| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము |
| వ. | ఇట్లు ప్రస్థాన భేరి చెలంగిన సకల సైన్యంబులు దండనాథ సహితంబుగా సన్నద్ధంబులయ్యె; మఱునాఁడు. | 117 |
| ఉ. |
భూరి విభూతిఁ బెండ్లికిని బోవు తెఱంగునఁ బాండునందనుల్ దారును బుత్త్రులున్ హరియుఁ దమ్ముఁడు నుజ్జ్వల చారులీల శృం గారము చేసి, సమ్మద వికాస మెలర్పఁగ వీర సంభ్రమో దార సముద్ధతిం జనిరి ద్రౌపది యున్నెడ కందఱుం దగన్. |
118 |
| వ. | ఇట్లుచని యమ్మహాదేవి నామంత్రణంబు సేసి తత్ప్రభృతి పుణ్యస్త్రీ కరకలితలలితాక్షతంబులు గైకొని, విప్రాశీర్వాదంబులాదరించుచు, భద్రపాఠక శ్లోకంబు లాకర్ణించుచు, శోభన పదార్థంబులు గనుంగొనుచు, నాంగిక మాంగల్య సూచకంబులు సేకొనుచు వెడలునప్పుడు. | 119 |
| క. |
తగ శంఖ కాహళాదిక | మగు మంగళ తూర్యసంచయము గంభీరం బుగ మ్రోసె జయముఁ దెలుపుచు | జగతీశ్వరు మ్రోల నాకసము దీటుకొనన్. |
120 |
| క. |
మనుమని జయప్రయాణం | బనుమోదింపంగ నా సుధాంశుఁడు సనుదెం చినకరణి గొడుగు కుంతీ | తనయాగ్రజుమ్రోల నతిసితప్రభ నొప్పెన్. |
121 |
| వ. | అట్టి యెడ నమ్మహీవల్లభుండు. | 122 |
| క. |
ఉచితగతిఁ జేరి వంది | ప్రచయముఁ గీర్తింప నెక్కె రథమం దొనరన్ ఖచియించిన వజ్రంబుల | రుచులను బొలుపారు సీవిరులు బెరయంగన్. |
123 |
| వ. | తదనంతరంబ. | 124 |
| సీ. |
వక్ష స్స్థలంబున వనమాల క్రాలంగ | వెలిమావు గెడల వాగెలు ధరించి నొగలపై హరియొప్ప నగచరకేతువు | మెఱయంగ నరదంబు మెఱుఁగు లడర దివ్యకిరీటంబు దీప్తులు భూనభోం | తరమెల్లఁ గలయంగఁ బరఁగుచుండ గాండీవతూణ యుగ్మములు పూర్వాపర | భాగంబులకు నవాభరణములుగఁ |
|
| తే. |
దెలి మొగంబుతో నల్ల నేతెంచి యొక్క | పార్శ్వమునఁ బొడసూపి భూపతికి మ్రొక్కి దేవదత్తంబు పూరించె దేవదేవు | పాంచజన్యంబునకు మున్న ఫల్గునుండు. |
125 |
| శా. |
భీముండుం గవలుం గుమారులును సంప్రీతిన్ గదాద్యాయుధో ద్దామ స్ఫీత రుచుల్ వెలుంగ, రథ సంతానంబు రమ్యోజ్జ్వల శ్రీ మీఱన్ దగ వచ్చి శంఖములు గర్జిల్లంగఁ బూరించుచున్ భూమీశుం గని యగ్రభాగమున కొప్పుం బెంపునుం జేయుచున్. |
126 |
| క. |
నిలిచిరి, తక్కటి దొరలును | బలుమానుసులును మహోగ్రభంగి సవరణల్ సెలువొంద నధిపు చుట్టుల | నలంకరించిరి విభూషణాంశుచ్ఛటలన్. |
127 |
| వ. | అప్పుడు పాండవాగ్రజున కభిముఖంగాఁ జనుదెంచి. | 128 |
| క. |
సాష్టాంగ మెఱఁగి సమరా | వష్టంభం బొప్ప దివ్యవాహన లీలో త్కృష్టగతిన్ ముంగలియై | ధృష్టద్యుమ్నుండు వొలిచెఁ దేజో మహిమన్. |
129 |
| వ. | ఇవ్విధంబునం జారుభీషణంబుగా సన్నద్ధుండై యుధిష్ఠిరుండు గదలి శుభసూచకంబులు గైకొనుచు నడచె; నట్టిసమయంబున నెల్లవారి పరిచారకులును శకటాది సకల సాధనంబులును బటగృహంబులును మొదలుగా వలయు సమస్త వస్తువు లొడఁగూర్చి వెడలిన దండు పఱపై సముద్రంబు గాఁపువోవు చందంబయ్యె; నిట్లరిగి ధర్మపుత్త్రుండు కురుక్షేత్రంబు దఱియంజొచ్చి ఋష్యాశ్రమంబులకు దేవతాయతనంబులకు నలజడి గాకుండం బరిహారంబు సేయుచుం జని తృణకాష్ఠ జలసమృద్ధంబై తగియెడు సమస్థలంబున హిరణ్వతి యను పుణ్యనది పొంత విడిదలగా నిరూపించి యచ్చో నిలిచెఁ; దదనంతరంబ. | 130 |
| తే. |
విడియుటకు సూచకంబుగ విష్ణుఁ డొత్తెఁ | బాంచజన్యంబు; ధర్మజపార్థులాది గాఁగఁ దమతమ వీరశంఖంబు లెల్ల | దొరలు నొత్తిరి దివి మ్రోఁతఁ దూఁటుగట్ట. |
131 |
| వ. | తదనంతరంబ యొక్క రమ్యప్రదేశంబున రాజమందిరంబును నుచిత స్థానంబుల సమస్తజన నివాసంబులునై రమణీయబంధురంబును సింధురాశ్వశాలా మాలికా మనోహరంబునుంగా వీడెల్ల విడిసె; వీటి చుట్టునుం దిరిగి ధృష్టద్యుమ్నుండు సురక్షితంబు చేసివచ్చె; రాజును దొరలును దమ్ములును సకల పరివారంబును దగిన తెఱంగున నుండిరి. నానావస్తు బహుళ సంభారంబుల మహోదారం బగుచుఁ బాండవ స్కంధావారంబు మహనీయాకారంబున నొప్పె; నంత నక్కడ. | 132 |
| క. |
చారులచే నంతయు విని | కౌరవపతి విననియట్ల కర్ణాదులతోఁ బేరోలగమున విగత వి | కారుండై యిట్టు లనియె గర్వ మెలర్పన్. |
133 |
| క. |
‘తన వచ్చిన కార్యము మన | మనుకూలతఁ జేయకున్న హరి యలుకమెయిన్ జని యప్పాండు తనూజులు | మనములఁ గిను కూనునట్టి మాటలు సెప్పున్. |
134 |
| చ. |
మును మనచేత భంగపడి ముచ్చిరి యుండుటఁ జేసి పాండునం దనులును నెత్తివత్తు రుచితంబుగ; సంగర మెట్లుఁ గల్గుఁ; బే ర్చిన బహుసైన్యముల్ బయలఁ జేరఁ దగన్ విడియింత; మెల్లి దం డని పురిఁ జాటఁ బంచి దొరలందఱకున్ బడిసేయుఁ డేడ్తెఱన్. |
135 |
| వ. | మనకు విడిదల కురుక్షేత్రం’బని పలికి దుశ్శాసనుం జూచి, నీవును గర్ణుండును గాంధారపతియును సమస్తంబును సమకట్టుం’ డనుటయు వారలు ప్రియంబునం బనిపూని వెడలి దండు సాటించి, తగు వారలకెల్ల నెఱింగించి పుచ్చిన, సకల పరివారంబును బ్రమోదంబు నొందె; భూవల్లభుండును గొలిచియున్నవారలం బోవంబంచి, వలయు నెడకుం జని తగిన వర్తనంబున నుండె; నట్టి సమయంబునఁ బ్రయాణోచితంబులగు బహుప్రకార వ్యాపారంబులయందుఁ దత్పరులయిన దొరల నానాచేష్టితంబులను, గరితురగ రథంబులకు సవరణలు సమకూర్చు చతుర పరిచారకుల సంభ్రమంబునను, వివిధాయుధంబులు రవణంబులుగా నాయితంబులు సేయఁ బ్రవర్తించు పదాతి వర్గంబుల సంరంభంబునను నయ్యైసరకులు పయనంబున కనువు సేయ బలుమానుసుల తిరుగుడు వడుటనుం బురంబు సమరోత్సాహ చంద్రోదయంబునకు మహార్ణవంబై ఘూర్ణిల్లుచుండె; నపరదిన ముఖంబున. | 136 |
| క. |
త్వరితగతి సమయ సముచిత | కరణీయము లాచరించి కమనీయాలం కరణోజ్జ్వలుఁడై యెలమిం | గురురా జేతెంచెఁ గొలువు కూటంబునకున్. |
137 |
| వ. | వచ్చి దుశ్శాసన ప్రముఖ నిఖిలసహోదర పరివృతుండై యుండి. | 138 |