| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఉద్యోగపర్వము - తృతీయాశ్వాసము |
| సీ. |
అనిన ముకుందుఁ డిట్లనియె; ‘సంజయుని మా | టలును నీవన్న పల్కులును వింటి; నీమది ధర్మైకనిష్ఠమై నున్నది; | వైరంబు విడువరు వారు; ద్రోణ భీష్ములు గలరని బిరుదులై యున్న వా; | రగునె రాజన్యుల కడఁగి కుడువ? నక్లేశవృత్తి రాజ్యము చవి గొన్న వా | రేల యిత్తురు నీకుఁ బాలు సెపుమ! |
|
| తే. |
ధార్తరాష్ట్రులు సడికి నధర్మమునకు | నలుక రెన్నఁడు; విడువు దైన్యంబు; పొడువు కయ్య మరివర్గ జయమునఁ గలుగు నిహ ప | రములుఁ జిరకీర్తియును బాండురాజతనయ! |
35 |
| మ. |
గురుభీష్మాదులు సూచుచుండ సభ మీకుం గీడు నాఁ డట్లు ము ష్కరులై చేసిరి; యంతసేసియును బశ్చాత్తాపముం బొంద నో పర వా రెన్నఁడు; నట్టిచోటఁ గృపయున్ బంధుత్వముం దక్కు; మె వ్వరుఁ గోపింపరె యా దురాత్మకుల గర్వక్రౌర్యముల్ సూచినన్. |
36 |
| వ. | కపటపు నెత్తంబు నెపంబుగా మిమ్ము వెడలనడుచునప్పుడు దుర్యోధన దుశ్శాసన శకుని సూతనందనులు పుయిలోట దక్కి కలకల నవ్వుచుం బలికిన పలుకు లుగ్గడింపవచ్చునే? వాని విని సమస్త జనంబులు ధృతరాష్ట్రు నిందించుచు మీరు బలవంతులరయి యుండియు సత్యంబు వాటించి యూరకపోక సూచి యచ్చెరు వాటుతో నుమ్మలించుచుండిరి; తిట్టువాట్లం బోయెడువారు దైవోపహతులై మున్న చెడియుండుదురు గావున వారలం జంపనుం జెఱుపనుం జులుకన క్రూరాత్ములగు కౌరవులెల్లవారికి వధ్యులుగాఁ దగుదురు; నీకేల యవధ్యులైరి? పాపాత్మకులగు హింసకులం బాముల నెట్లట్ల నిర్విచారంబుగా వధియించుట కర్తవ్యంబు. | 37 |
| క. |
మీ తండ్రికి భీష్మునకుం | జేతోముద మొదవ భక్తి సేయన తగు నీ; కా తలకు నేనుఁ జని వి | ఖ్యాతంబుగ నీదు వినయ మభివర్ణింతున్. |
38 |
| క. |
చెలులుం జుట్టలు దేశం | బులరాజులు వినఁగ నీదు పుణ్యచరిత్రం బులు నీవు ధర్మమార్గము | దలఁచుటయుం దెలియఁబలికెదం గురుసభలోన్. |
39 |
| వ. | దానికి దుర్యోధనుం డియ్యకొనక తెఱంగుమాలిన మాట లాడుటయుఁ దండ్రి యతని వారింప నేరమికిఁదో డుపేక్షకుం డగుటయుఁ జూచి, మీ తొల్లింటిపాట్లునుం దలంచి యెల్లవారును వారిన గర్హింతు; రింతియ కాక మనకు నొండేమి వలయు? నా యోపినంతయుఁ బెక్కు భంగుల సంధియ కావింపఁజూచెద; నవ్విధంబు సిద్ధించిన మేలుగాదె! యట్లుగాకతక్కిన నచ్చోటి యుత్సాహంబు చందంబును, నందుఁ జేయంగలవారి వర్తనంబులుఁ గొలందులు నెఱింగి నీకు విజయంబగు విధంబునం జనుదెంచెద. | 40 |
