| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | విరాటపర్వము - తృతీయాశ్వాసము |
| చ. |
అని పలవించు నయ్యెలుఁగు లాపవమానతనూజుఁ డేర్పడన్ విని, మది ‘నాదు వల్లభకు వీండ్రును గ్రమ్మఱ నింతసేసిరే!’ యనుచు సరోష సంభ్రమత నాయితమై వెసఁబాఱి వప్ర లం ఘన మొనరించె గుప్తముగ గ్రక్కున ముట్టెడుదానికిం దగన్. |
23 |
| తే. |
ఇట్లు లంఘించి పోయి పరేతభూమి | యొద్ద నలుదిక్కులును జూచి యొక్క యున్న తావనీజంబు వెఱికి రౌద్రాతిరేక | మడర భుజశిఖరంబునయం దమర్చి. |
24 |
| మ. |
వికట భ్రూకుటి ఘోర ఫాలకలిత స్వేదోద్భటుండుం, జల ద్వికృతోష్ఠద్వయుఁడుం, బ్రవర్ధన దశావిర్భావ సంభావితాం గకుఁడుం, జిత్త విదాహదోహల సమగ్రక్రోధ వేగుండు నై బకవిధ్వంసకుఁ డయ్యెడన్ నిలిచె శుంభన్మూర్తి విస్ఫూర్తితోన్. |
25 |
| వ. | తదనంతరంబ. | 26 |
| ఆ. |
సూతుశవముతోడ నేతెంచు నెరవులు | దవ్వు దవ్వులన యుదగ్రరూప కలితుఁడైన భీముఁ గనుఁగొని నడవక | నిలిచి దంత నంతఁ గలఁగఁబాఱి. |
27 |
| మ. |
‘ఇదె గంధర్వులు వచ్చి ముట్టికొని; రిం కెట్లొక్కొ! యంచున్ భయం బొదవం బల్లములందు డాఁగియు, సమీపోర్వీజముల్ ప్రాఁకియుం, జెదరం బాఱియు, నీరు సొచ్చియును, నిశ్చేష్టం బదద్వంద్వముల్ గుదివడ్డం బెగడొందియున్ భరిత సంక్షోభాత్ములై రత్తఱిన్’. |
28 |
| ఉ. |
సూతులు భీతులై ద్రుపదసూతి సమేతముగాఁగ నగ్రజ ప్రేతమువైచి, వీటి దెసఁ బెల్లుగఁ బాఱఁ దొడంగినన్ వడిన్ వాతసుతుండు ముట్టికొని వారి బడల్పడ వ్రేసి యందఱం జేతులతీఁట వో నుఱుము సేసె విశృంఖల విక్రమంబునన్. |
29 |
| వ. | ఇవ్విధంబున నూటయేవు రుపకీచకులను సమయించి శమిత క్రోధుండై వచ్చి, పాంచాలికి బంధ మోక్షంబు గావించి, ‘యింక నిశ్చింతంబున సుదేష్ణ మందిరంబునకుం జను‘మని యవ్వెలందిని వీడుకొలిపి, తానును వేఱొక మార్గంబున మహానస గృహంబున కరుగుదెంచెఁ; దత్సమయంబున విరాటుండు కీచకానుజులు గంధర్వులచేత నిరవశేషంబుగా మృతిం బొందిరని విని, చకితచేతస్కుం డగుచు సహోదర మరణ శోకా యత్తచిత్త యయిన జీవితేశ్వరి నుచితాలాపంబుల ననునయించి యిట్లనియె. | 30 |
| ఆ. |
‘చంద్రవదన! యింక సైరంధ్రి నిచ్చోటు | వాపవలయు నేమిభంగినైనఁ; గాన నాదు పలుకుఁగాఁ జెప్పు వెడలుట | కనుగుణముగ నమ్మృగాక్షితోడ. |
31 |
| ఆ. |
పురుషు లా లతాంగి పొరువునఁ బోయినఁ | జేటువచ్చుఁ గానఁ జెప్ప నేను వెఱతు; నాఁడువారు వెరవుతో మృదువచో | రచనఁ జెప్పు టరయ నుచిత వృత్తి. |
32 |
| ఉ. |
ఆ కమలాక్షి రూప మహిమాతిశయంబు మనోహరంబు; భో గైక పరాయణుల్ పురుషు; లంగజుఁ డప్రతికార చేష్టెత స్వీకృత లోకుఁ; డట్లగుటఁ జేటు పురంబునవారి కెప్పుడుం గా కెటు లుండు? నిట్టి యవగాఢపుఁ బొత్తు మనంగ వచ్చునే?’ |
33 |
| క. |
అని నిశ్చయించి పలికిన | విని కేకయరాజపుత్రి విభు తలఁపు మనం బునకుఁ బ్రియం బగుటయుఁ గై | కొని యాపని యట్లచేఁతకుం బూనెఁ దగన్. |
34 |
| క. |
అంతం గుంతీనందన | కాంతా చింతా మహాంధకారముతో న త్యంతంబు మచ్చరించెనొ | సంతమసం బనఁ బ్రభాత సమయం బయ్యెన్. |
35 |
| వ. | పదంపడి పద్మినీ ప్రమోద సంపత్కరుం డగు నరుణకిరణుం డుదయించె; నట మున్న పాంచాలి సచేలస్నానంబుసేసి, రాగాది వికార నిరాసనంబునం బ్రసన్నయయిన బుద్ధియుంబోలె సింహబల ప్రభృతి కీచక విధ్వంసనంబునం దెలివొంది మంద మందయానంబునం బురంబు సొచ్చి రాజవీథి నరుగు దెంచునప్పుడు. | 36 |
| సీ. |
‘మన కీచకుల కెల్ల మారియై పుట్టిన | సుదతి పోయెడు’ నని చూచువారు; ‘నద్దిరా! నీకుఁ గ్రొ వ్వఱుగదేఁ జూతుగా’ | కని తలసూపక యడఁగువారు; నలవోకఁ గనుఁగొని యంతరంగము బిట్టు | బెదర మాఱుమొగంబు పెట్టువారు; నెదురుగా వచ్చిన నెంతయేనియు దవ్వు | గలుగ వేఱొక త్రోవఁ దొలఁగువారు |
|
| తే. |
ముట్టఁబడి మేనఁ గంపంబు పుట్ట నొదిగి | యుండువారుఁ, గరంబున నుదర మప్ప ళించి ‘యమ్మరొ! రక్కసి’ యంచు నుల్ల | ములుకువారునై పురజనంబులు తలంకి. |
37 |
| చ. |
పులిఁ గనుఁగొన్న లేడులునుబోలె విభీతిఁ గలంగఁబాఱ న న్నెలఁతుక యంతరంగమున నిండిన హాస్యరసంబు మోముపై వెలి విరియంగనీక చని వేచి మహానసశాల వాకిటన్ నిలిచిన భీమసేనుఁ గని నెయ్య మెదం జిగురొత్తుచుండఁగన్. |
38 |
| క. |
తన యంతన యటువలుకుచుఁ | జను విధమున నతని దిక్కు చక్కని చూడ్కిం గనుఁగొనక ద్రుపదనృప నం | దన యిట్లను నిజ కృతార్థతం దెలుపుటకున్. |
39 |
| తే. |
‘కీచకులదెసఁ బుట్టిన కిల్బిషంబు | పాచి నన్ను రక్షించిన పరమ ధర్మ రతికి గంధర్వ పతికి నిరంతరంబు | భక్తి యుక్తిమైఁ బ్రణమిల్లి బ్రదుకుదాన.’ |
40 |
| వ. | అనిన విని యనిలనందనుండు నిగూఢవచన చాతుర్యధుర్యుండై యిట్లనియె. | 41 |
| చ. |
‘అతివ! యపాయముం బొరయు నప్పుడు గావక తక్కెనేని నా పతి పతియే? తలంప మగ పాడియె? లోకము పాడియే? భవ త్పతు లిటు లాచరించుట గదా భవదీయ మనోనువర్తన స్థితి కుచితంబు; వారల నుతింపఁగ నేల నిసర్గవృత్తులన్?’ |
42 |