| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | విరాటపర్వము - ప్రథమాశ్వాసము |
| క. |
గారవమున నిజదేశా | చారముమై నల్లియున్న జడ యగు కబరీ భారంబు విచ్చి తుఱుముగ | సైరంధ్రీ జాతివేష సముచిత భంగిన్. |
290 |
| క. |
వలపలి దిక్కున కించుక | మలఁగంగాఁ దుఱు మిడి, కుఱుమాపుడుఁ బుట్టం బలవడఁ గట్టి జరఠవ | ల్కలమున నెవ్వీఁగుఁజన్నుఁగవ గప్పి తగన్. |
291 |
| క. |
పరిచారికాత్వరేఖా | పరిణతి దనమేన నచ్చువడ భావనకుం దిరమై తలకొను నంతః | కరణముతోఁ బురము ద్రుపదకన్యక చొచ్చెన్. |
292 |
| వ. | ఇట్లు సొత్తెంచి. | 293 |
| సీ. |
పఱమొయిల్ గప్పినఁ బాడఱి నునుఁగాంతి | గదలిన యమృతాంశు కలయుఁ బోలెఁ బెనుమంచు మీఁదఁ బర్విన వికాసము దప్పి | చెలువు గుందిన సరోజిని విధమున, ధూమంబు వొదివిన దుఱఁగలి మెఱుఁగులు | నలఁగి మాసిన దీప కళిక పగిది, ధూళి పైఁబొరసినఁ దొంగలించుట మాని | లావణ్య మెడలిన లతిక భంగి, |
|
| తే. |
గంధకారికా వేషంబు కతన మూర్తి | యుజ్జ్వలత్వంబు మఱువడియుండఁ బాండు తనయ మహిషి యంచితగతిఁ జనఁగ రాజ | వీథిఁ బౌరజనంబు లవ్వెలఁదిఁ జూచి. |
294 |
| ఉ. |
‘రోహిణి యొండె, నొండెను నరుంధతి గాక మనుష్య జాతియే? యీ హరిణాక్షి చెల్వమున యేడ్తెఱ చూడ్కుల నాఁచికోల కా దాహితగౌరవం బగు; శుభాంగము తేజముఁ జూడ బుద్ధి సం దేహముఁ బొందుచున్నది; సతీజను లిట్టిరె యెజ్జగంబులన్!’ |
295 |
| వ. | అనుచు నంతంతం జేరి. | 296 |
| క. |
‘నీ వెవ్వ, రేమి పనికై | యే వలనికిఁ బోవుచునికి యిది?’ నావుడు న ద్దేవియు సౌముఖ్యము స | ద్భావంబును దోఁప నుచితభంగిం జెప్పెన్. |
297 |
| ఆ. |
‘ఏను గట్టువాలుదాన; నా కెవ్వరు | కడుపు కూడు వెట్టి, కట్టఁ జీర యిచ్చి సాకతమున నేలుదు రట్టి వా | రలకుఁ బనులు సేసి మెలఁగు బుద్ధి. |
298 |
| క. |
వచ్చితి’ ననవుడు విని జను | లచ్చెరువును సందియంబు నడరెడు మదితో ‘నిచ్చెలువ గడుపు కూటికి | నెచ్చటనే నిలుచునట్టె! యిది పలుకగునే?’ |
299 |
| వ. | అనుచుం గనుంగొనుచు ముసురుకొని చనుచుండం బాంచాల రాజనందన రాజమందిరంబు చక్కటికి నరుగు నవసరంబున. | 300 |
| క. |
ముదమొదవ రమ్యహర్మ్యము | తుది నిలువునఁ బ్రణయసఖులతోడ విహారా స్పదమగు నెలవున మెలఁగెడు | సుదేష్ణ తజ్జాలకములఁ జూచెం బ్రీతిన్. |
301 |
| వ. | ఇత్తెఱంగున మత్స్యరాజమహిషి ద్రౌపది నాలోకించి కుతూహలంబున. | 302 |
| ఉ. |
‘ఎక్కడనుండి యెక్కడకు నేఁగెడినో యిది యొక్క కాంత రూ పెక్కుడు; పెంపు సొంపు మన కేర్పడుచున్నది: దా వినీతయై స్రుక్కుచు నీచభామినుల చొప్పునఁ బల్కెడుఁ బౌరులుం గడున్ వెక్కసమంది చూచెదరు; వేగమ తోడ్కొని రండు నెమ్మితోన్.’ |