| తే. |
ఆ సుయోధను ముక్కున నావి గలుగఁ | బుడమి నీ కీఁడు గావునఁ బోర కలుగు, నేను గయ్యపు శకునంబు లెన్నియేనిఁ | గంటి; నీ వనుత్సాహివి గాఁగ వలదు. |
41 |
| వ. | చతురంగ బలంబుల నాయితంబు గావించుచు దొరలం బురికొల్పికొనుచు నాలస్యంబులేక సమరంబునకు సన్నాహంబు సేయుచుండవలయునని పలికిన విని వృకోదరుండు దామోదరున కిట్లనియె: | 42 |
| క. |
‘సమరంబు గలుగు ననుచును | మము వెఱపింపంగ వలదు మాధవ! నీ వా కుమతి యగు ధార్తరాష్ట్రుఁడు | శమించు కార్యంబు నడపు సౌజన్యమునన్.’ |
43 |
| వ. | అని వెండియు. | 44 |
| శా. |
‘పాపాత్ముండు మదాంధుఁ డా తులువ నీపంపెట్లునుం జేయఁగా నోపం; డడ్డము సెప్ప రెవ్వరును; మానోద్రేకమున్ గర్వముం గోపంబుం దనుఁ ద్రిప్ప నాప్తజనులం గుందించుటం బోయిన ట్లే పోనిత్తురు; గాన ని న్నతఁడు జాలింబెట్టెడుం జూడుమీ! |
45 |
| ఉ. |
చొచ్చిన చోన చొచ్చి తెగఁ జూచెద నంచుఁ గడంగుచుండు; న న్మెచ్చఁడు బాహుగర్వమున; నీచు సుయోధనుఁ; డట్టివానితోఁ బొచ్చెములేక కూడి మనఁ బోవక పోవఁగరాదు నాకు వి వ్వచ్చుఁడు రాచవారుఁ గురువంశము చేటున కోపకుండుటన్. |
46 |
| ఉ. |
పాండవ కౌరవుల్ గలసి పాలును నీరును బోలె నెమ్మిమై నుండఁగ దుష్టచేష్టల సుయోధనుఁ డింతలు సేసె; నాతఁ డొ క్కండ కులక్షయంబునకుఁ గారణమం; డ్రది దప్ప; దైన నీ వొం డన నేల యా బిరుదు నోపిన యంతయుఁ దీర్పు నేర్పునన్. |
47 |
| చ. |
తన పొరిపోవునంతకు నుదగ్రతయుం గపటంబు మాన నే ర్చునె ధృతరాష్ట్ర సూనుఁడు? యశోభరితంబగు భారతాన్వయం బున కొక నిందవచ్చు ననుబుద్ధి దురాత్మున కేలకల్గు? నా యనమెయిఁబోయి హీనగతినైన ఘటించిన నెంత యొప్పునో! |
48 |
| వ. | అని పలికి, మాకును వారికిఁ బితామహుండగు భీష్ముండు వినుచుండ సుయోధనుతోడం గురుకులేశ్వరు నాస్థానంబున నా వచనంబులుగా నిట్లనుము. | 49 |
| తే. |
అన్నదమ్ములమై యుండి యకట! మనల | నొరులు దలయెత్తి చూడ నొండొరులతోడఁ బెనఁగ నేటికి? నీ నేల పెద్దవారి | బుద్ధి విని పంచి కుడుచుట పోల దొక్కొ? |
50 |
| క. |
అని యెవ్విధమున నైనను | వనజోదర! సంధి సేయవలయుం దగ నే మును వారును గలయుట భూ | జనులకునెల్లను హితంబు సౌఖ్యకరంబున్.’ |
51 |
| చ. |
అనుటయుఁ బిన్ననవ్వు నగి యంబుజనాభుఁడు వల్కు ‘నెన్నఁడున్ విననివి భీముపాలఁ గడు వింతలు వింటిమి మాట; లగ్గి చ ల్లనగుట భూరిభూధరము లాఘవ మొందుటఁ గాదె యివ్విధం బున నితఁ డిప్డు మార్దవముఁ బొందుట; యింకిటఁ జెప్ప నేటికిన్? |
52 |