పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఉద్యోగపర్వము - తృతీయాశ్వాసము
ద్రౌపది కృష్ణునితోఁ దన మున్ను పడిన భంగపాట్లు సెప్పుట (సం. 5-80-1)
తే. ధర్మనందను పలుకులు దనకు హృదయ | తాప మొనరింప మోమున దైన్య మొంద
నున్న పాంచాలి యిట్లని యొయ్యఁ బలికెఁ | గనలి శౌరితో గద్గదకంఠి యగుచు.
100
ఉ. అంతలు సేసి పోనడిచి యక్కట సంజయుచేతఁ జెప్పి పు
త్తెంతురె? యిట్టి యూఱట మదిం బ్రియమందె యుధిష్ఠిరుండు దా
నంతన యూళు లేవురకు నైదు సుయోధనుఁ డిచ్చు నొక్కొ? యీ
కంత కృపావిహీనమతి నాతఁడు నొంచునె యన్నదమ్ములన్‌?
101
చ. తన మును బడ్డ బన్నములుఁ దమ్ములపైఁ గల కూర్మి పేర్మి నీ
జనపతి సైఁపకున్నె? యది సక్కన; రాజ్యము పాలులేక తీ
ఱున కొడఁబాటు గల్గిన నెఱుంగమి వెట్టరె? ‘చాలరైరి వీ’
రన రొకొ? నానలేమి యని యాడరె లోకమువారు కేశవా?
102
శా. పెంపేదన్‌ దమకిట్టి తక్కువలు రూపింపంగ నేలా? విచా
రింపన్‌ వారిక మేలు సంధి; దము వారిం జూచినం దారు సా
ధింపం జాలరొ? కాక పోరఁ దగ మర్దింపం దలంపేని శం
కింపం బట్టొకొ? వారు బ్రాహ్మణులె యే కీడైన సైరింపఁగన్‌?
103
ఉ. ఓట యొకింత యేనియు సుయోధను చిత్తమునందు లేదు; నీ
మాటలఁ బోవునే దురభిమానమ యెక్కుడు పూనుఁగాక; య
చ్చోటన సంగరంబు లగు చొప్పులు వుట్టిననైనఁ బాండవుల్‌
పోటున కిచ్చగింతురొకొ! పోదురొ కానల నుండ నచ్యుతా!
104
ఉ. ఏ నిటులంటి నా వలవ; దింకను నీవును రాజుఁ దమ్ములుం
గా నుచితంబు చూచి మన కార్యము మీసుజనత్వముం జెడం
గా నొకభంగి సేయక తగం గురువర్గము తోడి సంధి మీ
కైన తెఱంగునన్‌ వలచినట్టుల చేయుఁడు నేర్పు లేర్పడన్‌.
105
వ. అని మఱియు నిట్లనియె. 106
ఉ. ఆఱడిఁ బోకయున్‌ ఫలము నందుటయుం గని పల్కనేరమిన్‌
మాఱట నోరి దాననయి మాటలు చిత్తమునందు నిల్ప కేఁ
గాఱులు ప్రేలెదన్‌; వినుఁడు; కర్జము నెగ్గును గాన నల్కమై,
వీఱిఁడి యైన మానిసికి వెండి వివేకము గల్గనేర్చునే?
107
చ. వరమునఁ బుట్టితిన్‌, భరత వంశముఁ జొచ్చితి, నందుఁ బాండుభూ
వరునకుఁ గోడలైతి, జనవంద్యులఁ బొందితి, నీతి విక్రమ
స్థిరులగు పుత్త్రులం బడసితిన్‌, సహజన్ముల ప్రాపు గాంచితిన్‌
సరసిజనాభ! యిన్నిటఁ బ్రశస్తికి నెక్కినదాన నెంతయున్‌.
108
వ. అట్లుంగాక. 109
ఉ. నీవు సుభద్రకంటెఁ గడు నెయ్యము గారవముం దలిర్ప సం
భావన సేయు; దిట్టి ననుఁ బంకజనాభ! యొకండు రాజసూ
యావభృథంబు నందు శుచియై పెనుపొందిన వేణి వట్టి యీ
యేవురుఁ జూడఁగా సభకు నీడ్చెఁ; గులాంగన ని ట్లొనర్తురే?
110
ఉ. ఆ సభ కేకవస్త్ర యగు నట్టి ననుం గొనివచ్చి నొంచు దు
శ్శాసనుఁ జూచుచుం బతు లసంభ్రములై తగుచేష్ట లేక నా
యాసలు మాని చిత్రముల యాకృతి నున్న యెడన్‌ ముకుంద! వి
శ్వాసముతోడ నిన్‌ గొలువ వచ్చె మనం; బదియుం దలంపవే.
111
చ. అరయమిఁ జేసి కోడ లన కప్పుడు దాసిగఁ జేసె; నమ్మహా
పురుషుని పాలికిం బతులు వోవఁగ వీరలతోన యేను జె
చ్చెరఁ జని కోటరంబు దగఁ జేయుదునో? యటుఁగాక పాడిమై
వరవుడ మోపి చేయుదునొ వారికి మాధవ! నిశ్చయింపుమా!’
112
వ. అని యట్లుగ్గడించి. 113
ఉ. ద్రోవది బంధురం బయిన క్రొమ్ముడి గ్రమ్మన విడ్చి, వెండ్రుకల్‌
దా వలచేతఁ బూని, యసితచ్ఛవిఁ బొల్చు మహాభుజంగమో
నా విలసిల్లి వ్రేలఁగ, మనంబునఁ బొంగు విషాద రోషముల్‌
గావఁగ లేక బాష్పములు గ్రమ్మఁగ దిగ్గన లేచి యార్తయై.
114
వ. గోవిందు ముందటంబెట్టి యిట్లనియె : 115
క. ‘ఇవి దుస్ససేను వ్రేళ్ళం | దవిలి సగము ద్రెవ్విపోయి దక్కినయవి; కౌ
రవుల కడఁ దీఱుమాటల | యవసరమునఁ దలఁపవలయు నచ్యుత! వీనిన్‌.
116
సీ. ఈ వెండ్రుకలు వట్టి యీడ్చిన యాచేయి | దొలుతగాఁ బోరిలో దుస్ససేను
తను వింత లింతలు దునియలై చెదరి రూ | పఱియున్నఁ గని యుడుకాఱుఁగాక!
యలుపాలఁ బొనుపడునట్టి చిచ్చే యిది; | పెనుగద వట్టిన భీమసేను
బాహుబలంబును బాటించి గాండీవ | మను నొక విల్లెప్పుడును వహించు
 
ఆ. కఱ్ఱి విక్రమంబు గాల్పనే? యిట్లు బ | న్నములు వడిన ధర్మనందనుండు
నేను రాజరాజు పీనుంగుఁ గన్నారఁ | గానఁ బడయమైతిమేనిఁ గృష్ణ!
117
ఉ. నెట్టన యిట్టియల్క మది నిల్పితి రక్కెస తాల్మిఁ జిచ్చొడిం
గట్టిన యట్లు పెద్దయును గాలము దీనికి నాఱు టెన్నఁడుం
బుట్టదు దుష్టనిగ్రహము పూని జగంబులు గాచునట్టి తోఁ
బుట్టువు తీవ్ర తేజమునఁ బొల్చిన భర్తలు గల్గ నచ్యుతా!’
118
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - udyOga parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )