పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఉద్యోగపర్వము - తృతీయాశ్వాసము
దుర్యోధనాదులు శ్రీకృష్ణునిం బట్టికొని చెఱంబెట్టఁ దలంచుట (సం. 5-128-1)
క. హరి తలఁ పొప్పదు భీష్ముని | గురునిం గూర్చికొని మనలఁ గ్రొవ్వఱఁ బట్టం
గర ముత్సహించుచున్నాఁ | డరయ నతని వచన రచన నంతయుఁ దెలిసెన్‌.
389
క. మునుఁ దాఁ గంసునిఁబరి మా | ర్చిన చందము వారికెల్లఁ జెప్పెడుఁ; దనకున్‌
మును మనము గడఁగి వెసఁబ | ట్టినఁ గార్యం బగుఁ; జలంబు డింపకుఁ డింకన్‌.
390
తే. పట్టి యీతనిఁ జెఱఁబెట్టి పాండవులకు | దిగులు పుట్టింత మంతటఁ దెగక యెత్తి
వచ్చిరేనియు నిర్జింప వచ్చుఁ గోఱ | లెల్లఁ బుచ్చిన నురగంబు లేమిసేయు?
391
వ. అని విచారించె నట్లు దుష్కార్యాలోచనంబు సేసి దుర్యోధన దుశ్శాసన శకుని కర్ణులగు దుష్టచతుష్టయంబు మొదలుగాఁ గల యవినీతులు దైతేయమర్దను మర్దింప నిశ్చయించి; రయ్యవసరంబున. 392
చ. అడఁకువ లేమి నల్కి యురియాడుట నొండొరుఁగూడకుండుటన్‌
బుడిబుడి మాటలాడుటను బోవుచు వచ్చుచుఁ గ్రందు గ్రమ్మఱం
బడుటను దెల్లమైన మును పన్నుగఁ దాఁ బరికించి యున్కి న
ప్పుడు హరిఁ బట్టు సంకులము పుట్టుట సాత్యకి నిశ్చయించుచున్‌.
393
తే. బఱటి కొనిపోయి కృతవర్మఁ బన్నఁ బనిచె | నీవు బలమును వాఁకిట నిలువు; మేను
లోపలికి నెల్లఁ జాలుదుఁ; బాపబుద్ధు | లన్నదెసఁ దప్పిరని నిర్భయమునఁ జెప్పె.
394
వ. ఇట్లు పరమాప్తుండగు హార్దిక్యు నటపుచ్చి సాత్యకి సత్వరంగాఁ జనుదెంచి జనార్దనునకు నత్తెఱంగెల్ల నెఱింగించి, తదనుమతిం గౌరవేశ్వర బాహ్లిక గురు భీష్మ విదురులతో నిట్లనియె. 395
మ. ‘అదె కౌరవ్యు లశక్తదుర్జనత సేయంబూని పైఁ బాఱఁజూ
చెద రమ్మైఁ దమచేతఁ దీఱునె జయశ్రీకాంతు దైత్యాంతకుం
బొదువం దారు దలంచు టెల్ల ననలంబుం జీర బంధింపఁగా
మది నూహించిన యట్లకాక తమ దుర్మంత్రంబులం బోవునే?’
396
వ. అనిన విదురుం డదరిపడి వైచిత్ర్యవీర్యున కిట్లనియె: 397
ఉ. ‘భూవర! నీ తనూభవులు పుణ్యు నగణ్యపరాక్రమున్‌ హరిం
గేవల మర్త్యుఁగాఁ దలఁచి కిట్టినఁ బట్టినఁ దారు మంటపై
వావిరిఁ గ్రమ్ము నా శలభ వర్గము చాడ్పున మ్రందిపోరె? కా
లావధి యయ్యెఁ గావలయు నక్కట! వారికి వారివారికిన్‌.
398
వ. అనుటయు గోవిందుం డందఱు విన నంబికానందనున కిట్లనియె: 399
ఉ. ‘రోషము నాపయిం గలిగి క్రూరతఁ గౌరవు లింతసేఁత సం
తోషమ! నీవు ప్రాభవముతోఁ దగ నాకు ననుజ్ఞయిమ్ము; ని
ర్దోషత నేను నోపుగతి దోర్బల దుర్జయులైన వారి వి
ద్వేషముఁ జక్కఁ బెట్టి జగతీవర! యింతకుఁ బోయివచ్చెదన్‌.’
400
క. అనుడు ససంభ్రమముగ న | జ్జనపతి దుశ్శాసనాది సకల పరిజనం
బును నాదుర్జనునిం దో | డ్కొని రమ్మని విదురుఁ బనుచుడుం జని యతఁడున్‌.
401
వ. సపరివారంబుగా దుర్యోధనుం డోడ్తెచ్చినం జూచి యతనికి ధృతరాష్ట్రుం డిట్లనియె: 402
చ. ‘అలవి యెఱుంగ కిట్లు దనుజారికిఁ గీడొనరింప నీవు నీ
తులువలు నుత్సహించితిరి దుర్మతులార! సమీరు మీకుఁ జే
నలవడఁ బట్టవచ్చునె? మహాద్రిఁ గదల్పఁగఁ బోలునే? దవా
నలుఁ జమరంగ శక్యమె? వినాశముఁ బొందెద రేమి సేయుదున్‌?’
