| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | విరాటపర్వము - తృతీయాశ్వాసము |
| వ. | ఇట్లు దలపడి. | 187 |
| మ. |
పటువేగంబగు శాతభల్లచయ సంపాతంబునన్ మింట మి క్కుటమై మంట ధగద్ధగద్ధగ యనం గోపంబు రూపంబులై చటులక్రీడఁ జరించు న ట్లిరువురున్ శౌర్యోన్నతిం బోరి రు త్కట దర్పోద్ధతులై పరస్పర జయాకాంక్షం బ్రచండంబుగన్. |
188 |
| క. |
తదవసరంబున నొక్కటఁ | బది యమ్ములు తొడి త్రిగర్తపతి వక్షంబున్ వదనంబు నేసి విరటుఁడు | మదమునఁ దురగములనేసె మఱియుఁ బదింటన్. |
189 |
| క. |
ఇంచుకయు నీడఁబోవక | కాంచన పుంఖప్రకాండ కాంతి స్ఫాయ త్పంచాశద్బాణంబులు | నించె నతఁడు మత్స్య మేదినీపతి మేనన్. |
190 |
| తే. |
దొరలు తలపడ్డ నాహవదోహలమున | నుభయ బలములుఁ దమకించి యోర్వలేక కలయబెరసి భూ రేణువు కతన రాత్రి | గాకమున్న యొండొరువులఁ గానరైరి. |
191 |
| క. |
క్షతములఁ బెల్లు తొరఁగు శో | ణితము రజఃపటల మడఁచి నెఱపిన నరుణ ద్యుతిఁ దమము వాపు వేకువ | గతిఁ దత్సమయం బతి ప్రకాశత నొప్పెన్. |
192 |
| ఉ. |
దానికిఁ జిత్తవృత్తులు ముదంబునఁ బొందఁగ, మేను లుబ్బఁగా సేనలు రెండు నుద్భట విజృంభణతన్ వివిధాస్త్ర ఘట్టన ధ్వానము దిక్కులం బరఁగఁ దాఁకి రణం బొనరించె; నత్తఱిన్ భానుఁడు పశ్చిమాద్రిఁ గనుపట్టెఁ దలిర్చిన మావిమో కనన్. |
193 |
| క. |
సమరంబున భటులు కడున్ | శ్రమమొందిరి, తమము గవిసినంగాని సము ద్యమ సంరంభ ముడుగ, రిది | సమయం బని తొలఁగినట్లు సవితృఁడు గ్రుంకెన్. |
194 |
| వ. | తదనంతరంబ. | 195 |
| క. |
ముఱిముఱి చీఁకటియప్పుడు | నఱిముఱి భటు లుడుగ కడరి యని సేయంగా నెఱసి తమ మెల్లయెడఁ గ్రి | క్కిఱిసిన మఱి పాసి నిలిచి రింతను నంతన్. |
196 |
| వ. | ఇట్లుభయ సైనికులు సాంద్ర సంతమసంబునం జేయునది లేక సంగ్రామంబు దక్కి తమకం బెక్క నొక్కింత సే పూరకున్నంత. | 197 |
| క. |
తన మనుమలు పాండుతనయు | లనిసేఁతకు వేడ్కసేయు టాత్మఁ గని తమం బున వారు మెఱయ రని వ | చ్చిన క్రియ శశి పూర్వశైలశిఖరం బెక్కెన్. |
198 |
| క. |
వెలుఁగు గని కడఁగి యిరువాఁ | గులుఁ బోరికిఁ జొచ్చె; మత్స్య కుంజరుఁడును న గ్గలమగు మగఁటిమి సొంపునఁ | దలపడియె సుశర్మతోడఁ దదనుజు తోడన్. |
199 |
| చ. |
తలపడి పోర వారి యరదంబు లనేకము లొక్క పెట్ట యి ట్టలపు రయంబునం బొదివి డాసెఁ గడంగి వడిం ద్రిగర్తనా థులు నిరుతేరుఁ దద్రథముతోఁ గదియించి తదీయ సారథిన్ బలువిడిఁ గూల్చి రథ్యముల ప్రాణములుం గొని రుగ్రమూర్తులై. |
200 |
| వ. | ఇవ్విధంబున విరాటుండు విరథుం డగుటయు. | 201 |
| చ. |
అతిరభసంబుమై నడరి యాతనిఁబట్టి, సుశర్మ పెల్చ నా ర్చి తన రథంబుపై నిడి, యశేష బలంబులు నల్దెసన్ భయ ద్రుతగతిఁ బాఱినన్ విజయదుందుభు లొక్కట మ్రోయ విక్రమో ద్ధతి విభవంబునన్ మది ముదం బొలయన్ మరలెన్ మహోద్ధతిన్. |
202 |
| వ. | అట్టియెడ ధర్మతనయుం డనిలనందను నవలోకించి సత్వరంబగు చిత్తంబుతో మత్స్యవిభుని వలను సూపుచు నిట్లనియె. | 203 |
| తే. |
‘ఇతని యాశ్రయమున మనమెల్ల బ్రదికి | యున్నవారము గావున నుగ్ర రిపుల పాలువడకుండ విడిపింపఁ బాడి యితని | నెయిదు మెయిదుము రథరయ మెసకమెసఁగ. |
204 |
| చ. |
అనవుడు మేను పెంచుచు మహాబలనందనుఁ డప్పు డన్న కి ట్లను ‘నిదె సాలవృక్షము; రయంబున దీన నరాతిసేన డొ ల్ల నడిచి, యీ సుశర్ముని బలంబుఁ జలంబును మాన్పి, యవ్విరా టుని విడిపించెదన్ రణపటుత్వము వైరులు పిచ్చలింపఁగన్. |
205 |
| తే. |
నీవుఁ దమ్ములు నొక్కెడ నిలిచి చూచు | చుండుఁ ‘డని పల్కుటయుఁ బుయిలోట తోడఁ గీచకారాతిఁ దప్పకచూచి నగుచు | నతని కిట్లని చెప్పె ధర్మాత్మజుండు. |
206 |
| క. |
‘తరువు వెసఁ బెఱికికొని నీ | వురవడిమైఁ గవిసితేని నుభయబలము న చ్చెరువందుచుఁ జూచి వృకో | దరుఁడ వగుట యెఱుఁగకున్నె! తద్విధ మేలా? |
207 |
| వ. | కవలు నీకుఁ జక్రరక్షకులుగా లోకసామాన్యంబులైన చాప కృపాణ గదాదులగు నాయుధంబుల విరోధివధం బాపాదించి వేవేగ విరాటు విడిపింపుము.’ | 208 |
| చ. |
అను పలు కంకుశంబున క్రియం గుదియించిన నిల్చి, భూరుహం బున దెస వోక, మత్తగజపుంగవు చందమునన్ సమీరనం దనుఁడు శరీర దోలన విధా పరిశోభిత విక్రమోద్యమం బున విలసిల్లి యిట్టు లను భ్రూకుటి ఫాల మలంకరింపఁగన్. |
209 |
| క. |
‘మీ పనిచినట్ల చేసెద | నేపారిన వైరిబలము నెల్లను బాహా టోపమున నోర్చి మత్స్యమ | హీపతి విడిపించి తెచ్చి యిచ్చెద మీకున్’. |
210 |
| వ. | అనిన విని కౌంతేయాగ్రజుండు సంతసిల్లి తమయంతపట్టునుం గూడుకొని. | 211 |