| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | విరాటపర్వము - చతుర్థాశ్వాసము |
| చ. |
‘తడవగుదెంచె; జమ్మికిఁ బ్రదక్షిణవృత్తిగఁ దేరు వోవని; మ్మెడ గలుగంగఁ బోయెఁ బసు; లిప్పుడ కూడుద’ మన్న నాతఁడున్ నడపఁ దొడంగుడున్ మనమునన్ రణకౌతుక ముల్లసిల్లఁగాఁ బిడుగుల పిండు బిట్టులియు పెల్లునఁ బార్థుఁడు శంఖ మొత్తినన్. |
171 |
| మ. |
కలఁగెం దోయధి సప్తకంబు; గిరివర్గం బెల్ల నూటాడె, సం చలతం బొందె వసుంధరావలయ; మాశాచక్ర మల్లాడెఁ; గొం దల మందెం ద్రిదశేంద్రు పట్టణము; పాతాళంబు ఘూర్ణిల్లె; నా కులమయ్యెన్ గ్రహతారకాకులము; సంక్షోభించె నవ్వేధయున్. |
172 |
| తే. |
అపుడు నిశ్చేష్టితంబులై హయము లవనిఁ | జాఁపకట్టుగఁ బడియె; మత్స్యక్షితీశ నందనుండును నొగలపై మ్రందినట్లు | మ్రొగ్గతిలఁ జాఁగి బలితంపు మూర్ఛఁ బొందె. |
173 |
| చ. |
కనుఁగొని ఫల్గునుండు తురగంబుల వాగెలు వట్టి యెత్తి, త త్తనువులు నూల్కొనన్ నివిరి, తత్పరతం దగ మత్స్యభూమిభృ త్తనయుని నూఁదిపట్టి, వికృతంబగు రూపము చక్కఁజేసి, నె మ్మన మొకభంగిఁ దేర్చి, గరిమంబుగఁ గౌఁగిటఁ జేర్చి, యిట్లనున్. |
174 |
| తే. |
‘శంఖ భేరీ రవంబులు, సామజముల | బృంహితంబులు వింతలే పృథుల సైన్య పరిచయోదాత్తులగు నరపాల సుతుల? | కెలమిఁ బొందుము దీనికి నింత యేల?’ |
175 |
| చ. |
అనవుడు మత్స్యరాజసుతుఁ డాతని కిట్లనుఁ ‘దొల్లి శంఖ ని స్వనములు విందు, భేరుల రవంబులు విందుఁ, గరీంద్ర బృంహిత ధ్వనులును విందు, నద్భుత విధంబుగ ని ట్లవి యెల్లఁ జిత్తమో హన మొనరింపఁ జాలునె! మహానినదం బిది యోర్వవచ్చునే? |
176 |
| చ. |
చెవు లవిసెన్, దిశల్ దిరిగెఁ, జిత్తము నీరయిపోయె నాకు నీ రవమున; నిమ్మహోగ్ర కపిరాజు పతాకయుఁ జూడ్కిఁ జీఁకటుల్ గవియఁగఁ గ్రాలెడున్, భవదఖండిత తేజము పర్వి యాత్మకున్ వివశతఁ జేయుచున్నయది, విహ్వల భావము మాననేర్చునే?’ |
177 |
| క. |
అన విని తగు మాటల నా | తని కొందలపాటు పాండుతనయుండు క్రమం బున డిందుపఱిచి యరదము | సనఁగా నెఱిఁగించి పట్టె శంఖము మఱియున్. |
178 |
| వ. | ఇత్తెఱంగున నయ్యుత్తర కుమారు ధీరుంగావించుకొని పాండవవీరుండు రథనేమి నిస్వన జ్యానాద మేదురం బగు శంఖారవంబు సెలంగ నడచు సమయంబున నాచార్యుండు దుర్యోధనున కిట్లనియె. | 179 |
| సీ. |
‘శ్రవణ పుటంబులు వ్రయ్యంగఁ దాఁకి సం | క్షోభంబు గావించె గుణము మ్రోఁత; బ్రహ్మాండ భాండంబు పగిలించి భూత ని | శ్చైతన్య మొనరించె శంఖ రవము; గగనభాగం బెల్లఁ గప్పి క్రాలుచు బెగ | డడరించె నుగ్రంపుఁ బడగపఱపు; మిఱుమిట్లు గొని చూడ్కి పఱివోవ వెలిఁగి ప | రి భ్రాంతి సేసెఁ గిరీట కాంతి; |
