| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | విరాటపర్వము - ద్వితీయాశ్వాసము |
| ఉ. |
‘న న్నిటు లాదురాత్ము సదనంబునకుం జనుమన్నజంత కీ బన్నములన్నియుం దెలిపి ప్ర య్యిడనే’ యని పోయె నార్తయై కన్నుల బాష్పపూరములు గ్రమ్మఁగ మోమున దైన్యమొందఁగా నన్నలినాక్షి తొట్రిలుచు నంగము దూల సుదేష్ణపాలికిన్. |
154 |
| తే. |
చనిన, నయ్యెలనాఁగయు సంభ్రమంబుఁ | దెచ్చికొని తానెఱుంగని తెఱఁగు దాల్చి శాఠ్యమున నుమ్మలించి పాంచాలితోడ | నెలుఁగువేఱొక భంగిగా నిట్టులనియె. |
155 |
| సీ. |
‘ధరణీ పరాగంబు వొరసి ధూసరితమై | చేడియ! నీ మేను చెన్నుదఱిఁగెఁ; జిత్తంబు తలపోఁతచే వాడు పొదవిన | చెలువ నీ నెమ్మోము చిన్నఁబోయెఁ; బ్రస్వేదమునఁ దోఁగి ఫాలంబుతో నంటి | యుగ్మలి! నీ కురు లొప్పు కుందెఁ; గన్నీరు వఱ్ఱొడ్డి కాంతి యెంతయుఁగొన్న | వెలఁది! నీ కనుఁగవ విన్ననయ్యె; |
|
| ఆ. |
నేది కారణమున నెవ్వ రెచ్చోట నీ | కేమి కీ డొనర్చి రెట్టిపాటి సాహసికులొ వారిఁ జంపుదు నొంపుదు | భంగపఱుతు నిడుమపఱుతుఁ జెఱుతు. |
156 |
| వ. | ఇత్తెఱంగు నాకుం జెప్పు ’మనిన ’నీ వెఱింగియు నెఱుంగమి భావించిన, నింక నే మని పలుకంగలదాన? నైనను విను’ మని సైరంధ్రి యిట్లనియె. | 157 |
| మ. |
‘ నను నీ వప్పుడు సూతమందిరమున న్మద్యంబుఁ దెమ్మన్నఁ బో యిన నాతం డవినీతి సేసినను జేయీ కేను మత్స్యావనీ శుని యాస్థానము దిక్కు వే చనిన నచ్చోఁ దీవ్రకోపంబున న్వెనుకం గూడఁగ ముట్టి పట్టికొని తన్నెం బల్కు లింకేటికిన్?’ |
158 |
| వ. | అని యేర్పడం బలికిన. | 159 |
| ఉ. |
‘ఖేదము దక్కు మీ క్షణమ కీచకు దండితుఁ జేసి నీకు నా హ్లాద మొనర్తు నే’నని నయంబునఁ గేకయరాజపుత్రి య త్యాదరవృత్తితో ననునయం బొనరించిన నయ్యసత్య సం వాదిని పూన్కి పాండుసుతవల్లభ యాలము సేసి యిట్లనున్. |
160 |
| క. |
‘నీ వింత యలుగ నేటికి? | నా వంతయుఁ బౌరజన మనఃఖేదము నొ క్కావంత ద్రిక్కకుండఁ గ | లావంతులు మత్పతులు గలరు పగఁ దీర్పన్’. |
161 |
| క. |
అనిన సుదేష్ణయుఁ దత్పరి | జనములు వెఱఁబొంది యెన్ని సాంత్వనములు సె ప్పినఁ దేఱద, మజ్జ్జన భో | జనములకుం జొరద ద్రుపదసంభవ యెట్లున్. |
162 |
| వ. | అట్టియెడ సుదేష్ణసేయునది లేక నివ్వెఱఁగంది యుండెఁ; దక్కటి యంగనలును గీచకుని నీచత్వంబు దలంచి వాని చేటున కొడంబడిరి; పరిభవానల సంతప్తయైనపాంచాలి నిజశయనస్థానంబునకుం జని తల్పంబుపై మేను వైచి, యపాంగంబులం దొరంగు కన్నీరు చెవుల కొలంకులు నిండ నెవ్వగలు నివ్వటిలం దలపోయుచుండి. | 163 |
| క. |
‘ప్రబలుం డారయ నా సిం | హబలుం; డాతని జయింప ననిలతనయు బా హుబలంబ కూడఁ దగు; దై | వబలం బును నాతనికి నవశ్యముఁ గల్గున్.’ |
164 |