303 |
| క. |
అని పలికి పనుపఁ బ్రౌఢాం | గన లిరువురు వోయి ద్రుపదకన్యకతో ని ట్లనిరి; ‘విరాటుమహిషి నినుఁ | దనపాలికిఁ బిలువఁ బంపె దయ పెంపెసఁగన్.’ |
304 |
| వ. | అనవుడు. | 305 |
| క. |
తన తలసీర యరసి య | వ్వనితారత్నంబు వినయవైభవము సతీ తను వొందిన చందంబునఁ | జనియెం గేకయసుతానుచారికలబడిన్. |
306 |
| వ. | ఇవ్విధంబునం జని సౌధంబు నుపరిభాగం బెక్కి . | 307 |
| సీ. |
పదతలంబుల కెంపు పరఁగిన తలము కుం | కుమలిప్త మైన చందము వహింప, నంగంబు నునుఁగాంతి యడరిన గోడలు | వేదులు మణిమయ విధము నొందఁ, గనుఁగవ మెఱుఁగులు గదిరిన ముందఱఁ | బుష్పోపహారంబు పొలుపుఁ దాల్ప, వేనలికప్పు పర్విన మీఁదు నీల దు | కూలంబు మేల్కట్టు కొమరు వడయఁ, |
|
| తే. |
దాను జొచ్చిన కతన మత్స్యక్షితీశు | నింట నిమ్మెయిఁ గ్రొత్తయొ ప్పెసక మెసఁగ న మ్మహాదేవి యున్నెడ కల్లనల్లఁ | బాండురాజతనూభవపత్ని యరిగె. |
308 |
| వ. | కేకయరాజనందనయును. | 309 |
| చ. |
కనుఁగొని గారవంబును మొగంబునఁ గేలఁ బురఃప్రసారముం దనువున నమ్రభావమును దంతమరీచుల సామి నిర్గమం బును దనలోఁ గడల్కొనఁగ భూరితరాదరరేఖ, “నిందు ర.” మ్మనవుడు నంత నంత ద్రుపదాత్మజ సేరి వినీతి నిల్చినన్. |
310 |
| క. |
ఆపాదమస్తకము త | ద్రూపము వీక్షించుచుం గుతూహల మడరన్ భూపాల మహిషి యిట్లను | నా పొలఁతుకతోడ నుచితమయ్యెడి భంగిన్. |
311 |
| ఆ. |
‘ఏది కులము? నామ మెయ్యది? యెవ్వరి | దాన? వేమి పనికిఁ బూని యిప్పు డెచటు బుద్ధిఁదలఁచి యేఁగెద? వింతయు | నెఱుఁగఁ జెప్పుమాకు మెఱుఁగుఁబోఁడి!’ |
312 |
| వ. | అనిన విని యాజ్ఞసేని యిట్లను; ‘నేను సైరంధ్రీజాతి సంభూత; నభిధానంబు మాలిని; పురుషపంచక సనాథనై యుండుదు; నొక్కకారణంబున నుద్ధతులగు విరోధులచేతం బతుల సన్నిధిం దలవట్టి యీడ్వంబడి, వనంబున కరిగి, వ్రతంబుమై వల్లభసహితంబుగా వన్యాహారంబులం గాలంబు గడపుచు బ్రహ్మచర్యంబు నడపితి; నిటమీఁద నియమాచరణంబునకు నొక్క సంవత్సరంబు గొఱంత కలదు. నీవు ధర్మవర్తిని వని వినుటం జేసి నానేర్చు పనులవెంట నీకడ నిలువం దలంచి యిందు వచ్చితి’ ననవుడు సుదేష్ణ యిట్లనియె. | 313 |
| క. |
‘సుర గరుడ ఖచర విద్యా | ధర కిన్నర యక్ష సిద్ధ తరుణులలో నీ వరయఁగ నొక్కత వగు ది | ప్పురికిం జనుదేరఁ గతము బొంకక చెపుమా!’ |
314 |
| క. |
అనుటయు దరహసితము మో | మునకుఁ దొడవుగాఁగఁ బలుకు ముద్దియ ‘యేఁ గృ ష్ణునిదేవి సత్యభామకుఁ | బనిసేయుదుఁ దొల్లి, పిదపఁ బాంచాలికడన్. |
315 |
| తే. |
తగవుమైఁ బరిచారికా ధర్మములకు | నెల్లఁ జాలి వర్తించితిఁ; దల్లి! వినుము నాకుఁ బ్రాణంబు ప్రాణమై నన్నుఁ దన్న | కాఁగ భావించి యాదేవి గారవించు. |
316 |
| వ. | నీవును. | 317 |
| క. |
నీచము లయ్యెడు పనులకు | నా చాలమి యెఱిఁగి మన్ననకుఁ బాత్రముగా నీ చిత్తంబునఁ గైకొని | యాచారము తప్పకుండ నరయుము నన్నున్’. |
318 |
| వ. | అని యిట్లు దేవజాతి యను సందియంబు వాయం బలికి మఱియును. | 319 |
| క. |
‘కలపములు గూర్ప బహువిధ | తిలకంబులు వెట్ట వింత తెరువునఁ బలు పు వ్వులు గట్టి కట్టి ముద్దుగఁ | దల ముడువఁగ సరులు గ్రువ్వఁ దద్దయు నేర్తున్.’ |
320 |
| మ. |
అనినం గేకయరాజనందన ప్రభూతాశ్చర్యయై యిట్లనున్ ‘విను! నీ రూపము చూచి మా నృపతి యువ్విళ్లూరు; నే నెమ్మెయిం బనిగొందుం? దగ నింతులుం దగిలి నీపైఁ జూడ్కి నెక్కొల్పి నె మ్మనముల్ విస్మయమందఁ జూచెదరు భామా! పల్కు లింకేటికిన్? |
321 |
| క. |
దుర్భర యగు నినుఁ గర్కటి | గర్భము ధరియించునట్లు గైకొని నాకై నిర్భర విధ్వంసదశా | విర్భావము దెచ్చుకొనుట వెరవై యున్నే?’ |
322 |
| ఆ. |
అనిన ‘నీ తలంచినట్ల కా; దేర్పడ | వినుము! నాదు పతులు వెరవు లావు నలఘు విక్రమంబుఁ గలుగు గంధర్వు; లే | మఱరు నన్ను నొక్క మాత్ర యైన. |
323 |
| క. |
నీచమతి నన్ను నెవ్వఁడు | సూచిన నా రాత్రిలోనఁ జూతురు దెగఁ దా రా చపలు హరిహరాదులు | గాచిన బలవిక్రమము లఖర్వములైనన్. |
324 |
| క. |
బంధుశతంబులు శౌర్యమ | దాంధములై శక్తి సంపదాభీలములై సింధురసదృశత నున్నను | సంధుల సంధు లెడలించి చంపుదు రతనిన్. |
325 |
| వ. | కావునఁ బురుషులు నాకడం దేఱి చూడను వెఱతు; రదియునుంగాక. | 326 |
| క. |
నా చిత్తము తాదృశులకు | గోచరమే? యస్మదీయ కులజన సంశి క్షాచార మహిమ యట్టిది | యే? చెప్పకు తద్విధాతిహీన వచనముల్. |
327 |
| చ. |
మనమున నూఱడిల్లు; మనుమానము మానుము; నన్ను నేలు; మే పనులు నుదాత్త నాగరిక భంగుల నీమది కెక్కు నట్లు నే ర్పును భయభక్తులున్ మెఱయ రూపుగఁ జేసెదఁ; దద్‌జ్ఞులైన స జ్జనులు నుతింప వర్తనము సాధులు వృద్ధులు మెచ్చఁ జల్పెదన్. |
328 |
| క. |
ననుఁ గుచ్చితంపుఁ బనులకుఁ | బనుపక, యెంగిలికి లోనుపఱుపక తగు మ న్ననతోడ నరయు వారల | కనురాగము నెఱపి నడతు రస్మత్పతులున్.’ |
329 |
| ఆ. |
అనిన సంతసిల్లి యద్దేవి సైరంధ్రి | నూఱడిల్లఁ బలికి యునిచికొనియె; నంతిపురము చరిత కలవడ మెలఁగుచు | నుండె న వ్వధూటియును ముదమున. |
330 |
| క. |
ఇవ్విధమున నయ్యేవురు | నవ్వెలఁదియు సకల జనుల కజ్ఞాతముగా న వ్విరటు ప్రోలఁ బ్రమదము | నివ్వటిల వసించి రుచిత నిభృతత్వమునన్. |
331 |
| వ. | అనిన విని ‘వారల వర్తనం బటమీఁదఁ జెల్లిన తెఱం గెఱింగింపు’ మని యడిగిన. | 332 |