|
| తే. |
తెల్ల మిది గాండివంబును దేవదత్త | మును గపిధ్వజమును వాసవుని వరమునఁ గన్న మకుటంబు నగు; వేఱ కొన్ని యైన | నుజ్జ్వలాద్భుత భంగులై యున్నె యిట్లు! |
180 |
| ఉ. |
అచ్చెరువైన విక్రమము నగ్గలికన్ సమరంబు గోరి యీ వచ్చుచునున్నవాఁడు బలవద్రిపుభీషణబాహుఁ డైన వి వ్వచ్చుఁడ; యింక మిన్నక వివాదము సేసినఁ బోవ; దియ్యెడం బొచ్చెము లేని బల్మగలఁ బోరి కమర్పుము దర్పమేర్పడన్.’ |
181 |
| వ. | అని కృపాశ్వత్థామాది యోధముఖ్యుల నవలోకించి. | 182 |
| క. |
‘మనమొనల దుర్నిమిత్తము | లనేకములు పుట్టఁ దొడఁగె; నట్లగుట జయం బనుమానం; బొక కార్యము | వినుఁడా! మీకెల్లఁ జూడ వెరవగు నేనిన్. |
183 |
| ఉ. |
ముందర రాజుఁ బుచ్చి, బలముల్ గలయంబడి గోవ్రజంబులన్ దందడి పెట్టకుండఁ బిఱుఁదన్ నడిపింపఁగఁ బంచి, గట్టిమై నందఱు నింతకున్ వెనుకయై మొనలేర్చి చనంగ, నెప్డు సం క్రందనసూతి డగ్గఱియెఁ, గయ్యము సేయుట కప్పు డిమ్మగున్.’ |
184 |
| వ. | అనిన విని సుయోధనుండు భీష్మ కృప కర్ణ వికర్ణుల దెసం గనుంగొని ‘మున్నునుం జెప్పితిన కాదె! జూదంబునం బరాజయం బొంది, పాండునందనులు పండ్రెండు వత్సరంబులు వనంబున వసియింపను, బదుమూఁడగు నేఁడు జనపదంబున మన మెఱుంగకుండఁ జరియింపనుం బూని కాదె భూమి వెలువడిరి; యా పదుమూఁడవ యేఁటి కొఱంత గలుగం బార్థుండు దన్నెఱింగించి కొనియె నేని నెప్పటియట్ల వనవాసంబునకుం జనవలయు; నిది మనము మోహంబునం గానమి నొండె; వారు లోభంబున వచ్చుట నొండె నగుం గావున నెక్కువ దక్కువలు నిరూపించి భీష్ములు దీని నిశ్చయింప నర్హులు; రిత్త యుత్తరుండ కాక గాండీవియు నగుట మన కార్యంబు సఫలంబు; సుశర్మ నక్కడ గోవులం బట్టం బనిచి యిక్కడ మనమును బట్టుట మత్స్యనగరంబునం గౌంతేయులున్నవారని శంకించి వారలు కూయి వచ్చినం గనుటకుం గాదె? యిట్లు నిశ్చయించి చేసిన పనికి నిపుడు విచారం బేల?’ యని పలికి వెండియు నిట్లనియె. | 185 |
| ఉ. |
‘అర్జునుఁడైన నేమి? సురలైనను నేమగు? విద్విషచ్ఛిదో పార్జితమైన గోగణముఁ బట్టితి; మెవ్వరు వచ్చిరేని వి స్ఫూర్జిత బాహుసంపదలు సూపుద మొండొరు మీఱి నిర్మలా త్యూర్జిత కీర్తికారణ రణోద్ధతి; వెల్వెలఁ బాఱ నేటికిన్? |
186 |
| చ. |
మనసుల నూలుకొల్పి, యనుమానము లెల్లను బాచి, యేచి వా హనములు నాయుధంబులును నాయిత మయ్యెడు భంగిఁ జేయుచున్ మొనలకు హెచ్చుగా మనము మున్ను గడంగినఁ గాక శత్రులం గనుఁగొని యిట్టు లొండొరు మొగంబులు సూచుచునున్నఁ బోవునే? |
187 |