ఇతిహాసములు మొల్ల రామాయణము కిష్కింధాకాండము
శ్రీ రామాయణము - కిష్కింధాకాండము
క. పక్షీంద్ర వాహ! గిరిజా
త్ర్యక్ష మనోబ్జాత గేహ! యపహృత మోహా!
రాక్షస భీమా! ముని జన
సాక్షాత్కృత నైజ ధామ! జానకి రామా!
1
వ. శ్రీ నారద మునీశ్వరుండు వాల్మీకి మహా మునీశ్వరున కెఱిం
గించిన తెఱం గెఱింగించెద నాకర్ణింపుము,
2
సుగ్రీవుని పంపున రామ లక్ష్మణుల సన్నిధికి హనుమంతుని రాక
సీ. పంపా తటమ్మున బాణాసనాయుధ-పాణులై యున్న భూపాల సుతులఁ
గనుగొని భీతిల్లి, కమలాప్త సూనుండు-వాలి పంపున వీరు వచ్చి రనుచుఁ
గలఁగి, తా ఋష్యమూకంబున నుండగ-వెఱచి, మలయ శైల విపిన సీమఁ
దిరిగి, వారల రాక తెఱఁ గెల్లఁ దెలిసి రా-బవనాత్మజుని వేగఁ బంప, నతఁడు
 
తే. వచ్చి రఘురాము శ్రీపాద వారిజముల-కర్థిఁ బ్రణమిల్లి, మీ రెవ్వ రయ్య? యిటకు
నేమి కతమున వచ్చితి? రేది నామ?-మనుచు నడిగిన సౌమిత్రి యతని కనియె.
3
సీ. దశరథుం డను రాజు తనయుల, మాతని-పంపునఁ దప మాచరింపఁ గోరి
వచ్చి, కానన భూమి వర్తించుచుండ, నీ-రాజు దేవిని దుష్ట రావణుండు
కుటిల వృత్తిని నెత్తుకొని పోవ, నా జాడ-వదలక దిక్కులు వెదకి వచ్చి,
శబరికి మా రాక చందంబుఁ దెలియంగఁ-జెప్పిన, "నర్కజుచేతఁ గాని
 
తే. మీదు కార్యంబు నెగ్గదు, మీర లరిగి-వేగ సుగ్రీవు చెల్మి గావింపుఁ" డనిన
వచ్చినారము గనుఁగొన వలసి యతని,-నతఁడు రాముండు, లక్ష్మణుం డండ్రు నన్ను.
4
తే. తలఁప నీ రాజునకు నెందు ధాత్రిలోన
విను మసాధ్యంబు లైనట్టి పనులు లేవు,
సూర్య వంశోత్తముఁడు మహా శూరుఁ డితఁడు,
నీకుఁ బేరేమి చెప్పుమా మాకు ననిన,
5
తే. వాయు దేవుని బ్రార్థించి, వేయి గతుల
నంజనాదేవి గాంచిన యాత్మజుండ,
నర్కజుని మంత్రినై యుందు ననుదినంబు,
వినుఁడు నా పేరు హనుమంతుఁ డనుదు రిలను.
6
వ. అని చెప్పి మఱియు నిట్లని విన్నవించె 7
చ. వినుఁడు మహాత్ములార! యరవింద హితాత్మజుఁ దోడితెచ్చి, మి
మ్మును బొడఁ గానుపింతు నని మ్రొక్కుచు నేఁగి, కపీంద్రుఁ జేరి, తాఁ
జనిన తెఱంగు, వారిఁ గను చందము నేర్పడఁ జెప్పి, గొబ్బునన్‌
బనిగొనివచ్చి, రాము పద పంకజముల్‌ గనిపించె నంతటన్‌.
8
AndhraBharati AMdhra bhArati - molla rAmAyaNamu - kiShkiMdhaakaaMDamu ( telugu andhra )