| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | విరాటపర్వము - తృతీయాశ్వాసము |
| వ. | అనిన నాతని మాట లాదరించి భీష్ముం డిట్లనియె. | 99 |
| ఉ. |
‘నల్లవొ! నిక్క మాడె నృపనందను ముందట ద్రోణుఁ డొక్కఁడుం; దెల్లము; వారు బాహుబల ధీబల దైవబలంబు లొప్ప వ ర్తిల్లుదు; రమ్మహాత్ముల కరిష్టము లేమిట నెందు నేల పా టిల్లెడు? వారిఁ గాన్పను గడింది తదీయ మహానుభావతన్. |
100 |
| క. |
వారలును వీరలును నా | కారయఁగా నొక్కరూప యైనను గార్యం బీ రెఱిఁగింప వలయునని | కౌరవపతి నన్ను నడిగెఁ గాన యితనికిన్. |
101 |
| క. |
కలరూ పెఱిఁగింపంగా | వలయుం; జెప్పెద మదీయ వచనములు హితం బులు గాఁగ నిశ్చయ స్థితిఁ | దలఁచి యనుష్ఠింప బుద్ధి దలకొను నేనిన్. |
102 |
| సీ. |
బ్రాహ్మణభక్తియుఁ, బరహిత శక్తియు | నిర్మల మతియును, నీతి రతియు, సత్యభాషణమును, సాధుపోషణమును | జిరవితరణమును, సేవ్యగుణము, సన్మార్గరక్షయు, నున్మత్తశిక్షయు | నంచితోదయముఁ, గృపాతిశయము, బంధు సంప్రీతియు, భవ్య విభూతియు | శాస్త్రోపగమము, నస్ఖలితదమము |
|
| తే. |
సజ్జన స్తవనీయ సౌజన్యములును | ధర్మసంచిత బహు ధన ధాన్యములును గలుగు నక్షీణ పుణ్యదోహలుఁడు ధర్మ | సూనుఁ డున్న దేశంబున మానవులకు. |
103 |
| క. |
మఱియును నొక్క విశేషం | బెఱిఁగించెద; నతని యున్న యెడ గోధనముల్ మెఱుఁగెక్కి పాఁడి నేమిం | గొఱఁతవడక యుండఁజేఁపి కురియుచు నుండున్ |
104 |
| వ. | కావున నిట్టి దేశం బిప్పు డెయ్యది యగు నందుఁ గుంతీ తనయుల నరయం బనుపవలయు’ ననినఁ గృపాచార్యుం డిట్లనియె. | 105 |
| క. |
‘అరయఁగ నయ్యెడు తెఱఁగుల | నరయుట కార్యంబు; వారి నాలస్యము లే కరయునది; పెక్కు భంగుల | నరసినఁ దోఁచెదరుగాక! యది యట్లుండెన్. |
106 |
| ఉ. |
వారలు పూనినట్ల వనవాసము సల్పిరి, వీరు వేచి త మ్మారయఁగా బయల్పడని యట్లుగ నుండెడు వత్సరంబునుం జేరువ చేరువల్ గడచెఁ; జిత్తములుం గలుషంబు లమ్మహా వీరుల కీ నృపాలునెడ, వీరికి నూరక యున్కి గర్జమే? |
107 |
| క. |
అలుచైనను బగతుని దెసఁ | దలఁపు గలుగవలయుననిన, దర్పోజ్జ్వల దో ర్బలు లగు కౌంతేయుల మన | మెలమి కలిమి నచ్చి యిట్టు లేమఱ నగునే? |
108 |
| చ. |
మన బలమెంత యంతయు సమగ్ర సముద్యమ దుర్ధరంబుగా మును మును గూర్చి, తోడుపడు మూఁకలకుం దగుమైఁ గ్రమ క్రమం బున నెఱిఁగించి రాఁబనిచి, భూరి సముజ్జ్వల సైన్య జృంభణం బున వెరవొంది యున్కి కురుభూపతి కిప్పటికార్య మారయన్. |
109 |
| ఆ. |
పాండురాజసుతులు బాసమై నడవడి | గడచి కయ్యమునకుఁ గాలుద్రవ్వ కున్న యట్టులైన నన్నరనాథుతో | సంధిసేయు టొప్పు సముచితముగ. |
110 |
| క. |
ఏచి చలంబున నొంటికిఁ | జూచిన, నప్పటికి మనకుఁ జూడం గార్యం బే చందంబునఁ దెఱఁగగు | నా చాలుట కోర్వవలయు; నది యట్లుండెన్. |
111 |
| క. |
వారలు లేరట పో, పెఱ | వారలఁ దగు భంగి మనకు వశ్యులఁ జేయన్ భూరి బలయుతుల మగుటయుఁ | గారణమను టనుమతంబు గాదే మనకున్.’ |
112 |
| తే. |
ఇవ్విధంబునఁ దమ తమ యెఱుఁగు తెఱఁగు | లందఱును జెప్ప విని కురునందనుండు దగ విచారించి కార్యంబు తెగువ గాంచి | యెలమి వారలఁ గనుఁగొని యిట్టు లనియె. |
113 |
| ఆ. |
‘సింహబలుఁడు భీమసేనుండు శల్యుండు | హలధరుఁడు సమాన బలమువార, లొండొరులను గెలుచు నుత్సాహమును గల | రుద్ధతులును బాహుయుద్ధపరులు. |
114 |
| క. |
ఈ నలువుర భుజశక్తుల | తో నెనయఁగఁజాలునట్టి దోర్బల మెందుం గానము కావున వీరల | లోనన యొండొరుల కని గెలుపు సమకూరున్. |
115 |
| ఉ. |
తక్కినవార లాతనికి దవ్వుల చోటులవారు; వాయుజుం డొక్కఁడ యింక సింహబలు నుద్ధతి మాన్చిన మాన్చువాఁ; డతం డక్కడ నిల్చెఁ గావలయు; నాసతి ద్రౌపది గాఁగ నోపు; వే ఱొక్కరుఁ డాజిఁ గీచకుల నోర్వఁగఁ జాలమి మీ రెఱుంగరే? |
116 |
| క. |
గంధర్వు లను నెపంబున | నంధతమసగూఢవృత్తి ననిలసుతుఁడు గ ర్వాంధమతియైన సూతు స | బాంధవముగఁ జంపెఁ గాక, పరులకు వశమే? |
117 |
| వ. | పితామహుం డుపదేశించిన లక్షణంబు లద్దేశంబున గలిగి యుండునని విందుము; పాండవులు ప్రచ్ఛన్న వేషంబున విరటు ప్రోల వసియించినవారు గావలయు; నతండును బ్రతిభటుం డయి భంగించుచుండుం; గావున నతని పయి నెత్తిపోయి తదీయ గోధనంబుల గ్రహించిన ధర్మతనయుండును దమ్ములు నడ్డపడం బఱతెంతు; రయ్యవసరంబున మనము సమయ భంగంబు చెప్పి వారలం గ్రమ్మఱఁ బండ్రెండు వత్పరంబులు వనవాసంబు సలుపంబుత్త; మట్లైన నప్రతిహతంబుగాఁ జితురంతభూచక్రం బాక్రమించి కీర్తనీయులమై వర్తిల్లుదుము; కుంతీనందను లందులేక తక్కిన మత్స్యపతి సమస్త వస్తువులను జూఱగొంద; మదియును లాభంబ; యెల్లభంగుల నిప్పటి కిదియె కార్యంబు; మీకు నందఱకుం జూడఁబోలునేని దీని కనురూపం బగు నుద్యోగంబు సేయుం ‘డనినఁ ద్రిగర్తాధీశ్వరుండగు సుశర్మ తొలుతఁ గర్ణ దుశ్శాసనులతోఁ గొండొక ప్రసంగించి వారల యనుమతి నవనీపతితో నిట్లనియె. | 118 |
| క. |
‘కేకయ సాల్వులు తోడుగ | నా కీచకుఁ డాజి నన్ను నపజితుఁ జేసెం; జాకుండమున్న యొకపరి | నా కాతని తోడ భండనము లేదయ్యెన్. |
119 |
| ఉ. |
భంగముతోడ నున్న ననుఁ బంపు విరాటునిమీఁద; భూమికిం జెంగట నుండు నా దయిన జీతపు టూళ్ళును; సంతతంబు వా నిం గడు గాసిసేయు నతనిం జెఱుపం దఱి యయ్యె; ముట్టి స ప్తాంగముఁ జూఱఁదెచ్చెద నహంకృతి యెల్ల నడంచి వచ్చెదన్. |
120 |
| ఆ. |
ఉద్దవిడిన పసుల నూఁచముట్టుగఁ దెత్తు | నతఁడు వెనుకవచ్చి యడ్డుపడిన చోటఁ బాండురాజు సూనుల నరయుదు | నెల్ల భంగి దీని కేన తగుదు.’ |
121 |
| వ. | అనవుడుఁ గర్ణుం డిట్లనియె. | 122 |
| క. |
‘బరవసముమైఁ ద్రిగర్తే | శ్వరుఁ డిట్లను టుచిత; మింక జననాయకుఁ డె ప్పరుసున నానతి యిచ్చెను | దొర లేమని రట్లచేయఁ దుదిఁ గార్య మగున్.’ |
123 |
| చ. |
అను నినసూనుమాట విని యందఱఁ గన్గొని పెద్దలెల్ల ని న్ననుమతిసేయ సైన్యముల నన్నిటిఁ బన్నఁగఁ బంపు; రెండుమై ల నడత; మీ త్రిగర్తుల బలంబుల ముందటఁ బంచి, వానిపో యిన మఱునాఁడు పోద’ మనియెం గురునాథుఁడు దుస్ససేనుతోన్. |
124 |
| చ. |
అనుటయు ఫాలభాగ కలితాంజలియై యతఁ ‘డట్ల చేయువాఁ డ‘ ననిన, మేదినీశుఁడు దృఢం బగు నిశ్చయ మెల్లవారుఁ గై కొనుటకుఁ గార్య బోధమునకుం దగఁ జుట్టుల నున్న వారలం గనుఁగొని యాదరాధిక సగౌరవ భావనతోడ నిట్లనున్. |
125 |
| ఉ. |
‘మున్ను సుశర్మ దాను బలముం జని గోవులఁ బట్టుఁ; బట్టినన్ వెన్నడి వచ్చు మత్స్య పృథివీపతి సేనల నెల్లఁ గొంచు శౌ ర్యోన్నతి సూపువాఁడయి; సముద్ధతిమై నిట వేఱ కౌరవుల్ కొన్నిటిఁ బట్టఁ గయ్యమునకుం బఱతెంతురు పాండునందనుల్. |
126 |
| ఉ. |
కందువ సెప్పి యొక్కెడఁ ద్రిగర్తులు దాడికిఁ గూడువారు; మీ రందఱు వేఱ యొక్కయెడ నాజికి సేనల గూర్పుఁ; డెల్ల వాఁ డుం దనవారిఁ దోకొని కడున్ రభసంబునఁ గూడి వార్తకున్ ముందఱఁబోయి గోధనము ముట్టుకొనన్ వలయున్ మహోగ్రతన్.’ |
127 |
| వ. | అని చెప్పి వెండియు సుశర్మం జూపి. | 128 |
| క. |
‘బహుళాష్టమి నీతఁడు స | న్నహనముతోఁ బసులఁ బట్టు, నవమిని మన గో గ్రహణ’మని నిశ్చయించిన | నహికేతను పలుకులకు మహాహ్లాదమునన్. |
129 |
| వ. | సమస్త పరిజనంబులును సముద్యుక్తులై; రట్టి సమయంబున. | 130 |
| ఆ. |
పాండురాజసుతులుఁ బాంచాలియును దమ్ము | నొరు లెఱుంగకుండఁ దిరుగవలయు దుష్కరంపుటేఁడు దుదిసేరఁబాఱె, నె | వ్వరును దీనిఁ దలఁప వలను లేర. |
131 |