| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఉద్యోగపర్వము - ద్వితీయాశ్వాసము |
| తే. |
తన కులంబునఁ బుట్టిన ధార్తరాష్ట్రు | లన్నదమ్ములతో విగ్రహంబు గొనుట కుమ్మలించి వివర్ణత నొందినట్లు | గంది, యెంతయుఁ జెలు వేదెఁ జందురుండు. |
107 |
| క. |
కుముదములుఁ దారు నొక్కటఁ | బ్రమదంబున నుండి, వాని పదవి దొలఁగినం దమకున్ నిలువఁగఁ దగదను | క్రమమునఁ జనునట్లు తారకంబులు విరిసెన్. |
108 |
| ఉ. |
ఎత్తిన వేడ్కఁ గంధరము లెత్తి, మొగంబులు సాఁచి, చూడ్కులం జిత్తములన్ నిగిడ్చి, తమ చెందెడు నిక్కలు రోసి, యింపు ద ళ్కొత్తఁగ నొక్కచో నొకటి నొక్కటి గాంచి, యెలర్చు కాయ్వులం జిత్తజుకేళిఁ దేలె విలసిల్లుచు జక్కవదోయి వేకువన్. |
109 |
| మ. |
మును సౌరభ్యము నివ్వటిల్లఁగ, మనోమోదంబునం దేఁటు ల ల్లన యోలిన్ వెడలంగ, రేకులు సముల్లాసంబునన్ బింక మె క్క నయంబెక్కుచు, గద్దె పొం దెడలి వీఁకం గేసరంబుల్ గడ ల్కొనఁ, దోడ్తో మధు వుచ్చి, పేరెలమిఁ బొల్పుం జెందె నంభోజముల్. |
110 |
| చ. |
వెడవెడ నిద్రవొంది కనువిచ్చిన పాంథులమీఁద దాడి వోఁ, దడఁబడ నొండొరుం బిలుచు దర్పకు పంపు బలంబులోని య ల్కుడు కరణిం జెలంగె శుక కోకిల భృంగతతుల్ వనంబులం దెడనెడఁ బల్కఁ, గూయ, సొగియింపఁగ మ్రోయఁగఁ దద్విరావముల్. |
111 |
| సీ. |
పద్మపరాగంబుఁ బరఁగించు నరుణోద | యంబు కాంతికిఁ జెలువంబు మిగులఁ, బరువంబు దప్పిన విరుల రాలుచుఁ దరు | చయము చుక్కలు లేని చదలఁ జెనయ, నరవిరి నెత్తాని నడరించు నున్నిద్ర | విట వీటి సౌరభవితతి వొదల, నెలఁత చీరిన యెఱకల నెఱిఁ దీర్చు జ | క్క వలు చందోయి కేఁకట యొనర్ప. |
|
| ఆ. |
వెలరువాఱు దీవియల నల్లనల్లార్చు | సోర్ణగండ్లయందుఁ జొచ్చి సుడిసి, తిరిగి వేగుఁబోక తెమ్మెర లెలదీఁగ | కొనల వంక లొత్తు, ననలఁ బ్రోచు. |
112 |
| ఆ. |
అంత నుదయశైల మను నశోకద్రుమ | సమితియందుఁ గాంతి చారుభంగి నెఱయ విరిసి తొలుత నెగసిన యుజ్జ్వల | స్తబక మనఁగఁ బద్మసఖుఁడు వొడిచె. |
113 |
| సీ. |
ఉర్వీధరంబుల నొప్పెడు జేవుఱుఁ | జఱుల కాంతికి నును మెఱుఁగు వెట్టి, ధరణీజ గుల్మ లతా వితానము పల్ల | వములకుఁ గట్టెఱ్ఱ వన్నె యొసఁగి, యరుణాంబుజంబుల యంతర్దళంబుల | తళతళలకు జిగి దళము కొల్పి, చక్రవాకద్వయ సంతతి యెఱకల | కొమరారు కెంజాయఁ గ్రొత్తసేసి, |
|
| ఆ. |
తనదు బాలబింబ మనుపమేయప్రభా | పటల జటిల గగనభాగ మగుచు నుల్లసిల్లి, జగము లెల్లను విలసిల్లఁ | బూర్వశిఖరిమీఁదఁ బొడిచె నినుఁడు. |
114 |
| వ. | ఇట్లు సూర్యోదయం బగుటయు, ధృతరాష్ట్రుండు తత్కాలోచితాచారంబులు నిర్వర్తించి, తగు తెఱంగున నలంకృతుం డయి, యాస్థానమండపంబున కరిగి పేరోలగం బిచ్చినఁ, గుంభ సంభవ కృప కృతవర్మాశ్వత్థామ కర్ణాదు లగు దొరలును, భీష్మ విదుర బాహ్లిక సోమదత్త భూరిశ్రవః ప్రభృతులగు బంధుజనులును, దుర్యోధన దుశ్శాసన ప్రముఖులగు కుమారులును లోనుగాఁ గల సమస్త పరిజనంబులును వచ్చి బలసియుండి; రయ్యవసరంబున సంజయుండు వచ్చి వాకిట నిలిచి పణిహారుల వలనఁ దన్నెఱింగించి పుచ్చి చొచ్చి, సముచిత ప్రదేశంబునం గూర్చుండి, తన మాటలు వినుటకుఁ జిడిముడిపడుచున్న కొలువుఁ గలయం గనుంగొని యిట్లనియె. | 115 |