పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఉద్యోగపర్వము - ద్వితీయాశ్వాసము
ఉద్యోగపర్వము - ద్వితీయాశ్వాసము
క. శ్రీ విస్తారకరణ కరు | ణావేశోదార ! శశ్వదమలాకారా!
భావ వికార విదూర! శు | భావహ నామప్రకార! హరిహరనాథా!
1
వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె; ‘నివ్విధంబున వీడ్కొని సూతనందనుండు పవనజవంబు లగు నరదంబు తురంగంబులం దఱిమి ప్రొద్దుగ్రుంకునంతకుం గరిపురి సొచ్చి నగరి కరిగి యంతఃపురంబున నున్న ధృతరాష్ట్రునకుం దనరాక యెఱింగించి పుచ్చి యతనిం గాంచి యడుగుల కెఱఁగిన, నమ్మహీవరుండును నత్యాదరంబున నెత్తి సమీపంబున నునిచినం గొలిచియుండి చేతులు మోడ్చి యిట్లనియె; 2
ఉ. ‘దేవర పంపఁగాఁ జని యుధిష్ఠిరునిం గని వచ్చినాఁడ; నా
భూవిభుఁ డప్రమేయ గుణపూజ్యుఁడు మీకు నమస్కరించె; సం
భావనసేసె నా; కిచటి బంధుల నెల్లఁ దలంచె; మీ సుఖ
శ్రీ విభవంబులున్‌, సుతుల సేమము నన్నడిగెం బ్రసన్నుఁడై.’
3
తే. అనుడు ధృతరాష్ట్రుఁ డిట్లను ‘నయ్యజాత | శత్రునకు సేమమే? యనుజన్ము లెల్ల
సుఖులె? బంధులు, భృత్యులు, సఖులు, మంత్రి | వరులు సంప్రీతిమెయి నున్నవారె యచట?’
4
వ. అనిన సంజయుం డిట్లనియె; 5
క. ‘వారెల్లను భవదీయ | స్ఫారబలము గారణముగ సౌఖ్యంబున ను
న్నారమని పలుకుదురు; నిజ | మారయఁగా నట్ల కాదె యది, జననాథా!
6
క. ధర్మజునకు భోగంబులు | ధర్మువున ట్లింపు గావు; ధర్మంబులలో
నిర్మల బుద్ధి నహింసకుఁ | గూర్మి గడుం గలఁ డతండు, కురువంశనిధీ!
7
ఉ. మానుషశక్తి యొల్లఁడు; సమంచిత దైవమ యూఁదియుండు; నీ
పైన యతండు పుణ్యమును బాపముఁ బెట్టినవాఁడు; నీవు నీ
సూనువశంబ కాని యొకచొప్పుఁ దలంపవు; కర్ణ సౌబలా
ధీనము కార్యనిశ్చయము; తెల్లము నీ మత మొప్ప దేమియున్‌.
8
ఆ. ఆలు బిడ్డ లేని యట్టి త్రిమ్మరి యగు | కొయ్య గాక, కుదుటఁ గూడు వెట్టి
కుడుచువార లిట్టి క్రొవ్విదంబులు సేయఁ | జొచ్చు టిచ్చగించి చూతురయ్య?
9
చ. కొడుకులఁ గానరే నృపు లకుంఠితతేజుల నెందు? నిమ్మెయిం
జెడు తెరు వైనచోఁ దగవు సెప్పక యొప్పరికించి చూతురే?
పుడమి జనంబులెల్ల నినుఁ బ్రువ్వఁగఁ దిట్టఁగ వించు నున్కి నొ
చ్చెడు మది యెప్పుడుం, జెవులు చీములు గట్టెడుఁ గౌరవేశ్వరా!
10
చ. చలమున దుస్ససేనుఁడును సౌబలుఁడున్‌ మిముఁ బట్టి యార్ప బొ
మ్మల క్రియ నాడుచుండుదురు మానక నీవు సుయోధనుండుఁ; దా
రలసి యొకప్డు పాండుసుతు లాగ్రహవృత్తికిఁ జొచ్చిరేని నీ
చలము బలంబునుం గులముఁ జక్కఁగఁ జేయరె యొక్క వ్రేల్మిడిన్‌?
11
క. వినుము యుధిష్ఠిరు సైరణ | మనవారలు వెఱపుగా సమర్థింతురు; డీ
కొనఁగం దగరే కొండం | గని యోటమి వెట్టినట్లు, కౌరవనాథా!
12
క. అనుజులకు నడ్డపడి యే | మిని జేయఁగ నీమిఁ జూచి మెచ్చితిగా కీ
వును; సాదు రేఁగె నేని | న్విను, తలపొలమునన కాని నిలువదు సుమ్మీ!
13
చ. అనయము వుట్టె జూదమున యప్పుడ; యెంతయుఁ జిచ్చువెట్టి కా
ల్చినయది నీ యుపేక్షయ; వశీకృతచిత్తుఁడు ధర్మసూతి మె
త్తని పులి; యెల్లవారలు నధర్మము నీపయిఁ బెట్టునంతకు
న్వినఁడును గానఁడుం, బిదప నీకును నాకు మరల్పవచ్చునే?
14
చ. అనయము నొచ్చుచున్నయవి యంగము లెల్లను వేగ వచ్చుట;
న్మనము వశంబు గాదు; జననాయక! ప్రొద్దును బోయె; నిప్పు డేఁ
బనివిని రేపు పుత్త్రులును, బంధులు, నాప్తులు, నీవు నేర్పడన్‌
విన మన కార్యమంతయు సవిస్తరతం దగ విన్నవించెదన్‌.’
15
ఆ. అనిన, ‘నట్ల కాక’ యని సంజయుని వీడు | కొలిపి, కొంత ప్రొద్దు కురువిభుండు
కార్యచింత మునిఁగి, కంచుకి నొక్కరుఁ | బిలిచి, వేగ విదురుఁ బిలువు మనియె.
16
వ. వాఁడును సత్వరంబుగాఁ జని యతనిం దోడ్తెచ్చి కాన్పించిన, నమ్మహీవరుం డత్యాదరంబున విదురుం దనయొద్ద నునిచికొని యతని కి ట్లనియె: 17
ఆ. ‘పాండురాజసుతుల పాలికిఁ చని యిప్డు | సంజయుండు వచ్చి, సమ్ముఖమున
నన్నుఁ జాల దూఱి, నాకు రే పచ్చటి | పనులు సెప్పువాఁడ ననుచుఁ జనియె.
18
క. అప్పటినుండియు నెవ్వగ | గప్పికొనినఁ జిత్తవృత్తి గలఁగెడు; మేనున్‌
నిప్పులఁ బొరలినయ ట్లయి | చొప్పడ దించుకయు నిద్ర శుద్ధవిచారా!’
19
వ. అనిన, విదురుం డిట్లనియె : 20
క. ‘బలవంతుఁడు పై నెత్తిన | బలహీనుఁడు, ధనము గోలుపడిన యతఁడు, మ్రు
చ్చిల వేచువాఁడుఁ, గామా | కుల చిత్తుఁడు నిద్రలేక కుందుదు రధిపా!
21
క. ఇక్కొఱగాముల లోపల | నొక్కటి నీ చిత్తవృత్తి నొందెనొ? యొరు సొ
మ్మెక్కటి గుడువఁ దలంచితొ? | నిక్కము గత మేమి సెపుమ నిద్ర సెడుటకున్‌?’
22
తే. అనిన, ధృతరాష్ట్రుఁ డిట్లను నతనితోడ | ‘ధర్మసుతుమాటచొ ప్పెవ్విధంబొ యెఱుఁగ
కునికిఁజేసి చింతిల్లితి; నోపు దీవు | దెలియఁ జెప్పి నా యలమట మలుగఁ జేయ.’
23
చ. అనవుడు నిట్లనున్‌ విదురుఁ; ‘డక్కట! ధర్మసుతుండు బాంధవుం
డును జెలికాఁడునుం దగు భటుండును బ్రెగ్గడయున్‌ గురుండుఁ గాఁ
డె, నృపవరేణ్య! నీకుఁ? బ్రకటీకృత సత్త్వుఁడు శాంతమూర్తి స
ద్వినయ వివేక శీలముల విశ్రుతుఁ; డాతఁడు గీడు వల్కునే?
24
ఆ. నీవుఁ గొడుకు వారి నెఱి లేక పఱిచితి; | రదియ చాలు; నుచితమైన పాలు
పంచి యిండు; పిల్లి వట్టిన యీరువు | సేసియున్న నేల చెల్ల నేర్చు?
25
వ. మీరు శకుని కర్ణ దుశ్శాసనుల మీఁద రాజ్యభారంబు వెట్టికొనియుండుదు; రిది దుది ముట్టనేర దెట్లంటేని. 26
క. తముఁ దా రెఱుఁగుట, వేగ ప | డమి, దాలిమి, విడుపు గలుగుటయు లేని ప్రభు
త్వము గలదె? వారియం దీ | సుమానుషము లొకఁడుఁ బట్టి చూడం గలఁడే?
27
వ. యుధిష్ఠిరుండు నీవు నిక్కమ తండ్రివని, తగవు నమ్మి, చాల సైరించియున్నవాఁ; డది నీవ యెఱుంగు’ దనిన విని ధృతరాష్ట్రుం డిట్లనియె : 28
తే. ‘సంజయునిచేతఁ గార్యంబు చంద మెల్లి | యెఱిఁగి, మన కెద్ది సేయంగఁ దెఱఁగు, దానిఁ
బనిచి చేయింపు; మిపుడు నా మనము దల్ల | డిలుట హితభాషణంబుల డిందుపఱుపు.
29
వ. నీవు ధర్మాధర్మ విదుండవు; నయానయజ్ఞుండవు. నాకుం బ్రజాగరం బొనర్చుచున్న సంతాపం బుపశమిం చునట్లుగా భవద్వచనామృతంబు నా యుల్లంబున వెల్లిగొల్పు’ మనిన విదురుం డిట్లనియె. 30
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - udyOga parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )