| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము |
| క. |
‘మీ యయ్య, మీరు వనవా | సాయాసము నిస్తరించి యభ్యుదయమునన్ డాయుట విని ముదితాత్ముం | డై యిట పుత్తెంచె నన్ను’ ననుమీ మొదలన్. |
260 |
| వ. | అని చెప్పి, చుట్ల నున్న వారలతో నిట్లనియె. | 261 |
| క. |
‘దుర్యోధనుండు కార్యా | కార్యజ్ఞుఁడు గామి నిట్టి కలఁక గలిగెఁ గా కార్యులు దృఢధైర్యులు రణ | ధుర్యులు నగు పాండుసుతులు దోషాన్వితులే? |
262 |
| క. |
క్షీరోదకవృత్తి మనము | వారలునుం గలిసి బ్రదుకవలదే నెమ్మిన్? వా రిడుమలఁ బడఁ దగియెడు | వారే? పితృభాగ మేలువారలు గారే? |
263 |
| ఆ. |
మనల నింక నమ్మ రనృతాత్ము లన్యాయ | పరులు గర్వు లనుచుఁ బాండుసుతులు; గూడి మనుట కియ్యకొన నేర; రైనను | ధర్మజుండు గలఁడు దగవు నడప,’ |
264 |
| వ. | అని పలికి వెండియు. | 265 |
| మ. |
‘మన కీ కుండఁగ వచ్చునే? మనము దుర్మానంబు వాటించి యొ ప్పని కార్యంబులు వట్టి వారికిఁ దగం బాలీక గర్వంబు లా డిన, నిక్కంబగు నల్క నర్జునుఁడు గాండీవంబు మోపెట్టఁ గృ ష్ణుని సారథ్యము నై జగత్త్రితయ సంక్షోభంబు గా కుండునే? |
266 |
| తే. |
అలఘు గదఁ బూంచికొని భీముఁ డతిరయమునఁ | గురుకుమారులపైఁ దీవ్రకోప మెసఁగఁ గవియు టాత్మ భావించినఁ గంప మడరు; | నిక్క మెవ్వరు మార్కొని నిలుచువారు? |
267 |
| సీ. |
కవ లగ్రజన్ముల కంటె నేమిటఁ గీడు? | ద్రుపదుఁ డల్పుండె? తత్సుతులు బాహు గర్వ సమగ్రులు గారె? విరాటుండు | నాతని తమ్ములు, నాత్మజులును నసదులే? సాత్యకి యలఁతులఁ బోయెడు | వాఁడె? వృష్ణి కుమారవరు లనేకు లట్టి యోధులు పోర నరవాయిఁ గొందురే? | పాండ్యుండుఁ, గేకయపతులు నాది |
|
| తే. |
యైన బంధులు, మిత్త్రులు నగ్గలికలఁ | గొఱఁత వడియెడు వారె? యందఱను గెల్వ నోపినను రుద్రునకు నైన నోర్వరాని | ధర్మపుత్త్రు కోపమునకుఁ దలఁకవలదె?’ |
268 |
| వ. | అని పలికి సంజయుదిక్కు మొగంబై యెల్లవారును విన నిట్లనియె. | 269 |
| తే. |
నీవు ధర్మజుపాలికి నెమ్మి నరుగు; | మతఁడు పేరోలగం బున్న యవసరమునఁ గాన్పు; మతనికి ననుజవర్గంబునకును | బంధులకు నింపు పుట్టంగఁ బలుకు మచట. |
270 |
| క. |
నెయ్యము వాటించి, కడుం | దియ్య మెసఁగ, నలుక లెల్లఁ దీఱునటులుగాఁ గయ్య మను తలఁపు లోనుగ | నయ్యమనందనుఁడు మానునట్టి తెఱఁగునన్. |
271 |