పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఉద్యోగపర్వము - తృతీయాశ్వాసము
శ్రీకృష్ణుఁడు ధృతరాష్ట్రునితో సంభాషించుట (సం. 5-93-1)
క. జలదస్వన గంభీరత | నెలుఁగొప్పఁగ దంత దీప్తు లెసఁగ ముకుందుం
డలరుచు సభ నఖిల జనం | బులు విన ధృతరాష్ట్ర భూవిభున కిట్లనియెన్‌.
256
క. ‘జననాథ! నీ యెఱుంగని | పనులు గలవె? యైనఁ దగవుఁ బరమహితంబుం
దనవారికిఁ జెప్పన తగు | నని వచ్చితి భారతాన్వయము ప్రియమొందన్‌.
257
క. క్షీరోదక గతిఁ బాండవ | కౌరవు లొడఁగూడి మనికి కార్యం బది నీ
వారసి నడపుము వా రన | వీ రనఁ గురుముఖ్య! నీకు వేఱుంగలదే?
258
చ. భరతకులంబు ధర్మమును బాడియు సత్యముఁ బొత్తుఁ బెంపునుం
గరుణయుఁ గల్గి యుండు ననఁగా నుతిఁ గన్నది; యందు సద్గుణో
త్తరులరు నీవు నీ యనుఁగుఁ దమ్ముఁడు; నీ తనయుల్‌ యశోధురం
ధర శుభ శీలు; రీ సుచరిత క్రమ మిప్పుడుఁ దప్పనేటికిన్‌?
259
శా. ఈ వంశంబున కెల్ల నీవ కుదు; రిం దెవ్వారి చందంబు లె
ట్లై వర్తిల్లినఁ గీడు మేలుఁ దుది నీయం దొందెడుం గాన స
ద్భావం బారసి లోనిపొత్తు వెలివృత్తంబున్‌ జనస్తుత్యముల్‌
గావింపం దగు నీక యెవ్విధమునం గౌరవ్యవంశాగ్రణీ!
260
చ. వినుము! సుయోధనాదులగు వీరు సధర్ములు గాక కార్యము
ల్గొనక మహార్థసిద్ధి యెడలుం దమ కిట్లన కన్వయంబు వ
ర్తనమిది గాదు నాక బెడిదంపుఁదనంబున బంధుకోటికి
న్మనసులు నొవ్వఁగా నవగుణంబులకుం బుయిలోడ రేమియున్‌.
261
ఉ. కౌరవ పాండవుల్‌ తెఱఁగు గైకొని శాంతతఁ బొందియున్కి మే
లారయ నాకు నీకుఁ గులమంతకు నీ నృపకోటి కుర్వికిం
బోరితమైన నింతకును బుట్టు మహాపద గావునన్‌ ధరి
త్రీ రమణాగ్రగణ్య! గణుతించి యవశ్యముఁ బొం దొనర్పవే!
262
తే. నీకు వలసినఁ దీర్పంగ నేరవచ్చు | నధిప! తెఱఁగు నీ వశమున యదియ కాన
నీకు వీరలఁ దేర్చుట నెఱియ కాదె | సిద్ధ మెవ్వారిఁ దెలివొందఁ జేయనేర్తు.
263
ఉ. అందు వృకోదరార్జునుల నాహవ రంగమునందు మీఱువా
రెందఱొ యెన్నుమా యిచట; నీ గురుభీష్ములఁ గ్రేణిసేయువా
రెందఱొ; వారు వీరు నని నీల్గుటకంటె భవద్బలంబులై
యందఱుఁగూడు టొప్పదె జనాధిప! శాంతి యొనర్పు మెమ్మెయిన్‌.
264
తే. జగతిఁగల జనపతులు నీ చరణపీఠ | మర్థిఁ గొలువ సముద్ర వేలావృతోర్వి
యెల్ల నేలుట యొప్పదే? తల్లి ప్రజల | యెడ విరోధంబు వాటించు టెంత మేలు?
265
క. నరనాథ! నీవుపేక్షా | పరుఁడ వయినఁ గౌరవులక పాండవులక కా
దరయఁగ భూ ప్రజకెల్లను | దురితం బొనరించి నట్ల తుదిఁ గీడు సుమీ!
266
క. కౌరవ పాండవులం దె | వ్వారలకుం జావు నొవ్వు వచ్చిన మే లు
ర్వీరమణ! చిత్తమున నె | ట్లారయుమా నీకు దుఃఖమగు నెట్లయినన్‌.
267
ఉ. వీరును వారుఁ బండితులు, విక్రమవంతులు, బాహుగర్వదు
ర్వారులు; పూని రిత్త బవరంబున నాఱడిఁ జావఁబోవ నె
ట్లూరక యుండవచ్చుఁ? గడు నొప్పెడు మేనులు వాఁడి కైదువుల్‌
గూరఁగ నాటినం బుడమిఁ గూలుట కక్కట! యోర్వవచ్చునే?
268
ఆ. ఇట్లు గాక యుండ నీ రెండు దెఱఁగుల | వారి గాచికొనుము వసుమతీశ !
నీదు ప్రాభవంబు నీతియు శాంతియు | నఖిల జనులుఁ బొగడునట్లుగాఁగ.’
269
వ. అని చెప్పి వెండియు. 270
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - udyOga parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )