పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము
దుర్యోధనుండు శల్యసహాయంబు గోరుట (సం. 5-8-6)
తే. ఇంతయును విని కౌరవాధీశ్వరుండు | దక్షులగు నాప్తజనములఁ దత్‌క్షణంబ
మద్రనాథుని చనియెడు మార్గమునకుఁ | బుచ్చి యెడనెడ నతుల విభూతి మెఱయ.
92
సీ. అరుదారు మేలుక ట్లాయితం బై చూడ | నొప్పారి తను పగు చప్పరములుఁ,
బరపైన చెలువంబు గరగరికయుఁ దియ్య | తెలి నీరుఁ గలిగిన దీర్ఘికలును;
బొడవైన మువ్వంచఁ బొలుచునట్లుగ నేనుఁ | గులకు గుఱ్ఱములకుఁ గొట్టములును,
ముందర బయలైన చందంబుఁ జతురాభి | మతమైన యాస్థానమండపములు
 
ఆ. బియ్యములును, నేయుఁ, బెరుఁగును, గూరఁగా | యలును, వంటకట్టియలును, గడ్డి,
కవణములును బెల్లుగా నొడఁగూర్చి ని | గూఢవృత్తిఁ దానుఁ గూడ నడచె.
93
వ. ఇవ్విధంబున విడిదల పయనంపు సంపదలు వొంపిరివోవం దనకు సమకట్టిన సమస్త వస్తువుల యవైకల్యంబునకు శల్యుండు సంతుష్టాంతరంగుండై నిజపరిజనంబులం జూచి ‘యిట్లు చతురంబుగా మనకు వలయువాని సంపాదించుటకుఁ బ్రవర్తకులైన యుధిష్ఠిరామాత్యు లెవ్వారు? వారలం దోడ్కొని రండు; వారలు ప్రసాదదానంబున కర్హు’లని పలుకు నవసరంబున, నటమున్న పలుదెఱంగులఁ బనులు సేయుచున్న తన పల్లాయనంబువారిలోఁ గలసి మఱువడియున్న కౌరవేశ్వరుం డమ్మాటలు విని, యతనికిం బొడసూప నిదియ సమయంబని సముచిత ప్రకారంబునఁ దన్నెఱింగించికొని వినయంబునఁ గనిన, నతండును సంభ్రమంబున గాఢాలింగనంబు సేసి కనకాసనంబున నునిచి, ‘యింతయు నిమ్మహాత్ము నుద్యోగంబున నయ్యెం గావలయు’ నని తలంచి విస్మయంబంది ‘నీ కెయ్యది యిష్టంబు గోరు మిచ్చెద’ ననిన, గాంధారీ నందనుండు పరమానందంబునం బొంది యిట్లనియె. 94
క. ‘సత్యసరస్వతి వగు; మౌ | చిత్య విశారదము నీదు చిత్తము; నియమౌ
దాత్త్యంబు మెఱయ నాకు న | మాత్యుఁడవై పూని నడపు మత్సైన్యంబున్‌.
95
ఆ. తలఁపఁ బాండవులును ధార్తరాష్ట్రులు నీకు | నొక్క రూప; భక్తియుక్తిఁ జాల
నీవు నన్ను మాననీయుండు గాఁగ న | నుగ్రహించి తగఁ బరిగ్రహింపు.’
96
చ. అనవుడు శల్యుఁ డియ్యకొని, ‘యట్టిద కాదె, విభేదవృత్తి నా
మనమున లేదు; పాండవసమాజము మీరును నొక్కరూప కా
వున నిది లెస్సమాట దగవుం దలపోయఁగ; మున్ను ప్రీతిఁ గాం
చిన నిను నెమ్మిఁ గూడుటయ చేయుదు నిట్టుల యెల్లభంగులన్‌.
97
ఉ. దానఁ గొఱంత లే; దభిమతం బిది గాకయుఁ గల్గెనేనియుం
బూని యొనర్తు’ నన్నఁ, గురుపుంగవుఁ డెంతయుఁ బొంగి ‘నీవు స
మ్మానము సేసి నా కిటు లమాత్యుఁడవైన పదంబుకంటె మే
లై నుతికెక్కు కోర్కి యెటు లారసి చూచిన నొండు గల్గునే?’
98
వ. అనిన విని, వికచవదనుం డగుచు మద్రేశ్వరుండు. 99
క. ‘చను నీవు హస్తి నగరం | బున; కేనును బాండుభూపపుత్త్రులఁ బ్రీతిం
గని యట వత్తు; నవశ్యం | బును వారలఁ జూడవలయుఁ, బోయెద’ ననినన్‌.
100
ఆ. ‘అట్లకాక; వేగ మట వోయి మరలుండు; | వరము మఱవకుండవలయు ! మిమ్ముఁ
జేరి నెగడువాఁడఁ; గారుణ్యమున నిట | యరసి యుండుఁ’డనియెఁ గురువిభుండు.
101
వ. అనవుడు. 102
క. దరహాసముతో మద్రే | శ్వరుఁ డాలింగనము సేసి, ‘సందియపడ కీ
వరుగు’ మని యనుప, నాతఁడు | కరిపురికిం జనియె మది వికాసముఁ బొందన్‌.
103
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - udyOga parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )