )