| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | విరాటపర్వము - ద్వితీయాశ్వాసము |
| క. |
శ్రీమదపాంగాలోకన | ధామసకృత్సంగ రూఢ తాదృశ విభవో ద్దామాశ్రితలోకా! లో | కామయ నిర్హరణ నిపుణ! హరిహరనాథా!’ |
1 |
| వ. | దేవా! వైశంపాయనుండు జనమేజయున కి ట్లనియె; నట్టియెడ ధర్మసూనుండు సభాజనంబుల యుల్లంబులు రంజిల్ల రాజునకు వినోదంబులు వివిధోదాత్త ప్రకారంబులఁ జలుపుచు, నొక్కొక్కమాటు మధుర ప్రసంగంబుగా నాడిన నెత్తంబున గెలిచిన విత్తంబులు తమ్ముల కొసంగుచుండు; వాయునందనుండు వంటకు మిగిలిన మాంసంబు లమ్మునెపంబున నిచ్చలు సహోదరులకు నిచ్చుచుండు; వివ్వచ్చుండు సంగీత ప్రసంగంబున మెచ్చువడసిన కనకాంబరాదులు సోదరులకుం జేర్చుచుండు; నకులుండు దురంగంబుల గ్రాసంబులం గనిన ధనంబులు తోడంబుట్టువులకుఁ బెట్టుచుండు; సహదేవుండు గోవులం జూచి భూవల్లభుండు సంతసిల్లిన సమయంబున సముపార్జితంబు లగు పదార్థంబులన్నియు నన్నలవశంబు సేయుచు వారలకు గోరసంబులం దుష్టి సలుపుచుండు; ద్రౌపది త న్నరసికొని తిరుగుచున్న వీరలం గన్నులారం జూచుచు నుచితంపు నడవడి మెలంగుచుండు. | 2 |
| తే. |
ఇట్లు దమతమ వర్తిల్లు నెడల సకల | జనములకు హృదయానురంజన మొనర్చి తాల్మి, పుయిలోట, యడఁకువ, తగవు మెలపు | నెఱితెఱంగు, వాటింపంగ నేర్పు గలిగి. |
3 |
| క. |
ఉన్నతఱి వివిధదేశో | త్పన్నులు నద్భుతవిధాయి బలవిక్రమ సం పన్నులు నగుమల్లులు విభ | వోన్నతుఁడగు విరటుపాల నుద్భటవృత్తిన్ |
4 |
| క. |
తమలోన మాటలాడెడు | సమయంబున నొక్క రుఁడు విశాలోరస్కుం డమితబలుఁడు, పంచానన | సమమూర్తిస్ఫూర్తి యధిక సంరంభమునన్. |
5 |
| వ. | అన్నరపతి కట్టెదుర నిల్చి మ్రొక్కి భుజాస్ఫాలనంబు సేసి యిట్లనియె. | 6 |
| తే. |
‘నేల నాలుగు సెఱఁగుల నృపుల కొలువు | లందు నేను వర్తించితి నవనినాథ! యగ్గలించి, నా యెదుర బాహప్పళించి | కడఁగఁజాలెడు మల్లులఁ గాన నెందు.’ |
7 |
| చ. |
అనునెడ వాని యుగ్రసమదాకృతియుం, బటువాక్యవృత్తియుం, గని, విని, మల్లులెల్ల భయకంపితమూర్తులు దాల్చి మాఱువ ల్కను, గనువిచ్చి చూడను, మొగం బెగయింపను జాలకున్న న జ్జనపతి వేడ్క మ్రోడుపడు చందము గాంచి యుధిష్ఠిరుం డనున్. |
8 |
| క. |
‘వీనికి మార్కొనఁజాలెడు | దానికిఁ దగువాని ధర్మతనయుని పురిలో నానానియుద్ధలంపటు | నే నొక్కనిఁ గంటి నిపుణుఁ డిందుల కతఁడున్. |
9 |
| క. |
మన బానసీఁడు వలలుం | డను శూద్రుఁడు నాకుఁ దెల్ల; మధిక బలుల నో ర్చినవాఁ డనేక మల్లుల | నిను మెచ్చింపంగఁ జాలు; నిజ మిది యధిపా! |
10 |
| క. |
అనవుడు భూపతి పిలువం | బనిచె; నతని నతఁడు నపుడ భయభక్తులతోఁ జనుదెంచి, మల్లవర్గముఁ | గని మై వెఱుగంగ నిలిచెఁ గౌతూహలియై. |
11 |
| వ. | ఇట్లు నిలిచిన పవనతనయు నవలోకించి, యవనీవల్లభుం డమ్మల్లముఖ్యుం జూపి, ‘యితనితోడి యుద్ధంబునకు సన్నద్ధుండవు గ’ మ్మనిన నతండును ధర్మతనయు కనుసన్న గనుంగొని యమ్మత్స్యవిభునకు వినయంబుతో నిట్లనియె. | 12 |
| తే. |
‘అధిప! ధర్మజుపాల నున్నప్పు డతని | వేడుకకుఁ దగఁ బెనఁగుదు వింతలైన జెట్టిమల్లులతో, నిప్పు డట్టువోలె | నీదు వేడ్కకుఁ బెనఁగెద నేర్చినట్లు.’ |
13 |