| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఉద్యోగపర్వము - తృతీయాశ్వాసము |
| చ. |
అన విని భీష్ముఁ డిట్లనియె నాధృతరాష్ట్ర తనూజుతోడ ‘నీ జనకుని మాట వట్టుము ప్రసన్నమతిన్ | మనవంశ మెల్లఁ బా వనముగ నిందు వచ్చి బుధవత్సలుఁ డీ హరి యిట్లు సెప్పఁగా వినమిఁ గడుం జెడుం దెరువు; | వీరల పం పొనరింపు పెంపుగన్. |
344 |
| క. |
మానక ధృతరాష్ట్రుఁడు ప్రా | ణానం గలుగంగ బంధునాశము రాజ్య శ్రీనాశము నుద్దామయ | శోనాశముఁ జేయనేల చూచెద చెపుమా! |
345 |
| వ. | కృష్ణార్జునులతోడి విరోధం బీ బంధులోకంబునక కాదు లోకంబున నెవ్వరికినిం జూడం బోలదు లోకంబులు రెంటికిని హానిం జేయక కూడి బ్రదుకుట మే’లనినఁ దదనంతరంబ ద్రోణాచార్యుండు దుర్యోధనున కిట్లనియె: | 346 |
| తే. |
‘పితృ పితామహ గురులమై ప్రీతిఁగోరు | చున్న యట్టి మా పరమ హితోపదేశ వాక్యములు విని దుర్జన వచన రచనఁ | గొనక బంధులతో నొడఁగూడి మనుము. |
347 |
| ఉ. |
వెన్నుఁడు ప్రీతిఁ జెప్పిన సవిస్తర వాక్ప్రచయంబు త్రోవఁ బో వన్న కుమార! యట్లయిన వాయువు శ్రీయును నీకుఁ గల్గు మా కన్నులు సల్లఁగా నకట గన్గొనుచుండుదు మేము; నట్లుగా కున్నను నీవ నేర్తు నొండన నేరము నిండు కొల్వునన్. |
348 |
| చ. |
అనవుడు నాంబికేయుఁడు నిజాత్మజుదిక్కు మొగంబుచేసి యి ట్లను ‘హరి నాశ్రయించి భవదగ్రజుఁ బుణ్యు నజాతశత్రునిం గను మటవోయి దీన మన కార్యము లన్నియు సిద్ధిఁబొందు; నీ తనిపలు కాదరింపమిఁ బదంపడి పాటిలు నెల్ల చేటులున్. |
349 |
| వ. | అనియె; నట్టియెడ గురుభీష్ము లొత్తి చెప్పం దలంచి గాంధారేయున కిట్లనిరి: | 350 |
| క. |
‘ఈ కృష్ణుని సారథ్యము | నా కృష్ణుని గాండివంబునై తోఁపక ము న్నీ కొలఁదిఁ జక్కఁబడి నీ | వీ కురువంశంబు గావు మిభపురనాథా!’ |
351 |
| వ. | అని పలికి మఱియు. | 352 |
| సీ. |
‘ధర్మపుత్త్రుని పద ద్వయమున కతిభక్తి | నెఱఁగిన నతఁడు ని న్నెత్తి గ్రుచ్చి నిడుఁ గేలఁ బెద్దయుఁ దడవుగాఁ గౌఁగిలిం | పఁగ భీముఁడును నీవుఁ బరమహర్ష మునఁ జారుతర వక్షములు సంగతములుగాఁ | బరిరంభణం బొనర్పంగ నరుఁడుఁ గవలును మ్రొక్కినఁ గరమర్థిఁ దిగిచి నీ | వాలింగనంబు సేయంగ, నిట్లు |
|
| తే. |
వారు మీరును దగ బాంధవమునఁ బొదలి | యింపు దళుకొత్తఁ దామరతంపరైనఁ జెలులుఁ జుట్టలుఁ గలసి పేరెలమిఁ బొంది | యుల్లసిల్లంగఁ గులమెంత యొప్పునొక్కొ! |
353 |
