| ఇతిహాసములు | మొల్ల రామాయణము | కిష్కింధాకాండము |
| వర్షా వేళ శ్రీరామ సీతా వియోగ పరితాపము | ||
| సీ. |
బ్రహ్మాండ మగలంగఁ బటపట ధ్వనులతో-నుఱుము లంతంతకు నుఱుము చుండఁ, గడు భయంకరముగా వడ మ్రోగు మ్రోఁతలఁ-బిడుగు లాడాడ గుభిల్లు మనఁగఁ, గ్రముకంబు లంతేసి కణములతోఁ గూడఁ-గరుడు గట్టిన వడగండ్లు రాలఁ, గొఱివి దయ్యంబుల మఱిపించు తెఱఁగున-విద్యుత్ప్రకాశమ్ము విస్తరిల్ల, |
|
| తే. |
ముసుఁగు వేసిన చందాన మొగులు గప్పి-మీఱి నలుపెక్కి చీఁకట్లు కాఱుకొనఁగ, మించి కడవల నుదకంబు ముంచి తెచ్చి-క్రుమ్మరించిన గతి వాన కురిసె నపుడు. |
20 |
| క. |
ఏఱులు కా ల్నడ తప్పఁగఁ బాఱెను, సస్యములు పండె, ఫల వృక్షములున్ మీఱి ఫలించెను, ధరఁ బా లేఱులుగా సురభు లెల్ల నెప్పుడుఁ బితికెన్. |
21 |
| వ. |
అంత వర్షాకాలాంతంబు గాఁగ నమ్మహీకాంతుండు ప్రేయసీ వియోగ పరితాపానలంబునఁ బొరలుచు నోర్వలేక విభ్రాంత స్వాంతుండై యుండ, |
22 |
| సీ. |
పలుమాఱు నీ హస్త పల్లవంబులచేత-నలివేణి! నా తాప మార్పవేల? నళినాక్షి! పరిరంభణ క్రీడఁ దేల్చు నీ-మది నొప్పి నా నొప్పి మాన్పవేల? చెలియ! యోష్ఠామృత సేవకై నీ యల్క-వడిఁ దప్పి నా దప్పి గడపవేల? భామ! తాపానల పరితాప ముడుప నీ-తనువు నా తనువునఁ బెనఁచవేల? |
|
| ఆ. |
యనుచు సీతఁ బిలుచు, నందంద పరికించు,-దిక్కు లాలకించు, నిక్కి చూచు, దశరథాత్మజుండు తన్నుఁ దా మఱచుచు-బయలు కౌఁగిలించుఁ బలువరించు. |
23 |
| వ. | అని మఱియును, | 24 |
| ఉ. |
కూరలు నోటికిన్ రుచులు గూడుట దప్పెను, దుంపదూఁడులుం గారము తోఁచె, జిహ్వకును గమ్మని తేనెలు చేఁదు లయ్యెఁ, గం గారయెఁ జిత్తమంతయును, గంటికి నిద్ర రహింపదయ్యె శృం గార మెలర్ప సీతఁ బొడఁగానమి, రామనృపాల మౌళికిన్. |
25 |
| ఉ. |
తాలిమి తూలిపోయి పరితాపమునం దిరుగాడు, నొక్కచోఁ గాలును నిల్వఁద్రొక్క నధికారము చాలక యెప్పుడుం గడున్ జాలి వహించుఁ, జిత్తమునఁ జంచలతం గను, భూమి పుత్త్రిపై మేలిమిఁ జేసి రాముఁడట మిన్నక వేదురు గొన్న కైవడిన్. |
26 |