| ఇతిహాసములు | మొల్ల రామాయణము | అయోధ్య కాండము |
| సూర్యాస్తమయ వర్ణనము | ||
| తే. |
పగలు ప్రాగ్భాగమున నుండి గగన వీథిఁ జరమ దిక్కున కేఁగఁగా శ్రమము దోఁచి చెమట పట్టిన స్నానంబుఁ జేయ నరుగు కరణి, నపరాబ్ధిలో దివాకరుఁడు గ్రుంకె. |
6 |
| క. |
మేలిమి సంధ్యా రాగము వ్రాలిన చీఁకటియుఁ గలిసి వరుణుని వంకన్ నీలముఁ గెంపును నతికిన పోలికఁ జూపట్టె నట నభోమణి తలఁగన్. |
7 |
| క. |
వారక కల్ప ద్రుమమునఁ గోరకములు పుట్టినట్లు గురుతర కాంతిన్ దారకములు తలసూపెన్ జోరానీకమ్ము మిగుల స్రుక్కుచు నుండన్. |
8 |
| ఆ. |
కారు మొగులు రీతిఁ, గాటుక చందాన, నీటి భాతి, నింద్ర నీల మహిమ, మాష రాశి పోల్కిఁ, మఱి మఱి యపు డంధ కార మవని యెల్లఁ గలయఁ బర్వె. |
9 |
| వ. | అట్టి సమయంబున. | 10 |
| చ. |
తలవరులన్, నిజాధిపుల, దర్పకు నేర్పునఁ గన్నుఁ బ్రామి, య త్తలఁ, దమ పిన్నపాపల, నుదారత నేర్పడ నిద్రపుచ్చి, ని ర్మల కర కంకణావళులు, మట్టెలు రట్టుగ మ్రోఁగనీక, వి చ్చలవిడిగాఁ జరించి రొగి జార లతాంగులు మధ్య రాత్రులన్. |
11 |
| చ. |
సురతము లేక యుస్సురను జోటి, మగం డుడికించు కాంతయున్, సరస మెఱుంగు చంద్రముఖి, సావడి దంటయు, బేరకత్తెయున్, బర పురుషాభిలాషమును బాయని భామిని, పోరుకట్టునన్ బరఁగిన భామ లాది యుపభర్తలఁ గూడి చరించి రత్తఱిన్. |
12 |