| క. |
సమరమునకు వచ్చిన భూ | రమణు లుభయకటకములను బ్రమదం బెసఁ గం దమతమ పురములకుం బో | వ మహీ జను లెట్టి యుత్సవముఁ బొందుదురో!’ |
354 |
| వ. | అని వెండియు ననేక విధంబులం జెప్పి యీ రెండు దెఱంగుల వారును బంచి కుడిచి సుఖంబున్న నఖిల భూ ప్రజకును బ్రమోదం బగుం గావున నట్లుసేసి యందఱచేత దీవనలు వడయవయ్య నీ’వనిన విని దుర్యోధనుం డప్పుండరీకాక్షు వీక్షించి యిట్లనియె: | 355 |
| క. |
‘గురుఁడును బితామహుఁడు నీ | నరనాథుఁడు నెల్ల ప్రొద్దు నను దూఱుదు; రి ప్పరుసున నీవును దామో | దర! దూఱెదుగాని తగవుఁ దలఁపవు కంటే! |
356 |
| క. |
వనితం బఱిచి రరణ్యం | బున నిడుమలఁ బడితి మనుచుఁ బోటరులై చం పను జెఱుపఁదలఁచి మా దెసఁ | గనలుదు రప్పాండుసుతు లకారణమ కడున్. |
357 |
| మ. |
అరయం దప్పొకయింత నా వలన లే దా ధర్మపుత్త్రుండు జూ దరి వెంటం దమకించి సౌబలునిచేతన్ భూమిఁ గోల్పోయి ము ష్కరుఁడై వెండియు నొడ్డఁగా నతఁడు నక్షప్రౌఢిమై గెల్చె; నే తెరువైనం దనయిచ్చతోఁ బడియె; నింతేకాక యేఁ బూఁటయే? |
358 |
| తే. |
మాత్స్య పాంచాల పాండ్యాది మనుజపతులఁ | గూర్చికొని తార కయ్యంబు గోరి యెత్తి విడిసి; రింతియ కాక యివ్విధము నుగ్ర | కర్మమున కేము దొడఁగుట గలదె చెపుమ? |
359 |
| క. |
ఉక్కఱి సురపతి కైనను | మ్రొక్కము నృపధర్మమూఁది మొనతలఁబడినన్ మిక్కిలి పేరును నిట దివి | నక్కజముగఁ బెంపుఁ బడయ నగుట నుపేంద్రా! |
360 |
| చ. |
చిఱుతఁదనంబునం దగవు చిత్తమునం దలపోయలేక ముం దఱ యటు వోవనిచ్చితిఁ | బితామహుఁడున్ జనకుండు నింకఁ గ్ర చ్చఱ నిలఁ బంచి చక్క సగ మక్కడ నెవ్వరికేని మద్బలం బెఱుఁగక యీఁదలంచినను నే నది యేటికి సమ్మతించెదన్? |
361 |
| తే. |
తొంటి చవిగని యిప్పుడుఁ దోఁచి పాండు | సుతులు రాజ్యంబు చేయంగఁ జూచినారు; నాకు నీఁ దీఱునే యింక నాఁటి చూఱ | లెక్కడివి ద్రోణ భీష్ము లీ దిక్కుసుమ్ము! |
362 |
| ఉ. |
ఏమును వారుఁ బంచికొని యేలుట గల్గదు; పల్కకుండు మిం కేమియు; వాఁడి సూదిమొన యించుక మోపిన యంతమాత్రయున్ భూమి యొనర్చి పాండునృపపుత్త్రుల కిత్తునె | యెవ్వరైన సం గ్రామమునన్ జయంబుఁ గొని రాజ్యము సేయుట నిశ్చయించితిన్. |
363 |
| తే. |
అనిన విని కిన్కఁ బూనిన యలఁతి నగవు | చెలువు మొగమున కొక క్రొత్త పొలు పొనర్పఁ బుండరీకాక్షుఁడగు టెల్లఁ బోయి యప్పు | డరుణ కమలాక్షుఁ డగుచు మురాంతకుండు. |
364 |