403
ఆ. అనిన విదురుఁ డిట్టులను సుయోధనుతోడ | ‘బాలకేళిఁ దొడఁగి లీలఁ గృష్ణుఁ
డెచట నెచట నెవ్వరెవ్వరి నేమేమి | సేసె వినవె? యేల చెడియె దిట్లు?’
404
వ. అనియె నట్టియెడఁ గట్టెదురనున్న యక్కురుపతికుమారుం జక్కం జూచి యేనొక్కరుండన యని తలంచియె దుర్మదంబునం బొదివి పట్ట నుత్సాహంబు సేసితనుచు దరహాసంబు సేయు వాసుదేవుని ఫాలప్రదేశంబున బ్రహ్మయు, వక్షంబున విరూపాక్షుండును, వదనంబున వహ్నియుఁ, బార్శ్వంబుల నింద్ర యమ వరుణ కుబేరులు నాదిత్యమరుద్విశ్వేదేవాశ్వినులు నుద్భవించిరి హలగాండీవ మండిత బాహులగు బలదేవార్జునులు సవ్య దక్షిణ భుజంబులను, నిజాయుధ హస్తులగు యుధిష్ఠిర భీమ నకుల సహదేవులు వీఁపునను. వివిధ ప్రహరణ పాణులగు యదువృష్ణి భోజాంధక వీరు లూరులను బ్రభవించిరి; జనిత నానాహస్త విన్యస్తంబులయి శంఖచక్ర గదా ఖడ్గ శక్తి శార్ఙ్గ ప్రముఖ నిఖిల సాధనంబులు వెలింగె; నేత్ర శ్రోత్ర నాసా వివరంబుల సధూమ ధూమకేతు జ్వాలా జాలంబులు నిగిడె; రోమకూప కలాపంబులం దరణి కిరణ నిభ ప్రభలు వెడలె; నిట్లు దుర్నిరీక్షంబగు నత్తేజోరూపంబుఁ గనుంగొనం గొలఁదిగాక సకల జనంబుల నయనంబులు మొగిడ్చి యద్భుత భయానక రసంబుల జొత్తిల్లు చిత్తంబుల తోడం గదలకుండ నప్పుండరీకాక్షుండు నారదాది మహా మునుల వలనను భీష్మవిదుర ద్రోణ సంజయుల యందును గరుణా తరంగితంబగు కటాక్ష వీక్షణం బొలయ వారలకు దివ్య దృష్టి యొసంగిన నా పుణ్యపురుషులు సాంద్రానందంబునం దేలుచుండి; రయ్యవసరంబున. 405
తే. దేవదుందుభి వ్రాతంబు దివిరెఁ గల్ప | వృక్ష పుష్ప ధారామయ వృష్టి గురిసె
సిద్ధ సాధ్య విద్యాధర శ్రేణి భక్తి | నిచ్చు జయజయ శబ్దంబు లెసఁగెఁ జదల.
406
వ. అప్పుడు ధృతరాష్ట్రుం డమ్మహాసంకులంబు విష్ణుని దివ్యవిజృంభణంబు గావలయు నని యూహించి. 407
క. ‘కరుణింపుము సంశ్రితభయ | హరణ ధురీణా! సహింపు మజ్ఞానంబున్‌
శరణంబు వేఁడెద భవ | చ్చరణంబులు గనుఁగొనం బ్రసాదింపఁగదే!
408
చ. అనుడు దయార్ద్రచిత్తుఁడగు నప్పరమేశ్వరుఁ డిచ్చె దృష్టి య
జ్జనపతి కద్భుతం బడర సమ్మదపూరము గ్రమ్మ నాతఁడుం
గనుఁగొని భక్తి మ్రొక్కి ‘నినుఁగంటిఁ గృతార్థుఁడనైతి; నింక నొ
ల్ల నొరులఁ జూడ లోచనములం బురుషోత్తమ! సంహరింపవే’
409
క. అనిన పలుకులకు నచ్చటి | జనులెల్ల నృపాలు సితవిశాలాక్షుఁ గనుం
గొనుచుండి రపుడు తమనె | మ్మనమ్ము లాశ్చర్యరస నిమగ్నంబులుగాన్‌.
410
వ. తదనంతరంబ దామోదరుండు ధృతరాష్ట్రు నభిమతం బొడఁగూడ నతని కన్ను లెప్పటియట్ల కావించి, నిజ విశ్వరూప ప్రపంచంబు నుపసంహరించి, మునీంద్రుల నామంత్రణంబు సేయ నమ్మహాత్ము లంతర్ధానంబు సేసిరి; దానును సముత్థానంబు సేసి యంతకుమున్న సన్నిహితులైయున్న కృతవర్మ కరంబును, సాత్యకి హస్తంబును నవలంబించి యూరక వెడలెనని చెప్పిన. 411
ఆ. ‘ఇవ్విధమునఁ గృష్ణుఁ డేఁగిన పిదపటి | కథ వినంగ నాకుఁ గౌతుకంబు
మనము నిండి గడలు కొనుచున్నయది వివ | రించి చెప్పు మునివరేణ్య’ యనుడు.
412
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - udyOga parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )