| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | విరాటపర్వము - ద్వితీయాశ్వాసము |
| శా. |
‘దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాపస్ఫుర ద్గర్వాంధ ప్రతివీర నిర్మథన విద్యాపారగుల్ మత్పతుల్ గీర్వాణాకృతు లేవు రిప్డు నిను దోర్లీలన్ వెసం గిట్టి గం ధర్వుల్ మానముఁ బ్రాణముం గొనుట తథ్యం బెమ్మెయిం గీచకా!’ |
55 |
| తే. |
అనుడు నతఁ డిట్టు లనియె ‘నా యతుల బాహు | బలముఁ జెనయంగ భవదీయ పతుల కారు మూఁడులోకంబులందు నెవ్వాఁడు లేమి | నిక్కువం బింత నమ్ముము నీరజాక్షి!’ |
56 |
| వ. | అనిన విని సైరంధ్రి సైరణ దక్కి ధిక్కరించి యిట్లనియె. | 57 |
| క. |
‘చనుఁ జనదని చూడక యం | దని మ్రాఁకులపండ్లు గోయఁ దలఁచుట హితమే? మును చెడిన రావణాదుల | విని యెఱుఁగవె యెన్నఁడును వివేకవిహీనా!’ |
58 |
| తే. |
ఇవ్విధంబునఁ బలికిన యింతి పలుకు | గాన నేరక తమ యప్పకడకు మగుడ నరిగి నెవ్వగ మనమునఁ బిరిగొనంగఁ | జిన్నఁబోయిన మొగముతో సింహబలుఁడు. |
59 |
| క. |
చని మదనాగ్ని జ్వాలలు | దనుకఁగ నిట్టూర్పు గాడ్పు దందడి నిగుడం దను నూరార్పఁగ సఖి దొర | కొనమికి వెనుఁబడుచుఁ కీచకుం డా సతితోన్. |
60 |
| వ. | ‘ఏ నప్పుడు నీకుం జూపి యన్వయ నామధేయంబు లడిగిన యప్పొలఁతి వలనం జిక్కి చిత్తం బుత్తల పడుచున్నయది; యిటమీఁద నీవ యెఱుంగు; దయ్యింతి యింతసేపు నీ చేరువనుండి యిప్పుడెట మెలఁగె?’ నని యడిగిన విని, యతని వేగిరపాటు చూచి శిరఃకంపంబు సేయుచు సుదేష్ణ నిజాంతర్గతంబున. | 61 |
| తే. |
‘రాగరసమగ్నుఁడయ్యె సైరంధ్రిఁ జూచి | యకట! దీన నింకేమి యపాయమగునొ? వలదు తగదన్న నుడిగెడు వాఁడె వీఁడు? | మాయదైవమ! యే నేమి సేయుదాన? |
62 |
| వ. | అయిన నా నేర్చుకొలందిఁ దగిన తెఱంగున వారించి చూచెదంగాక!’ యని యూహించి యిట్లనియె. | 63 |
| సీ. |
‘లలితంబు లగు మట్టియల చప్పు డింపార | నంచకైవడి నడ నల్ల వచ్చి, యెడ మేని నెత్తావి సుడియంగఁ బయ్యెద | సగము దూలించి పై మగుడఁ దిగిచి, సోలెడు నెలదీఁగె లీలఁ గ్రాలుచు వింత | చెలువంబు దలకొనఁ జేరి నిలిచి తెలిగన్నుఁగవకు నెచ్చెలియైన లేఁతన | వ్వొలయంగ సరసంపుఁ బలుకు పలికి, |
|
| తే. |
మెఱయు చెయ్వుల రాగంబు మెయికొనంగ | నెడఁద సొగయించు మాటల నెలమి మిగుల నిన్ను ననురక్తిఁ గొలుచు నన్నెలఁత లుండ | నీరసాకార సైరంధ్రిఁ గోరఁ దగునె?’ |
64 |
| వ. | అనిన నప్పలుకులదెస ననాదరంబు సేయుచు నచ్చేడియం జూచి కీచకుం డిట్లనియె. | 65 |
| క. |
‘నా కొలువు వార కా; ర | న్నాకేశుం గొలుచు నంగనలలోనైనన్ లేకునికి నాకుఁ దెల్లం | బా కొమ్మకు నీడు పోల్పనయ్యెడు సుదతుల్. |
66 |
| సీ. |
గండుమీలకుఁ బుట్టి కాము బాణములతోఁ | గలసి యాడెడు నట్టి కన్నుఁ గవయు, బిస కాండముల శిక్షఁ బెరిఁగి లేఁ దీఁగల | మెచ్చక యున్నట్టి మృదు కరములుఁ, జిగురులతో సంధి సేసి యంబుజముల | పై నెత్తి చను నట్టి పదతలములుఁ, గలకంఠములచేతఁ గఱచిన విద్య వీ | ణల కిచ్చునట్టి తిన్నని యెలుంగు, |
|
| తే. |
నత్తెఱంగున రేఖయు, నవ్విధంబు | గరువ చందంబు, నమ్మెయి కలికితనము, నట్టి చెన్నును సైరంధ్రియంద కాక | కలవె యొరులకు? నెఱుఁగక పలికి తబల! |
67 |
| వ. | కావున నా యెలనాఁగ నేమి యుపాయంబుననైన నన్నుం జేర్పవైతేని కందర్పదర్పంబున నలందురి వందుదు’ ననిన నవ్వెలంది వెండియు నిట్లనియె. | 68 |
| తే. |
‘ఆయురైశ్వర్య కీర్తుల నపహరించుఁ | బరసతీ సంగమము; ధర్మపథమునందుఁ బరఁగువారలు పరిహరింపంగఁ గనియు | వినియుఁ దెలియవె యిది దుర్వివేక మగుట. |
69 |
| సీ. |
పతి యెఱింగినఁ దన ప్రాణంబుపై వచ్చు | నను భయంబున నుల్లమదరు చుండ, జనులు గాంచిన మానుషము దూలుఁ దన కను | పుయిలోటమున మోము పుల్లగిలఁగ, బోటికిఁ దోఁచినఁ బొలియుఁ దేఁకువ యను | వెగడునఁ జెయ్వులు వీడుపడఁగ, బంధుల కగపడ్డఁ బాయు నన్వయ మను | కలఁక మైఁ జెమటలు క్రమ్ము దేరఁ, |
|
| తే. |
గ్రీడ దెసఁ గౌతుకం బురియాడ రతుల | చవులు గొనియాడ నేరని జార పొందు హృదయమున కింపు చేయమి నెఱుక గలుగు | వారు దీని సుఖంబుగాఁ గోర రెందు. |
70 |
| వ. | అదియునుంగాక. | 71 |
| క. |
బలవిక్రమ సంపన్నులు | గల రేవురు దానిపతులు గంధర్వులు; వా రలఁ దలఁచిన నా చిత్తము | దలఁకెడు; నది యేల నీకుఁ దమ్ముఁడ! చెపుమా! |
72 |
| తే. |
కాని తెరువునఁ బోయినఁ గలుగునయ్య! | బ్రదుకు? చవి యెంతయైన నపథ్యములకు వేడ్క సేయుదురయ్య వివేకు? లెవ్వి | ధమున నా బుద్ధి వినవయ్య తమక ముడిగి.’ |
73 |
| క. |
అనవుడు నమ్మాటలు దన | మనమునకు సహింపరామి మల్లడిగొనుచున్ మనసిజ పరతంత్రత ని | ట్లని పల్కె సుదేష్ణతోడ నతఁ దుద్ధతుఁడై. |
74 |
| మ. |
‘వనితా! యే నొక పల్కు పల్కెదఁ జతుర్వారాశి మధ్యంబునన్ ఘనబాహాబల మొప్ప నన్ను నెదురంగా నొక్కఁడున్ లేమి యె వ్వనికిం దెల్లము గాదె! దాని మగలన్ వజ్రాహతిం గూలు శై ల నికాయం బన మద్భుజాసమదలీలన్ గీ టడంగించెదన్. |
75 |
| ఉ. |
బుద్ధులు సెప్పు టెల్ల నటు వో విడు; మెమ్మెయి నైన సౌఖ్యసం సిద్ధి యొనర్పు నాకు; నెడ సేసినఁ దాపము రూపుమాపు; నా వృద్ధియ కోరుదేని ‘నవివేకివి నీ’ వని నన్ను ని ట్లసం బద్ధములైన వాక్యములు పల్కక వే పిలిపింపు కోమలిన్.’ |
76 |
| తే. |
అనుచు దైన్యంబు నొందెడు నాననంబు | తోడ దిగ్గన లేచి యత్తోయజాక్షి చరణ పీఠంబుకడఁ జక్కఁజాఁగి మ్రొక్కి | యున్న నద్దేవి కనుఁగొని చిన్నఁబోయి. |
77 |
| ఉ. |
‘ఆవల వచ్చు నాపదల కన్నిటి కోర్చి లతాంగిఁ గూర్చి కా కీ వెడ మాటలన్ మరలఁ; డెన్ని విధంబులఁ జూపి చెప్పినం గావల మైన వీఁడు తగు కార్యము వట్టునె? వీని కెమ్మెయిం జావు నిజంబు మన్మథునిశాత శరంబులనైన నక్కటా!’ |
78 |
| క. |
అని మనమునఁ దలపోయుచుఁ | దన తమ్ముని నల్లనెత్తి దందడి దొరఁగం జనుదెంచు నశ్రుపూరము | కనుఁగవలో మ్రింగికొనుచుఁ గామిని పలికెన్. |
79 |
| ఆ. |
‘ఇంత దలరనేల? యెమ్మెయినైనను | కొమ్మ నలవరించి కూర్చు టరుదె? యుమ్మలంబు దక్కి యూఱటతోడ నీ | వేఁగు; మసలవలవ దింక నిచట. |
80 |
| క. |
ఆసవమున కని నీదు ని | వాసమునకు దివములో నవశ్యంబును నే నా సుదతిం బుత్తెంతు ని | జాసక్తి ఫలింపఁ గొఱలు మభిమత కేళిన్.’ |
81 |